చందమామ కథలు-వడ్డించే గరిటె
గోవిందం ఇంటి పొరుగున ఉంటున్న రామేశం, ఒకరోజు గోవిందం దగ్గరకొచ్చి, “పట్నంలో ఒకతను నాకు కొంత పైకం బాకీ ఉన్నాడు. వసూలు చేసుకుని వద్దామనుకుంటున్నాను, కాస్త తోడు వస్తావా,” అన్నాడు.
అందుకు గోవిందం, “దానికేం భాగ్యం, నాక్కూడా పట్నంలో కొద్దిగా పని ఉంది. అయితే, ఈరోజు తిథి ఎంతమాత్రం బాగా లేదు. రేపు దివ్యంగా ఉన్నది. వేకువనే బయలుదేరుదాం!” అన్నాడు.
గోవిందానికి చాదస్తం ఎక్కువ. వారం, వర్జ్యం చూడందే ఏ పనీ చెయ్యడు. ఈ విషయం అంతో ఇంతో తెలిసి ఉన్న రామేశం సరే అన్నాడు.
మరుసటి రోజు ఉదయం ఇద్దరూ బయలుదేరి అలా వీధిలో కాలుపెట్టారో లేదో, తమకు రెండిళ్ల అవతల ఉన్న గుర్నాధం అటు వైపు వస్తూ కనిపించాడు. గోవిందం, రామేశంతో “ఇంట్లోకి వెళ్లి, ఓ ఘడియ కూర్చుని వల్లీ బయలుదేరుదాం,” అన్నాడు.
గుర్నాధం తమ ఇళ్లు దాటి వెళ్లాడని నిర్ధారించుకున్నాక ఇద్దరూ మళ్లీ వీధిన పడ్డారు.
“గుర్నాధం శకునం మంచిది కాదా?” అంటూ రామేశం అడిగాడు.
“శకునం సంగతి అటుంచి, అతని నోరు మంచిది కాదు, ఎక్కడికి? ఎందుకు? అంటూ ఆరాలు మొదలెడతాడు! ఊర్లో విషయాలన్నీ తెలుసుకోనిదే అతనికి తోచదు,” అన్నాడు గోవిందం.
అందుకు రామేశం, “అతడు ప్రతి రోజూ వేకువనే పొరుగూరి గ్రంథాలయం వెళ్ళి దిన, వార పత్రికలు చదివి వస్తూ ఉంటాడట, నిజమేనా?” అన్నాడు.
“సర్లే, ఇప్పుడు అతని సొది ఎందుకు? త్వరగా పద! అన్నాడు గోవిందం.
ఇద్దరూ పట్నం చేరుకుని, రామేశానికి డబ్బు బాకీ ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అతడు అప్పుడే పారుగూరు బయలుదేరి వెళ్లినట్లు, రెండు రోజుల వరకూ తిరిగిరాడని తెలిసింది. దాంతో రామేశం నిరాశ చెందాడు. ప్రస్తుతం అతనికి డబ్బు అవసరం చాలా ఉన్నది. గోవిందంతో పెట్టుకోకుండా తను ముందురోజు వచ్చి ఉంటే డబ్బు చేతికంది ఉండేదనుకున్నాడు.
తర్వాత వాళ్లు గోవిందం పనికోసం బజారు వీధికి వచ్చారు. గోవిందం తన పిల్లల కోసం పాఠ్య పుస్తకాలు, దుస్తులు కొనాలనుకున్నాడు. కానీ ఆ రోజు దుకాణాలన్నీ మూయబడి ఉన్నాయి. విచారించగా, ఆరోజు దుకాణదారులు సమ్మె చేస్తున్నారని తెలిసింది. ఇద్దరికీ ఆకలి దంచేస్తోంది. గోవిందం, ఎప్పుడు పట్నం వచ్చినా భోజనం చేసే శాఖాహార భోజనశాల కూడ మూసివేసి కనిపించింది. తక్షణం కడుపులో ఏదో ఒకటి పడితే తప్ప కాలు కదపలేమని ఇద్దరికీ అనిపించింది. పక్క వీధిలో ఓ పూటకూళ్ల ఇల్లు ఉన్నదని అక్కడున్న వాళ్లు చెప్పారు.
