రైతు గిరిజన తిరుగుబాట్లు Raitula Tirugubatu in Telangana

TSStudies

రైతు, గిరిజన తిరుగుబాట్లు 

రైతుల తిరుగుబాట్లు

బేతవోలు రైతుల పోరాటలు 
“బేతవోలు ముఖ్తా' కొన్ని గ్రామాల సముదాయం. దాని ముఖ్యస్థానం బేతవోలు. ఇవిగాక జెరిపోతులగూడెం, పోలినేని గూడెం, ఆచార్యులగూడెం, చెన్నారి గూడెం, కొమ్ములబండ తండా, సీతారాం తండా అనే గ్రామాలున్నవి.
ఆ రోజుల్లో బేతవోలు పెద్ద గ్రామం కింద లెక్క దీనిలో ముఖ్తాదారుడు ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించుకోవలసి ఉండేది. ఇదిపోగా మిగిలిన శిస్తులు రైతుల నుంచి వసూలు చేసుకొని ఆ మొత్తాన్ని తానే అనుభవించేవాడు.  ఈ మేరకు అతనికి చట్టపరమైన హక్కు ఉండేది. అయినా ఈ పరిధి దాటి చట్టవిరుద్ధంగా పెద్దఎత్తున శిస్తులు వసూలుచేసేవాడు.
బేతవోలు ముఖ్తాదారు వసూలుచేసే అక్రమ పన్నులు ఈ విధంగా ఉండేవి.
సెంట్ల పన్ను: ముఖ్తా గ్రామంలోని భూములను సర్వే సెటిల్‌మెంట్‌ చేయించిన సందర్భంగా వసూలు చేసే పన్ను. నిజాం సంస్థానంలో ఇతర ప్రాంతాలలో సర్వే జరిపినట్టు తన ముఖ్తా ప్రాంతంలో జరిపించలేదు. ఆనాటి మద్రాసు రాష్ట్రంలో అమలు ఉన్నట్టు జరిపించాడు. కారణం మద్రాసు రాష్ట్రంలో ఎకరమునకు 100 సెంట్లుగా పరిగణించేవారు. కానీ సంస్థానంలో ఎకరానికి 40 గుంటలుగా పరిగణించేవారు.
దేవుని పన్ను: రైతులంతా ఇంటికి 1 రూపాయి చొప్పున దేవునికి కానుకగా చెల్లించాలి. ఈవిధంగా పోగైన డబ్బు ముఖ్తాదారుకే చేరుతుంది.
పుల్లరి పన్ను: రైతులు, కూలీలంతా తమకున్న పశువులలో ఒక్కొక్క పశువుకు 1.50 పైసల చొప్పున పుల్లరి పన్ను చెల్లించేవారు. ఈ పన్ను వసూలు సమయంలో ముఖ్తాదారు ప్రజలను తీవ్రంగా బాధించేవాడు.
ఎవరింటికైనా చుట్టాలు వస్తే ఇంటివారు చుట్టాల కోసం పన్నులు చెల్లించుకోవలసి వచ్చేది. గ్రామస్థులు చుట్టాల ఇంటికి వెళితే వారు గ్రామాన్ని వదిలి వెళ్లినందుకు పన్ను చెల్లించుకోవాల్సి వచ్చేది.
చెరువుకు గండ్లు పడితే వాటిని పూడ్చాలనే పేరుతో కొంత పన్నులు చెల్లించాల్సి వచ్చేది.
చేనేత పనివారు మగ్గాలపైన పన్ను చెల్లించేవారు. 
పెళ్లిళ్ల సమయంలో పన్ను చెల్లించడం తప్పనిసరి.
ముఖ్తాదారు స్త్రీలకు ప్రత్యేకంగా వివిధ రకాల పన్నులు విధించేవాడు.
1.  మంత్రసాని పన్ను చెల్లించాలి 
2. వ్యభిచారిణులు పన్ను చెల్లించాలి
3. అమ్మాయి రజస్వల అయితే పన్ను చెల్లించాలి
4. సంతానం కలిగితే పన్ను చెల్లించాలి.
