పాయెగా సమాధుల నిర్మాణాలు & అసఫ్ జాహీల కాలం నాటి కట్టడాలు (1724 - 1948) | Monuments of Asaf Jahi Period

TS STUDIES | TELANGANA HISTORY SPECIAL

పాయెగా సమాధుల నిర్మాణంలో ఏ శైలులను వాడారు? & అసఫ్ జాహీల కాలం నాటి కట్టడాలు

గ్రూప్స్ (TSPSC), పోలీస్ (TGPRB) & ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం - జనరల్ స్టడీస్ - తెలంగాణ చరిత్ర

పాయెగా సమాధుల నిర్మాణంలో ఏ శైలులను వాడారు - అసఫ్ జాహీల కాలం నాటి కట్టడాలు

1. అసఫ్ జాహీల నేపథ్యం & హైదరాబాద్ నగర రక్షణ గోడలు

అసఫ్ జాహీలు 17వ శతాబ్దంలో మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి మొగల్ సామ్రాజ్యంలో ఉన్నత పదవులు అలంకరించారు. కుతుబ్‌షాహీల పతనం తర్వాత 1687–1724 వరకు హైదరాబాద్ నగరం మొగలుల ఆధీనంలో ఉంది. మొగల్ గవర్నర్ ఔరంగబాద్ నుంచి పరిపాలన చేపట్టాడు. చార్మినార్ వద్ద కుతుబ్‌షాహీలు నిర్మించిన అనేక కట్టడాలను మొగల్ సైన్యం నాశనం చేసింది. మరాఠాల దాడుల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు మొగలులు 1724లో నగరం చుట్టూ గోడల నిర్మాణాన్ని ప్రారంభించారు.

మొగల్ గవర్నర్ అయిన మీర్ ఖమ్రుద్దీన్ నిజాం ఉల్ ముల్క్ 1724లో హైదరాబాద్‌లో ‘అసఫియా’ వంశాన్ని స్థాపించాడు. అసఫ్‌జాహీ నిర్మాణాలు హైదరాబాద్ నగర రక్షణ గోడలతోనే ప్రారంభమయ్యాయి. మీర్ ఖమ్రుద్దీన్ నిజాం-ఉల్-ముల్క్ ఔరంగబాద్ నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించాడు. 1740 నాటికి హైదరాబాద్ చుట్టూ రక్షణ గోడల నిర్మాణం పూర్తయింది. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల వల్ల మొదటిసారిగా రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కొన్ని ద్వారాలు మాత్రమే ఉండగా, అవి కూడా అవసాన్ దశలో ఉన్నాయి.

దాబీర్‌పుర ద్వారం & 17 దర్వాజాలు:

  • హైదరాబాద్ చుట్టూ 17 ద్వారాలను నిర్మించారు. అందులో ముఖ్యమైన దాబీర్‌పుర ద్వారాన్ని 1724–40 మధ్య కాలంలో నిర్మించారు.
  • హైదరాబాద్ రాజ్యంలోని పండితుల్లో ఒకరైన అబ్దుల్ సమద్ దాబీర్-ఉల్-ముల్క్ పేరును ఈ ద్వారానికి పెట్టారు.
  • 1750 నాటికి హైదరాబాద్ నగరం 2.25 లక్షల జనాభాతో దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న నగరంగా ఆవిర్భవించింది.

1763 తర్వాత అసఫ్ జాహీ కట్టడాల నిర్మాణం:

  • 1763 తర్వాత అసఫ్ జాహీ కట్టడాల నిర్మాణం ఊపందుకుంది. అసఫ్ జాహీల కాలంలో నిర్మించిన కట్టడాల్లో పాయెగా సమాధులు, పైదానిమా సమాధి, చౌమహల్లా ప్యాలెస్, పురానా హవేలీ, బేగం బజార్, రేమండ్ సమాధి, గన్‌ఫౌండ్రీ, బ్రిటిష్ రాజప్రతినిధి కోఠి, హైకోర్టు భవనం, ఆర్ట్స్ కాలేజీ భవనం, దివాన్ దేవ్డీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం ముఖ్యమైనవి.
  • 1748లో మీర్ అహ్మదుద్దీన్ అసఫ్‌జా లాడ్ బజార్‌లో షాహీ జిలూఖానా ద్వారాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణంలో రాజస్థానీ శైలిని వాడి వంపులు, కిటికీలను నిర్మించాడు. మలి మొగలుల శైలిలో తోరణాలు, ముఖద్వారాన్ని నిర్మించారు.
  • 1724–40 మధ్య కాలంలో నిర్మించిన హైదరాబాద్ నగర కోటల్లో భాగంగా అలియాబాద్ సరాయిని మొదటి అసఫ్‌జా నిర్మించాడు. పాత నగర దక్షిణ కోట భాగాలను ఇప్పటికీ అలియాబాద్ పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు.

2. రెండో అసఫ్‌జా (నిజాం అలీఖాన్) కాలంలోని నిర్మాణాలు

  • గన్‌ఫౌండ్రీ (1795): 1795లో మన్సీ రేమండ్ సహాయంతో ఫిరంగుల తయారీ పరిశ్రమను గన్‌ఫౌండ్రీ పేరుతో రెండో అసఫ్‌జా నిజాం అలీఖాన్ నిర్మించాడు. గన్‌ఫౌండ్రీ నిర్మాణంలో ఇటుకలు, మోర్టార్‌ను వాడారు.
  • మన్సీ రేమండ్ సమాధి (1798): రెండో నిజాం రాజు నిజాం అలీఖాన్ సైన్యంలో ముఖ్యమైన ఫ్రెంచ్ అధికారి మన్సీ రేమండ్. ప్రజలు ఇతణ్ని ముసారాముడని పిలిచేవారు. ఇతడి పేరు మీద ముసారాంబాగ్ నిర్మాణం జరిగింది. 1798లో మన్సీ రేమండ్ మరణించాడు. ఇతడి సమాధిని యూరోపియన్ శైలిలో 28 పిల్లర్లతో ముసారాంబాగ్ వద్ద నిర్మించారు. ఈ నిర్మాణంలో ఊదారంగు గ్రానైట్ రాయిని వాడారు.
  • పాయెగా (Paigah) సమాధులు: వీటి నిర్మాణాన్ని 1786లో ప్రారంభించారు. పాయెగా సమాధులను మక్బరా షమ్స్-ఉల్-ఉమారా సమాధి కూడా అంటారు. హైదరాబాద్ రాజ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు పాయెగాలు. నిజాం అలీఖాన్ కాలంలో 1780 నుంచి 1803 వరకు షమ్స్-ఉల్-ఉమారా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. పాయెగా సమాధుల నిర్మాణంలో మొగల్, మూరిష్ శైలులను వాడారు. ఈ సమాధుల నిర్మాణంలో సున్నం, మోర్టార్‌ను ఉపయోగించారు. ఈ సమాధుల్లో రేఖాగణిత చిత్రాలు, పూలమొగ్గల డిజైన్లు, వంపుల నిర్మాణాలు చూడవచ్చు.
  • పురానా హవేలీ: రెండో నిజాం కాలంలో పురానా హవేలీ నిర్మాణం ప్రారంభమైంది. పురానా హవేలీ ప్రాంతాన్ని రుకును-ఉద్-దౌలా నుంచి నిజాం అలీ తీసుకొని తన కుమారుడైన సికందర్ జా కోసం హవేలీ (అంతఃపురం) ని నిర్మించాడు. ఈ హవేలీలోని ప్రధాన భవనాన్ని 18వ శతాబ్దం నాటి యూరోపియన్ శైలిలో నిర్మించారు. పురానా హవేలీ U ఆకారంలో ఉంటుంది. ప్రధాన భవనానికి రెండు వైపులా దీర్ఘచతురస్రాకారంలో ఒకదానికొకటి సమాంతరంగా ఈ భవనాలను నిర్మించారు. ఈ హవేలీలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్కపు అలమారాను (Wooden Wardrobe) ఏర్పాటు చేశారు. సికందర్ జా కొన్ని రోజులు ఇక్కడ నివసించిన తర్వాత కిల్వత్ మహల్‌కు మారాడు. సికందర్ జా ఈ హవేలీని వదిలి పెట్టడం వల్ల పురానా హవేలీ అని పేరొచ్చింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పురానా హవేలీలో మ్యూజియంను ఏర్పాటు చేశాడు. పురానా హవేలీలోని అద్దాల భవనం దీని ఖానా (ప్రార్థనా మందిరం తెచ్చిన అద్దాలతో నిర్మించిన భవనం) చెప్పుకోదగింది.

