నమ్మదగిన కల
పూర్వం ఇంద్రప్రస్థనగరంలో ఒక గొప్ప ధనికుడుందడేవాడు. కొంత కాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసిరాక, ఉన్న ఆస్తి యావత్తూ వోయింది. ఒకప్పుడు గొప్పగా బతికిన వాడు కాస్తా ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు.
ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి, “నువు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్లు. అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది. దానితో నువు తిరిగి ధనికుడవై సుఖపడగలవు! అని చెప్పాడు.
కలలో శ్రీమహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం కొత్త. దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. అమావాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు.
అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మంటపంలో పడుకుని కొద్ది సేపట్లో నిద్రపోయాడు. నగరమంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని అలికిడి విని నిద్రలేచి, దొంగలు! దొంగలు! అని గొంతెత్తి అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగల ఆట కట్టయింది. వారు గోడమీదినుంచి గుడి ఆవరణ లోకి దూకి మంటపం పక్కగా పరుగు తీసి చీకటిలో అంతర్దానమైనారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి, చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు.
దూరప్రయాణం చేసి మట్టికొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు. ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు! ఎవరు నీవు? ఎందుకు దొంగతనానికి వచ్చావు? ' అని అడిగాడు.
“అయ్యా, నేను దొంగను కాను. మాది ఇంద్రప్రస్థం. నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణీ. భగవంతుడు రెండుసార్లు నన్నుమోసగించాడు. మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు. అంతటితో తృప్తితీరక, శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్నీ పాటలీపుత్రానికి వెళ్లమనీ, ఇక్కడ నాకు ధనం దొరుకుతుంది అని చెప్పాడు. ఆ మాటలు నమ్మిఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థనుంచి ఇక్కడిదాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి నాలుగు ఘడియలైనా కాకముందే తమచేత తన్నులు తిన్నాను! అన్నాడు పరదేశి.
ఈ మాటలు విని తలారి నవ్వి, ఓయి పిచ్చివాడా! ఎవరైనా కలలను నమ్ముత్రారా! కొద్ది కాలం కిందట నాకుకూడా కలలో శ్రీమన్నారాయణ మూర్తే కనిపించి, మీ ఇంద్రప్రస్థంలోనే ఫలాని ఇంటివెనక ఫలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు. నేనా మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్లలేదే! కనుక నువు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్టానికి తిరిగి వెళ్లు! అని సలహా ఇచ్చాడు.
డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్టానికి వెళ్లాడు. ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టుకింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు.
ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమయింది.
ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమయింది.