ఔదార్యం
రెండువేల సంవత్సరాల క్రితం చీనా దేశంలో సో-పో-తావూ అనే వృద్ధుడుండేవాడు. ఆయన పేరుపడిన పండితుడు. కాని ఆయన పాండిత్యానికి మెచ్చి ఆదరించే దాతలు లేక దారిద్ర్యం అనుభవించేవాడు.
దూరాన చూ అనే రాజ్యానికి రాజుగా ఉంటున్నవాడు కూడా గొప్ప పండితుడే. ఆయన పండితులను ఆదరించి, దగ్గర ఉంచుకుని, వస్తువాహనాలిస్తాడని ప్రతీతి. ఆయన వద్దకు వెళ్లి సన్మానాలు పొందవలసిందని తావూతో అనేకమంది మిత్రులు చెప్పారు. మిత్రుల మాటలు తోసివేయలేక తావూ తన వద్ద గల కొద్ది పాటి ఉన్ని దుస్తులూ, ధనమూ తీసుకుని చూ రాజ్యానికి కాలినడకను ప్రయాణమయాడు.
అనేక వందలమైళ్లు వెళ్లాలి. కొండల మీదుగా కష్టపడి ప్రయాణం చేయాలి. దారి మధ్యలో చలికాలం సంప్రాప్తమయింది. ఎక్కడైనా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుందామని, ఒక ఊళ్లో యాంగ్-చియాపూ-అయీ అనేవాడి ఇంటికి వెళ్లాడు.
ఆయీ తావూకు ఉన్నంతలో చక్కగా అతిథి సత్కారం చేశాడు. తావూ పండితుడని తెలిసి ఆయీ ఆనందించాడు. ఆయీ మాత్రం సామాన్యుడు కాడు. ఆయన వద్ద ఉన్న గ్రంథాలు చూస్తే ఆయీ తన కంటే చాలా రెట్లు పాండిత్యం గలవాడని తావూకు తెలిసిపోయింది. ఆయనతో పాండిత్య చర్చలు జరిపి తావూ ఈ విషయం మరింత గట్టిగా రుజువు చేసుకున్నాడు.
“చూ దేశపు రాజు పండితులను గొప్పగా సత్కరిస్తాడట. ఆయనను చూడబోతున్నాను. నీవు కూడా నా వెంట రారాదా?” అని అడిగాడు తావూ. ఆయీ ఒప్పుకుని చలి దుస్తులూ, డబ్బూ తీసుకుని బయలుదేరాడు.
ఇద్దరూ కలిసి కొన్నాళ్లు ప్రయాణం సాగించిన అనంతరం ముంచు తుఫాను వచ్చింది. లియాంగ్ పర్వతాల మధ్య వారిద్దరూ ఈ మంచుతుపానులో చిక్కుకున్నారు. ఇంకా నాలుగురోజులు నడిస్తే గాని వారు చూ దేశం చేరలేరు. వారు చలికి చచ్చిపోయే పరిస్థితి ఏర్చడింది. ముఖ్యంగా ముసలివాడైన తావూ చాలా దీనస్థితిలో ఉన్నాడు. చివరికి ఆయన ఆయీతో ఈ విధంగా అన్నాడు.
“నాయనా, నా పనైపోయింది. నేనెలాగూ చూ దేశం చేరలేను. నా చలి బట్టలు కూడా నీవే వేసుకుంటివా ముందుకు సాగగలవు. చూ రాజును సందర్శించగలవు. నా బట్టలిస్తాను, తీసుకో.”
దీనికి ఆయీ ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. 'వెళితే ఇద్దరమూ వెళదాము. లేకపోతే చలికి ఇద్దరమూ చద్దాము. మీ చలిబట్టలు తీసుకుని మీ మరణానికి కారణభూతుణ్ణ్లీ కావడానికి అసలే ఒప్పుకోను,” అన్నాడు ఆయీ.
“నాయనా, నీవు యువకుడివి. నేను కాటికి కాళ్లు చాచుకుని ఉన్నవాణ్ణి. చూ రాజు నాకు సన్మానం చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? అదీకాక, నీవు నా కన్న గొప్పపండితుడివి!” అని చెప్పి చూశాడు తావూ.
ఆయీ వినిపించుకోలేదు. మంచు నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ ఒక గుహలో తలదాచుకున్నారు.
“ఎక్కడైనా నాలుగు పుల్లలు దొరికితే చలిమంట వేసుకోవచ్చునే!' అన్నాడు తావూ. ఆయీ పుల్లల కోసం బయటికి వెళ్లాడు. ఆయీ తిరిగి వచ్చేలోపుగా తావూ తన చలిబట్టలు విడిచి గుహలో పెట్టి వెలుపల ఉన్న మంచుగోతిలోకి దూకేశాడు.
ఆయిీతిరిగి వచ్చి చూసేసరికి గుహలో తావూ బట్టలు మాత్రమే ఉన్నాయి. గాభరాగా అతడు బయటికి వచ్చి వెతకగా మంచుగోతిలో పడివున్న తావూ శరీరం దొరికింది. తన కోసం ప్రాణాలను త్యాగం చేసిన తావూ బెదార్యం తలుచుకుని ఆయీ చాలా దుఃఖించాడు. ఆయన శవాన్ని ఆ గుహలోనే భద్రం చేసి, తావూ విసర్జించిన బట్టలు ధరించి, ఆయీ క్షేమంగా చూదేశం చేరాడు.
చూ దేశపు రాజు ఆయీ పాండిత్యానికి సంతోషించి, ఆస్థాన కవిగా నియమించి, ధనమూ, వస్తువాహనాలూ ఇచ్చాడు.
ఇంత సన్మానమూ పొందుతూ అయీ కంట తడి పెట్టడం రాజు గమనించి, కారణమేమని అడిగాడు.
“ప్రభూ! నా పాండిత్యాన్ని మీరింతగా గౌరవిస్తున్నారు. తావూ బెదార్యం ముందు నా పాండిత్యం ఏపాటి?” అన్నాడు ఆయీ.
తావూ చేసిన త్యాగం విని రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన ఆయీతో సహా తావూ శవం భద్రం చేసిన గుహవద్దకు వెళ్లి, వైభవ ౦గా తావూకు అంత్యక్రియలు చేయించి, అక్కడే సమాధి కట్టించాడు.
ఆయీ ప్రతి ఏడూ ఆ సమాధి వద్దకు వెళ్ళి, అశ్రుతర్చణాలు విడిచివస్తూ ఉండేవాడు. ఆయన అనంతరం చీనా దేశంలోని కవి పండితులకు తావూ సమాధి ఒక గొప్ప యాత్రాస్థలం అయింది.
ఆయీ ప్రతి ఏడూ ఆ సమాధి వద్దకు వెళ్ళి, అశ్రుతర్చణాలు విడిచివస్తూ ఉండేవాడు. ఆయన అనంతరం చీనా దేశంలోని కవి పండితులకు తావూ సమాధి ఒక గొప్ప యాత్రాస్థలం అయింది.