పుల్లరి పన్ను చెల్లించే రైతులు తమకు భూమి పట్టాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని భావించిన ముఖ్తేదార్‌ హుజూర్‌నగర్‌ తాలూకాలోని రేవూరు గ్రామానికి చెందిన ఫకీరురెడ్డి అనే వ్యక్తిని(ఏజెంటు) తెచ్చి భూమిని  అతనికి తనఖా పెట్టినట్లు కాగితాలు సృష్టించాడు
బేతవోలుకు తాలూకా కేంద్రమైన సూర్యాపేటలో అమృతరెడ్డి అనే ప్లీడరు రైతుల పక్షాన పనిచేసేవారు. జమిందార్‌ పక్షాన వేములపల్లి వెంకటకృష్ణయ్య పనిచేసేవారు.
1938 నాటికి సుమారు 10 సంవత్సరాలపాటు బేతవోలు రైతుల పోరాటం సాగింది. వారి కోర్కెలు
వెట్టిచాకిరీ రద్దు, అక్రమ పన్నులు రద్దు
శిస్తురేట్లు తగ్గించాలి
రైతులకు తమ భూమిని అమ్మడానికి, కొనడానికి హక్కు ఉండాలి.
ముఖ్తాదారుకు పటేల్‌, పట్వారీలను తొలగించే అధికారం ఉండరాదు.
బేతవోలు రైతుల పోరాటానికి ప్రారంభం నుండి నడిగూడెం (మునగాల) రాజా మద్ధతు ఉంటూ వచ్చింది
  పరిటాల జాగీరు రైతాంగ పోరాటం - ఏజెంటు హత్య :
పరిటాల హైదరాబాదు-విజయవాడ రోడ్డుపైన విజయవాడకు సమీపానగల ఒక గ్రామం. ఇది ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది
నైజాం ఇలాకా, వరంగల్ జిల్లా మధిర తాలూకాలో నవాబ్‌ కమాల్‌ యార్‌జంగ్‌ జాగీర్జారుకు కానాత్‌ తాలూకా అనే 'పేరుతో పరిటాల, బత్తెనపాడుగని, అత్మూరు, మొగులూరు, కొడవటికల్లు, ఉస్తేవల్లి మరియు మల్లవెల్లి మొత్తం 7 గ్రామాలుండేవి. ఈ గ్రామాల చుట్టూ బ్రిటిష్‌ వారి ప్రాంతం ఉందేది
పరిటాల గ్రామం తాలూకాకు ప్రధాన స్థానంగా ఉండి, అచట జాగీర్దార్‌ తరపున ఒక తహశీల్దారు, ఫస్ట్‌క్లాస్‌ మెజి(స్టేటు మరియు పోలీస్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ 15-20 మంది సిబ్బందితో ఉందేవారు. ప్రధానంగా భూభాగం బ్రిటిష్‌ భూభాగంతో 
చుట్టబడి ఉండుటచే అచ్చటి రాజకీయ చైతన్య ప్రభావము జాగీరు గ్రామాల ప్రజల మీద పూర్తిగా ఉండేది. తత్ఫలితంగా ప్రజలలో రాజకీయ చైతన్యం అధికంగా ఉండేది.
నవాబ్‌ కమాల్‌ యార్‌జంగ్‌ తండ్రి ఖాన్‌ఖానాన్‌ హయాంలో లంకా సుబ్బయ్యశాస్త్రి అనే వ్యక్తి వృద్ధుడయిన నవాబు వద్ద పలుకుబడి సంపాదించి 7-8 సంవత్సరాలు నియంతగా వ్యవహరించి ప్రజలను పీడించినాడు. తత్ఫలితంగా ప్రజలలో రాజకీయ చైతన్యం ప్రబలి ఇతని యొక్క నియంతృత్వాన్ని శాసనబద్ధంగా అణచివేయుటకు అనేక ప్రయత్నాలు జరిగాయి.
సుబ్బయ్యశాన్షి జీవితకాలంలో జాగీరు దుష్పరిపాలన గురించి విచారించుటకు హైదరాబాద్‌ ప్రభుత్వం ఒక విచారణ సంఘం నియమించి విచారణ జరిపించారు. కానీ ఈ విచారణ యొక్క ఫలితం శూన్యం అవ్వడంతో, చివరకు ప్రజలు విసుగుచెంది ఆయనను హత్యచేశారు.

