బాలమిత్ర కథలు-పుకారు
ఆస్థానకవి రామశర్మ రాజూగారి వద్దకు వెళ్ళి, “రాజా! మీ గురించి రాజ్యమంతా చెప్పుకుంటున్నారు నిజమా!” అడిగాడు.
“అది నిజమే. అసలు జరిగిందేమిటంటే, ఉదయం నేను ఉద్యానవనంలో విహరించడానికి నా అశ్వాన్ని అదిరోహిస్తుండగా, పట్టు తప్పి క్రింద పడ్డాను, ఆ శబ్దానికి అశ్వం బెదిరి, వెనక కాళ్ళతో నన్ను తన్నింది. ఆ దెబ్బకి నేను దూరంగా ఎగిరి పొదల్లో పడ్డాను. ఏ గాయం తగలలేదు. కాని ఆ సమయంలో పహారా వుంటున్న సిద్దన్న ఈ దృశ్యం చూసాడు. వాడు పరిగెత్తుకు వచ్చి నన్ను క్రింది నుండి లేపి, సపర్యలు చేసాడు. నాకు చాలా అవమానమనిపించింది. నేను ఆ సమయంలో ఒక్క సిపాయి మాత్రం వున్నందువలన, తటాయించుకుని, వాడికి నా ఉంగరాన్ని ఇచ్చి ఈ సంగతి ఎవ్వరికి చెప్పకూడదని హెచ్చరించాను” అని రాజా బాదపడ్డాడు.
“రాజా! ఏ సంగతైనా పెదవిదాటితే పృద్వి దాటుతుంది అంటారు. అలాగే జరిగింది” అన్నాడు రామశర్మ.
'పృద్వి దాటినా పరవాలేదు రామశర్మగారూ! ఈ సంగతి పడకటంటికి చేరితే, మా రాణుల ముందు చులకన అయిపోతానని భాదగా వుంది. దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడే వుండిపోయాను” అన్నాడు రాజా,
“మహారాజా! దాని గురించి మీరు బాధ పడకండి. మీ రాణివాసంలో మీరు చులకన కాకుండా నేను చూస్తాను” అన్నాడు రామశర్మ.
“అదెలా కుదురుతుంది. ఈ పాటికి ఈ సంగతి అందరికి తెలిసి వుంటుంది. పైగా ఆ సంఘటనని ఇంకా ఎక్కువచేసి చెప్పివుంటారు. రాణులు నన్ను ఆట పట్టించడానికి ఎదురు చూస్తూ. వుంటారు. నువ్వు నన్ను వారి నుండి రక్షించలేవు” అన్నాడు రాజు.
“రాజా! మీకు అభ్యంతరం లేకపోతే, నేను మీతోపాటు రాణి వాసానికి వస్తాను. అక్కడ వారు మిమ్మల్ని ఆటపట్టించకుండా చూస్తాను” అన్నాడు.
రాజుగారు నమ్మతించి, తనతోపాటు రామశర్మని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు.
అప్పుడు రాణి సులోచన రాజుగారిని ఆట పట్టించాలని నోరు తెరిచి, వెనుకనే వన్తున్న రామశర్మని చూసి నోరు మూసుకుంది, కాని ఆమె ముఖంలో చిరునవ్వు వుంది.
అపుడు రామశర్మ, “మహారాజా! నేను చెప్పింది నిజం. ఆ వార్త అంతఃపురం వరకు చేరింది” అనడంతో రాణి “ఏం జరిగింది. వివరంగా చెప్పండి” అన్నది.
“మహారాణి! ఈ రోజు రాజుగారితో పుకారు త్వరగా పాకిపోతుందని చెప్పి, దాన్ని నిరూపిస్తాను అని చెప్పాను. అందువలన సిపాయి సిద్దన్నతో, రాజుగారు ఉద్యానవనంలో గుర్రంపై కిందపడ్డాడని, గుర్రం వెనక కాలితో రాజుగారిని తన్నిందని చెప్పాను. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకూడదని అతనితో చెప్పాను. కానీ సాయంకాలం సమయానికి ఈ వార్త నగరమంతా పాకిపోయింది. మహారాజా! ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా, కాళ్ళు చేతులు లేకపోయినా పుకారు ఎంత దూరం అయినా వెళ్ళగలదు” అన్నాడు రామశర్మ.
“అయితే మేము విన్నది మీరు పుట్టించిన పుకారా! నేను రాజుగారిని ఆట పట్టించాలనుకున్నానే!” అంటూ లోపలకి వెళ్ళిపోయారు.