3. సికందర్ జా (1803–1829) & నాసిరుద్దౌలా (1829–1857) కాలంలోని నిర్మాణాలు

A. సికందర్ జా (1803 - 1829) కాలంలోని నిర్మాణాలు:

  • బ్రిటిష్ రెసిడెన్సీ (కోఠి): నిజాం రాజు సైన్య సహకార సంధిపై సంతకం చేసిన తర్వాత బ్రిటిష్‌వారు హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ రాజప్రతినిధి అధికార నివాసాన్ని సుల్తాన్ బజార్‌లో నిర్మించారు. 1805లో జాన్ శామ్యూల్ రస్సెల్ రెసిడెన్సీ భవన డిజైన్ (ప్రణాళిక)ను రూపొందించాడు. 1803–04లో రెసిడెన్సీ భవన నిర్మాణం పూర్తయింది. ఈ శైలిని యూరోపియన్ శైలి కట్టడమంటారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో కోఠిని ప్రతినిధిగా ఉన్న అఖిలీస్ కిర్క్‌పాట్రిక్ ఉన్నాడు. ఈ నిర్మాణంలో ప్రధాన కేంద్ర బ్లాకును ఇటాలియన్ శైలిలో నిర్మించారు. ఈ శైలిని అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధంలో చూడవచ్చు. బ్రిటిష్ రాజప్రతినిధి నివసించే కోట ప్రాంతం వల్ల దానికి కోఠి అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఈ భవనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమెన్స్ కాలేజీని నిర్వహిస్తున్నారు.
  • రాజస్థానీ శైలి దేవాలయం: 1803–29 మధ్య కాలంలో సికందర్ జా వద్ద మిలటరీ అధికారిగా పనిచేసిన బామ్ సింగ్ కార్వాన్‌లో రాజస్థానీ శైలిలో ఒక దేవాలయాన్ని నిర్మించాడు.

B. నాసిరుద్దౌలా (1829 - 1857) కాలంలోని నిర్మాణాలు:

  • సెయింట్ మేరీ క్యాథడ్రల్ చర్చి (1839): 1839లో లార్డ్ మర్ఫీ వద్ద పనిచేసిన మత గురువు డేనియల్ మర్ఫీ కృషితో 1850లో సికింద్రాబాద్‌లో సెయింట్ మేరీ క్యాథడ్రల్ మెయిన్ చర్చిని నిర్మించారు.
  • సీతారాంబాగ్ దేవాలయం (1845): 1845లో హైదరాబాద్ రాజ్య పేష్కార్ రాజా చందూలాల్ ఆళ్వార్ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించాడు.
  • భగవాన్ దాస్ గార్డెన్ పెవిలియన్: భగవాన్ దాస్ గుజరాత్‌కు చెందిన వైద్యుడు. ఇతడు కార్వాన్ వద్ద భగవాన్ దాస్ గార్డెన్ పెవిలియన్ నిర్మించాడు. రెండు అంతస్తుల ఈ భవనంలో ఆర్కెడ్ వరండాలు, బాల్కనీలను చెక్క ప్లాస్టర్ తయారీలో నిర్మించారు. ఈ గార్డెన్ మొగల్, గుజరాతీ శైలిలో మేలు రకం టేకుతో చెక్కి స్తంభాలు, వంపులు, కిటికీలను నిర్మించారు.

