Nature and Salient features of Indian Constitution -1

TSStudies

భారత రాజ్యాంగ రచన స్వభావం - ముఖ్య లక్షణాలు (Nature and Salient features of Indian Constitution)

రాజ్యాంగ రచనా పద్ధతులు
  • సాధారణంగా రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు పద్ధతులు పాటిస్తారు. ఆ దేశ పార్లమెంటు చేత తయారు చేయించడం లేదా రాజ్యాంగ రచనకు ప్రత్యేక పరిషత్తును లేదా సంస్థను (Constituent Assembly) ఏర్పాటు చేసి తద్వారా రాజ్యాంగ రచన చేయడం. 
  • ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం అమెరికా. 1787లో అమెరికాలో ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు.
  • 1789లో ఫ్రాన్స్ ‌ దేశంలో “కాన్‌స్టిటుయంట్‌ అసెంబ్లీని ఏర్పాటు చేసుకుని రాజ్యాంగ రచన చేసారు. 
భారత రాజ్యాంగ రచన
  • భారతీయ ప్రజా ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తు అనే భావన స్వాతంత్రోద్యమంలో అంతర్గతంగా ఉన్న ముఖ్యమైన డిమాండు. భారత జాతీయ కాంగ్రెసు మొదటిసారిగా ఈ డిమాండును 1918 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో “స్వయం ని‌ర్ణయాధికారం” అనే భావనతో ఒక తీర్మానం చేసింది.
  • ఇదే విషయాన్ని 1922 జనవరి 5వ తేదీ నాటి “యంగ్‌ ఇండియా” పత్రికలో "స్వరాజ్"‌ అనేది బ్రిటీషువారు ఇచ్చే ఉచిత కానుక కాదని, అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా గాంధీ పేర్కొన్నారు.
  • 1927 మే 17న బాంబే సమావేశంలో మోతీలాల్‌ నెహ్రూ రాజ్యాంగ రచన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. అందులో భాగంగా, 1928 మే 19న మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన ఒక ఉపసంఘాన్ని రాజ్యాంగ రచనకు అఖిలపక్ష కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను 'నెహ్రూ రిపోర్టు' అంటారు. దీనిని భారతీయులు స్వంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు.
  • అయితే ప్రముఖ అభ్యుదయ మానవతావాది (Radical Humanist) అయిన ఎమ్‌. ఎన్‌.రాయ్‌ 1934లోనే రాజ్యాంగ పరిషత్తు అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించారు. ఆ తరువాత 1935లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ‌ పరంగా మొట్టమొదటిసారి రాజ్యాంగ పరిషత్తును డిమాండ్‌ చేసింది.
  • 1942లో క్రిప్స్‌ రాయబారం రాజ్యాంగ పరిషత్తును (Constituent Assembly) ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ తరువాత 1946లో కేబినెట్‌ కమిటీ రాయబార సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్తు  ఏర్పాటు అయ్యింది.