మునుగోడు రైతుల పోరాటం - దేశ్‌ముఖ్‌ హత్య :
మునుగోడు గ్రామం నల్లగొండ తాలూకాలోనిది. అక్కడ రామిరెడ్డి అనే దేశ్‌ముఖ్‌ ఉండేవాడు. ఈయన పెద్ద ఆస్తిపరుడేగాక, గ్రామానికి పోలీస్‌ పటేల్‌, పైరవీకారు కూడా. ఇతడు తహశీల్దారుకు, కలెక్టర్లకు(తాలూక్టారులు), ఇతర అధికారులకు నెయ్యిని నింపిన కుండలను, ఇతర రుచిగల పదార్థాలు, పచ్చళ్లను సప్లయి చేసి వారి అభిమానాన్ని చూరగొని, లంచాలిచ్చి, తనకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకొనేవాడు.
దేశ్‌ముఖ్‌ యొక్క దాయాదుల్లో చాలా మంది పేదలు, సాధారణ రైతులు, పేద రైతులు. వీరు కుటుంబ పోషణకై కొంత ఆదాయాన్ని సంపాదించడానికి వారు తమ ఇళ్లలో రహస్యంగా సారాయిని తయారుచేసి అమ్మేవారు. సామాన్య ప్రజలు కూడా ఈ వృత్తిని అనుసరించేవారు.
దేశముఖ్‌, ఎక్సైజ్‌(ఆబ్బారీ) ఆఫీసర్లతో వీరి ఇళ్లపైన దాడులు చేయించి, స్త్రీలను అవమానించి, అందరినీ హింసించి లంచాలు తీసుకునేవాడు. దీంతో ప్రజల్లోనేకాక దాయాదుల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి దేశముఖ్‌ను చంపాలని నిర్ణయించారు.
దేశ్‌ముఖ్‌ను హత్యచేయడానికి ప్రయత్నించారు. కానీ దేశ్‌ముఖ్‌. తుపాకీతో కాల్చి హత్యకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్టయి కొంతకాలానికి జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ దేశ్‌ముఖ్‌పై ఉన్న వ్యతిరేకత మరింత తీవ్రమైనది.
సుమారు 1941-42 కాలంలో ఒకనాడు దేశ్‌ముఖ్‌ తన కచ్చడంలో నల్గొండకు బయలుదేరి అధికారుల కోసం నేతి డబ్బాలు, పచ్చళ్లు తెస్తున్నాడు. దేశ్‌ముఖ్‌ యొక్క రాకపోకలను కనిపెడుతూ ఉన్న ప్రజలు, దాయాదులు మార్గంమధ్య దోమలపల్లి అనే గ్రామ శివారులో కచ్చడాన్ని ఆపేసి దేశ్‌ముఖ్‌ను కొట్టి చంపారు. కానీ ఇంకా బతికే ఉన్నాడు అనుకొని శవాన్ని కచ్చడంలో వేసి, నిప్పంటించి, కచ్చడంలో ఉన్న నెయ్యిని మంటల్లో పోశారు. దీంతో శవం కూడా కాలి బూడిదైపోయింది. కేసు నడిచింది. సుమారు 9మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
దేశ్‌ముఖ్‌ చనిపోయి అతని దుర్మార్గాల నుంచి ప్రజలకు విముక్తి కలిగినా భూస్వామ్య వ్యవస్థ మాత్రం దెబ్బతినలేదు

విసునూరు దేశ్‌ముఖ్‌ - బందగీ హత్య
1939 నాటికి ఫ్యూడల్‌ దోపిడీకి, దౌర్జన్యాలకు పేరుపడిన విసునూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలలో ఒకదానికి బందగీ అనే యువకుడు నాయకత్వం వహించాడు. ఈ పోరాటం గురించిన వివరాలు “జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు అనే పుస్తకం ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి.
కామారెడ్డిగూడెంలో షేక్‌ బందగీ అనే మహమ్మదీయ రైతు యువకుడు ఉండేవాడు. వారంతా ఐదుగురు అన్నదమ్ములు. అందరికన్నా పెద్దవాడు అబ్బసలి. వీరంతా వ్యవసాయం చేసుకుంటూ వేరుపడి జీవించాలనుకున్నారు. పెద్దవాడయిన అబ్బసలికి జ్యేష్టభాగం క్రింద 8 ఎకరాల భూమిని ఇచ్చారు. చిన్నవారు నలుగురు కలిసి వ్యవసాయం చేసుకొనేవారు.