4. అఫ్జల్-ఉద్-దౌలా (1857 - 1869) కాలంలోని నిర్మాణాలు

  • అఫ్జల్‌గంజ్ మసీదు: 1857–61 మధ్య నయాపూల్ వద్ద మూసీ నదిపై వంతెన నిర్మించారు (అఫ్జల్‌గంజ్ వంతెన మరియు మసీదు).
  • చౌమహల్లా ప్యాలెస్: పర్షియా భాషలో చౌ అంటే నాలుగు అని అర్థం. అరబిక్ భాషలో మొహల్లా అంటే మహల్. చౌమహల్లా అంటే నాలుగు మహళ్లు ఉన్న ప్రాంతమని అర్థం. 1750లో సలాబత్‌జంగ్ చౌమహల్లా ప్యాలెస్‌కు పునాది వేశాడు. 1869లో అఫ్జల్‌దౌలా బహదూర్ చౌమహల్లా నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇరాన్ రాజుని చిహ్నంలోని షా మహల్ తరహాలో చౌమహల్లా ప్యాలెస్‌ను నిర్మించారు.
  • చౌమహల్లా ప్యాలెస్ విభాగాలు: ఈ ప్యాలెస్‌లో రెండు ప్రాంగణాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంగణాల్లో పొడవైన రాజభవనాలు, గొప్ప రాజదర్బారు హాలు, ఫౌంటెన్లు, తోటలు ఉన్నాయి. ఉత్తర ప్రాంగణంలో బారా ఇమామ్ ఉంది. ఇందులో తూర్పువైపు పొడవైన కారిడార్, దాని పక్కనే విశాలమైన గదులు ఉన్నాయి. గతంలో పరిపాలన కోసం ఈ గదులను ఉపయోగించారు. దక్షిణ ప్రాంగణంలో నాలుగు మహాలు ఉన్నాయి: అవి అఫ్జల్ మహల్, మహతాబ్ మహల్, తహ్నిత్ మహల్, అఫ్తాబ్ మహల్. వీటిలో అఫ్తాబ్ మహల్ అందమైంది. ఈ మహల్ ఉన్న ఏరియాను కిల్వత్ గదియారం అంటారు.
  • ఖిల్వత్ ముబారక్ & గ్రాండ్ దర్బార్ హాలు: చౌమహల్లాలోని దర్బారు హాల్లో అతి ముఖ్యమైన అధికారులను నిజాం రాజులు కలుసుకునేవారు. ఈ దర్బారులో పురాతన రాత ప్రతులు, పుస్తకాలను ఉంచారు. మరో సికందర్ జా కోసం రోషన్ మహల్‌ను ఉత్తర ప్రాంగణంలో నిర్మించాడు. కిల్వత్ మహల్‌లోని అతిగొప్ప నిర్మాణం గ్రాండ్ దర్బారు హాలు. ఇందులో మొగల్ శైలిలో గుమ్మటాలు (డోమ్‌లు), తోరణాలు నిర్మించారు. గోడలను పర్షియన్ శైలిలో అలంకరించారు. 19 బెల్జియన్ క్రిస్టల్ షాండ్లియర్లను దర్బారులో ఏర్పాటు చేశారు. నిజాం రాజులు తమ రాజకీయ, మత సమావేశాలు, పండుగలను గ్రాండ్ దర్బారులో నిర్వహించేవారు. 1906లో వేల్స్ రాకుమారుడు భారత్ వచ్చినప్పుడు అతడి గౌరవార్థం గ్రాండ్ దర్బారులో విందు ఏర్పాటు చేశారు.

5. మీర్ మహబూబ్ అలీఖాన్ (1869 - 1911) కాలంలోని నిర్మాణాలు

  • 1874లో తొలి రైల్వేలైను హైదరాబాద్ నుంచి వాడి వరకు బ్రాడ్‌గేజ్ నిర్మించారు. 1886లో బ్రిటిష్‌వారు చార్మినార్‌ను దెబ్బతినాల్సిన కట్టడాల జాబితాలో చేర్చారు.
  • హజ్రత్ బషీరున్నిసా సాహెబా సమాధి: మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రభుత్వంలో ఉన్న అధికారి అబ్దుల్ హక్ దిలీర్ జంగ్ తన తల్లి హైదనిషా సాహెబా మరణానంతరం హుస్సేన్ సాగర్ వద్ద ఆమె సమాధి నిర్మించాడు. ఈ సమాధి రెండు అంతస్తులుగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని తోరణాలు, అలంకరణలు మొగల్ శైలిలో ఉన్నాయి. మొదటి అంతస్తు, గుమ్మటాలు కుతుబ్ షాహీల వాస్తుకళ లేదా శైలిలో నిర్మించారు.
  • దివాన్ దేవ్డీ: చార్మినార్‌తో సాలార్‌జంగ్-1 పేరు మీద దివాన్ దేవ్డీని నిర్మించారు. ఇందులో మొగల్ శైలిలో రెండు ముఖద్వారాలు, అర్ధచంద్రాకార తోరణాలను నిర్మించారు.
  • అసెంబ్లీ భవనం (టౌన్ హాల్): మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ జన్మదినాన్ని పురస్కరించుకొని 1905లో టౌన్‌హాల్ నిర్మాణాన్ని ప్రారంభించి 1923లో పూర్తి చేశారు. దీన్ని పర్షియన్, రాజస్థానీ శైలిలో నిర్మించారు. తర్వాతి కాలంలో నిజాం ప్రభుత్వం ఈ హాల్‌ను శాసనసభగా మార్చింది.
  • ఫలక్‌నుమా ప్యాలెస్ (1884 - 1893): పాయెగా వంశానికి చెందిన అస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫలక్‌నుమా వద్ద బషీర్‌బాగ్ ప్యాలెస్‌ను నిర్మించాడు (తర్వాత ఆరో నిజాం దీనిని కొనుగోలు చేసి అతిథి గృహంగా మార్చాడు).
  • సిటీ కాలేజీ (1921): 1865లో మీర్ మహబూబ్ అలీఖాన్, మదరసా దార్-ఉల్-ఉలూం అనే మొదటి సిటీ స్కూల్‌ను ప్రారంభించాడు. తర్వాతి కాలంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాన్ని విస్తరించాడు. ప్రస్తుతం ఉన్న సిటీ కాలేజీ భవనాన్ని ఈ స్కూల్‌కు 1921లో మార్చాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ 18 ఎకరాల స్థలంలో ఇండో–సార్సెనిక్ శైలిలో సిటీ కాలేజీని రెండు అంతస్తులుగా నిర్మించాడు.
  • మొజంజాహీ మార్కెట్ (1935): 1935లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండో కుమారుడైన మొజంజా పేరు మీద మొజంజాహీ మార్కెట్‌ను నిర్మించాడు. దీన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు. దీనికి ఒక మానాన మినార్‌ను నిర్మించి, అందులో ఒక గడియారాన్ని పొందుపరిచారు.

6. మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911 - 1948) కాలంలోని నిర్మాణాలు

  • ఉస్మానియా జనరల్ ఆసుపత్రి (1919 - 1925): 1866లో రాజా ముకుంద్‌కుమార్, భూస్వాముల కోసం ఆఫ్జల్‌గంజ్‌లో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు. 1908లో మూసీనదికి వచ్చిన వరదల వల్ల ఈ ఆసుపత్రి ధ్వంసమైంది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ. 20 లక్షల వ్యయంతో నూతన ఆసుపత్రి భవనాన్ని ఆఫ్జల్‌గంజ్‌లో నిర్మించాడు. ఆయన పేరుమీద ఈ ఆసుపత్రికి ఉస్మానియా జనరల్ ఆసుపత్రిగా నామకరణం చేశాడు. ఉస్మానియా ఆసుపత్రిని ఇండో-సార్సెనిక్ శైలిలో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి విన్సెంట్ జెరోమ్ ఎస్చ్ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇతడు నగర ఉన్నత పాఠశాల, హైదరాబాద్ రైల్వేస్టేషన్, హైకోర్టు భవనాలను కూడా రూపొందించాడు.
  • కింగ్ కోఠి ప్యాలెస్ (నజరీబాగ్): 1911లో కమల్ ఖాన్ తన సొంత అవసరాల కోసం సుల్తాన్‌బజార్ ప్రాంతంలో నూతన ప్యాలెస్‌ను నిర్మించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ప్యాలెస్‌ను నచ్చాడు. దాంతో కమల్ ఖాన్ వద్ద నుంచి ప్యాలెస్‌ను పొందాడు. ఉస్మాన్ అలీఖాన్ ఒక ఫర్మానా ద్వారా ఆ ప్రాంతానికి కింగ్ కోఠి అని నామకరణం చేశాడు. ఈ ప్యాలెస్‌లో మూడు ప్రధాన భవనాలు ఉన్నాయి. పశ్చిమ భాగంలో ఉన్న భవనాన్ని నజరీబాగ్ అని పిలుస్తారు. ప్రస్తుతం ప్యాలెస్ తూర్పు భాగంలో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

7. అసఫ్ జాహీ కట్టడాలు, నిర్మించినవారు & వాస్తు శైలులు (Quick Revision Table)

(మొబైల్‌లో పూర్తి పట్టిక చూడటానికి కుడివైపుకు స్క్రోల్ చేయండి →)