ఇద్దరూ పూటకూళ్ల ఇంటికి వెళ్లారు. కాళ్లూ చేతులూ కడుక్కుని భోజనాల బల్ల దగ్గర కూర్చున్నారు. వడ్డన చేసే అతను వీరి ముందు పళ్లేలు ఉంచుతూ, “శాఖాహారమా? మాంసాహారమా? ఏది వడ్డించమంటారు?” అన్నాడు. గోవిందం చప్పున లేచి నిలబెడుతూ, “రామేశం, నాతోరా?” అని రామేశాన్ని ఆదేశిస్తున్నట్లు పిలిచాడు.
అప్పటికే గోవిందం చాదస్తంతో విసిగి పోయిన రామేశం కూర్చున్న చోటు నుండి కదలకుండా, “ఇక్కడ భోంచేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు!” అని తనకు శాఖాహార భోజనం వడ్డించమని వడ్డన చేసే కుర్రాడితో చెప్పాడు.
గోవిందం పూటకూళ్తయజమాని వద్దకు వెళ్లి తనకు విడిగా బల్ల ఏర్పాటు చేసి, విస్తరిలో వడ్డన చేయమని కోరాడు. యజమాని అదనంగా ఇరవై రూపాయలు పుచ్చుకుని ఆ ఏర్పాట్లు చేయించాడు.
భోజనాలయ్యాక ఇద్దరూ ఊరిదారి పట్టారు. దారిలో గోవిందం, రామేశంతో “నీవుకూడా నాతోబాటు కూర్చుని భోంచేయాల్సింది," అన్నాడు.
అందుకు రామేశం, “అలా కూర్చున్నా బాగుండేది! నేనా విషయం గమనించక పోదును!” అన్నాడు రామేశం.
“ఏ విషయం,” అన్నాడు గోవిందం! రామేశం కాస్త తటపటాయిస్తూ, “అక్కడ వడ్డన చేసే కుర్రాడు ఒకటికి రెండు సార్లు మాంసాహారానికి ఉపయోగించిన గరిటెనే మనకు శాఖాహారం వడ్డించడానికి ఉపయోగించాడు మరి,” అన్నాడు.
గోవిందం నోరెళ్లబెట్టాడు. అప్పుడు రామేశం, 'మనకిలా జరగవలసిందేలే! మంచిరోజూ అదీ చూసుకోకుండా నిన్న బయలుదేరి ఉంటే మన ఇద్దరి పనులూ తెమిలి ఉండేవి. పైగా ఈ తిప్పలు ఉండేవి కావు. పోనీ గుర్నాధం ఎదురుపడ్డాడని వెనక్కు వెళ్లకుండా వచ్చి ఉండినా సరిపోయేది. అప్పుడే దినపత్రిక చదివి వస్తున్న అతడు దుకాణాల సమ్మెగురించి మనకు తెలిపి ఉండేవాడు. మనం ప్రయాణం మానుకుని ఉండేవాళ్లం!
మనం అనవసరంగా గుర్నాదాన్ని కించ పరిచామేమో అనిపిస్తున్నది! అయినా ఈ ఆచారాలూ, నమ్మకాలూ అనేవి ఇతరులను బాధపెట్టనంతవరకూ, అలాగే మన శరీరానికి ఇబ్బంది కలిగించనంత వరకూ మాత్రమే పాటించవచ్చని నాకనిపిస్తోంది,” అని సూటిగా అన్నాడు.
రామేశం ఈ మాటలు తనను ఉద్దేశించి అంటున్నవని గోవిందానికి అర్థమయింది.
“ఇకనుండి నేను నా తరహా మార్చు కోవడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు అతడు మెల్లగా రామేశంతో.
వడ్డించే విషయంలో తను కల్పించి అప్పటికప్పుడే చెప్పిన అబద్దం గోవిందం మీద బాగా పనిచేసిందని రామేశం సంతోషించాడు.