అబ్బసలి తన 8 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఈ అబ్బసలి దేశ్‌ముఖ్‌ దగ్గర ప్రాపకం సంపాదించి ఆయన సహాయంతో తమ్ముళ్ల భూమిలో కొంత కొట్టివేయాలని నిర్ణయించాడు.
అబ్బసలి ఇంటికి వచ్చి తమ్ముళ్లతో భూమిని మళ్లీ పంపకం చేసి జ్యేష్టభాగం కావాలని గొడవ పెట్టాడు. మిగిలిన నలుగురు తమ్ముళ్లు దీనికి అంగీకరించలేదు. అబ్బసలి దేశ్‌ముఖ్‌ అండతో కోర్టుకెళ్లాడు. అయినా ఆ తగాదా కోర్టులో చివరకు తమ్ముళ్ల వైపునే ఫైసలా అయింది. అయితే తమ్ముళ్లవైపు పోరాటానికి బందగీ సాహెబ్‌ నాయకత్వం వహించాడు.
బందగీ సాహెబ్‌కు ప్రజలలో కలిసిపోయే స్వభావం అధికం కావున ప్రజలను ఉత్తేజపరిచి, సంఘటితపరచి దేశ్‌ముఖ్‌ అండజేరిన అన్నను జయించడానికి పూనుకొన్నాడు. దౌర్దన్యంతో కూడిన దేశ్‌ముఖ్‌ అధికారాన్ని మొదటిసారిగా దెబ్బతీశాడు బందగీ సాహెబ్‌.
ఫకీర్‌ అహ్మద్‌ బందగీ సోదరులకు దగ్గరి పాలితుడు. దేశ్‌ముఖ్‌ దగ్గర నౌకరీ చేయడం మొదలుపెట్టినాడు. దీంతో ఫకీర్‌ అహ్మద్‌, దేశ్‌ముఖ్‌ కలిసి బందగీ సోదరుల ఆస్తిని చేజిక్కించుకోవడానికి కుట్రపన్నారు.
దీని ప్రకారం బందగీ మరియు అతని సోదరులు అనుభవించే భూమిని వారి తండ్రి, ఫకీర్‌ అహ్మద్‌ తండ్రి వేరు అయినాక ఫకీర్‌ అహ్మద్‌ మాత్రమే సంపాదించడానీ, దానిలో బందగీ సోదరులకు హక్కు లేదని గొడవ చేయవచ్చనే ప్రణాళిక ప్రకారం కేసులు పెట్టారు. బందగీ పేదవాడు. అయినా కష్టజీవి. కావున కేసులకై తిరగడానికి అన్ని వ్యయప్రయాసలు ఎదుర్కొనలేదు. అంతేకాకుండా దేశ్‌ముఖ్‌చే పీడించబడుతున్న వేలకొద్దీ ప్రజల సహాయసానుభూతులు బందగీ వెంటనున్నవి.
దేశ్‌ముఖ్‌ దోసిళ్లతో రూపాయిలను కుమ్మరించి కేసులు నడిపిస్తున్నాడు. కానీ బందగీ స్థితి విచారిస్తే నౌకర్లలో నాలుగవ శ్రేణిలో కూడా చేరడు. కానీ బందగీ మానవుడిగా జీవించాలనుకున్నాడు.
12 సంవత్సరాల దేశ్‌ముఖ్‌, బందగీ పోరాటంలో బందగీ తెల్లని శరీరం కందలేదు. అతని ఉత్సాహంలో మార్పులేదు. సాధిస్తున్న విజయాలను చూసి గర్వించలేదు. పోరాటం ఆఖరికి వచ్చింది. కోర్టు ఫైసలా బందగీ సోదరుల వైపు అయింది. బందగీ ధైర్య సాహసోపేతమైన పోరాట ఫలితం విజయవంతం అవటం వలన ప్రజలు హర్షించారు.