కట్టడం / కట్టడాల పేరు నిర్మించిన కాలం & నిర్మించినవారు ఉపయోగించిన వాస్తు శైలి & ప్రత్యేకతలు
పాయెగా సమాధులు 1786 (నిజాం అలీఖాన్ కాలం) మొగల్ మరియు మూరిష్ శైలులు (Mughal & Moorish); సున్నం, మోర్టార్, రేఖాగణిత చిత్రాలు.
మన్సీ రేమండ్ సమాధి 1798 (ముసారాంబాగ్) యూరోపియన్ శైలి; 28 పిల్లర్లు, ఊదారంగు గ్రానైట్ రాయి.
పురానా హవేలీ రెండో నిజాం (సికందర్ జా కోసం) 18వ శతాబ్దం యూరోపియన్ శైలి; 'U' ఆకారం, ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క అలమారా.
బ్రిటిష్ రెసిడెన్సీ (కోఠి) 1803–04 (డిజైన్: జాన్ శామ్యూల్ రస్సెల్) యూరోపియన్ & ఇటాలియన్ శైలి (శ్వేతసౌధం తరహా); ప్రస్తుతం OU ఉమెన్స్ కాలేజీ.
చౌమహల్లా ప్యాలెస్ 1750 (సలాబత్‌జంగ్) – 1869 (అఫ్జల్‌దౌలా) మొగల్ & పర్షియన్ శైలులు (ఇరాన్ షా మహల్ తరహా); గ్రాండ్ దర్బార్ హాలు, 19 బెల్జియన్ క్రిస్టల్ షాండ్లియర్లు.
అసెంబ్లీ భవనం (టౌన్ హాల్) 1905 – 1923 (మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ జన్మదినం సందర్భంగా) పర్షియన్ మరియు రాజస్థానీ శైలులు; ప్రస్తుతం తెలంగాణ శాసనసభ భవనం.
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి & సిటీ కాలేజీ 1919–25 / 1921 (మీర్ ఉస్మాన్ అలీఖాన్; ఆర్కిటెక్ట్: విన్సెంట్ ఎస్చ్) ఇండో-సార్సెనిక్ శైలి (Indo-Saracenic Style).
మొజంజాహీ మార్కెట్ 1935 (మీర్ ఉస్మాన్ అలీఖాన్) పూర్తిగా రాళ్లతో నిర్మించిన కట్టడం, మధ్యలో గడియారపు మినార్.

8. ప్రాక్టీస్ ప్రశ్నలు (Expected Exam MCQs)

1. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ‘పాయెగా సమాధుల’ (Paigah Tombs) నిర్మాణంలో ఏ వాస్తు శైలులను ఉపయోగించారు?
  • ఎ) ఇండో-సార్సెనిక్ మరియు గోథిక్ శైలి
  • బి) మొగల్ మరియు మూరిష్ శైలులు
  • సి) రాజస్థానీ మరియు పర్షియన్ శైలులు
  • డి) ఇటాలియన్ మరియు యూరోపియన్ శైలులు
సమాధానం: బి) మొగల్ మరియు మూరిష్ శైలులు
2. బ్రిటిష్ రెసిడెన్సీ (కోఠి) భవన ప్రధాన కేంద్ర బ్లాకును ఏ వాస్తు శైలిలో నిర్మించారు?
  • ఎ) ఇటాలియన్ శైలి
  • బి) మూరిష్ శైలి
  • సి) కుతుబ్ షాహీ శైలి
  • డి) ద్రవిడ శైలి
సమాధానం: ఎ) ఇటాలియన్ శైలి (డిజైన్: జాన్ శామ్యూల్ రస్సెల్)
3. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, హైకోర్టు మరియు హైదరాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను ఇండో-సార్సెనిక్ శైలిలో రూపొందించిన చీఫ్ ఇంజినీర్ ఎవరు?
  • ఎ) జాన్ శామ్యూల్ రస్సెల్
  • బి) మన్సీ రేమండ్
  • సి) విన్సెంట్ జెరోమ్ ఎస్చ్ (Vincent Jerome Esch)
  • డి) సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సమాధానం: సి) విన్సెంట్ జెరోమ్ ఎస్చ్
4. ప్రస్తుతం తెలంగాణ శాసనసభగా (Assembly Hall) ఉపయోగిస్తున్న టౌన్‌హాల్ భవనాన్ని ఏ శైలులలో నిర్మించారు?
  • ఎ) మొగల్ మరియు గోథిక్
  • బి) పర్షియన్ మరియు రాజస్థానీ శైలులు
  • సి) ఇటాలియన్ మరియు మూరిష్
  • డి) ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్
సమాధానం: బి) పర్షియన్ మరియు రాజస్థానీ శైలులు (1905–1923)
5. కమల్ ఖాన్ నిర్మించిన ఏ ప్యాలెస్‌ను ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన నివాసంగా మార్చుకొని దానికి నామకరణం చేశాడు?
  • ఎ) ఫలక్‌నుమా ప్యాలెస్
  • బి) చౌమహల్లా ప్యాలెస్
  • సి) కింగ్ కోఠి ప్యాలెస్ (నజరీబాగ్)
  • డి) పురానా హవేలీ
సమాధానం: సి) కింగ్ కోఠి ప్యాలెస్ (నజరీబాగ్)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.