బందగీ ఒకరోజు ఉదయం 8 గంటలకు సూర్యాపేట నుంచి జనగామ వెళ్లే బస్సులో వెళ్లి హైకోర్టు నుంచి అహకాములు (ఆర్డర్స్‌) తెచ్చుకొని ఆస్తి విషయమై చిక్కులు తొలగించుకొందానుకొన్నాడు. ఆ రోజు బస్సు సమయానికి బందగీ బయలు దేరాడు. బస్సు నిలిచే స్థలానికి రెండు ఫర్లాంగుల దూరం ఉంటుంది. దీనికి ఇరుపక్కలా పంటచేలు దట్టంగా ఉన్నవి. బందగీ కన్నుమూసి తెరచినంతనే, పక్కనే ఉన్న కంచెలో నుంచి ఇద్దరు సాయుధులు పైనపడ్డారు. ఒకడు కొడవలితో, రెండవవాడు గొడ్డలితో బందగిపై దాడిచేసి హత్యచేశారు.
బందగీ చావు విన్నంతనే ఇతర ప్రదేశాలలో ఉన్న అతని సోదరులు వచ్చారు. బందగీని బస్‌ స్టేజి దగ్గరనే పూడ్చి, గోరీ కట్టారు. గోరీ కట్టడానికి రాళ్లు కావాల్సి వస్తే ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులను చంపేస్తామని బెదిరించారు. కానీ కామారెడ్డిగూడెం రైతులు దీనికి భయపడలేదు.
గోరీ తయారైంది. చుట్టూ చెట్లు పెరిగాయి. ప్రతి సంవత్సరం అక్కడ ఉర్సు జరుగుతుంది. హిందువులు, ముస్లింలు సమాన ఆదరాభిమానాలతో ఉర్సులో పాల్గొని తమ ప్రియమైన నాయకుడు బందగీని స్మరించుకొంటారు.
ఈ కాలంలో దొర భూస్వాములు స్థాపించిన సంఘం - హిందూ సమితి

కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం :
కొలనుపాక నల్లగొండ జిల్లాలోని ఆలేరుకు 6 కి.మీ.ల దూరాన ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైన గ్రామం. జైనుల పుణ్యక్షేత్రం. కొలనుపాక చుట్టూ ఉన్న మరికొన్ని గ్రామాలు కూదా ఈ జాగీరు ప్రాంతంలోనివే. ఈ ప్రాంతాలన్నింటికీ నవాబు తురాబ్‌యార్‌ జంగ్‌ అధిపతి. ఇక్కడ పెద్ద భూస్వాములు, చిన్న భూస్వాములు అంతా ఆంధ్రులు. ఆరుట్ల సోదరులు కొలనుపాక గ్రామస్తులే.
జాగీర్జారు, జాగీరు ఉద్యోగులు ప్రజలతో వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాక రైతుల నుంచి అక్రమ శిస్తు వసూలు చేసేవారు. ఇక్కడి పెద్దలకు ఆంధ్రోద్యమంతో సంబంధం ఉన్నప్పటికీ, భూస్వాములు, రైతులు చాలాకాలం దాకా అక్రమ శిస్తులు చెల్లించారు. ప్రజలంతా వెట్టిచాకిరి చేశారు.
జాగీర్జారు మద్ధతుతో అధికారులు మాదిగ, మాలవారిని ఇస్లాం మతంలోకి మార్చిన వెంటనే ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి మరికొందరు కలిసి మతమార్చిడిని వ్యతిరేకించి, ఆర్య సమాజీయులను పిలిపించి తిరిగి హిందూమతంలోకి మార్చించారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరీని మానిపించారు. అక్రమ పన్నులను చెల్లించడానికి నిరాకరించి, ఖీల్సా గ్రామాల పన్నులనే చెల్లించసాగారు.

ఈ పోరాటంలోని ప్రధాన బలహీనతలు:
మతమార్చిడితో సంబంధం : దళితులు మతం మార్చుకోవడంతో గ్రామపెద్దల్లో చలనం కలిగిందే కానీ అంతకు ముందు కలుగలేదు.
సమీప ప్రాంతాలలో జాగీరు ప్రజల పోరాటాలు సాగుతున్నా ఈ గ్రామాల్లో కూడా అక్రమశిస్తులు, అక్రమ పన్నులు, వెట్టిచాకిరి లాంటి సమస్యలపై స్థానిక పెద్దలు ముందే చొరవ తీసుకొని పోరాటాలు నడపలేదు.
అన్ని గ్రామాల్లో మాదిరిగానే కొలనుపాక గ్రామాల్లో భూమి, కూలీ సమస్యలున్నాయి. దీనివలన పోరాటానికి, ఉద్యమానికి బలం చేకూరలేదు.