చందమామ కథలు-ఫలించిన ప్రయోగం
తల్లి తండ్రులు ఒకరితరువాత ఒకరు వేరు వేరు కారణాలతో మరణించడం వల్లనూ, మేనమామ మొదట ఆదరించినా ఎక్కువ కాలం పోషించలేక ఎదో ఒక సాకుతో కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టడం మూలంగానూ విశాఖుడనే కుర్రవాడు వీధినబడ్డాడు. విశాఖుడు ఎవరైనా దయతలిచి, పెట్టింది తింటూ ఆ రోజుకి ఆకలి తీర్చుకునేవాడు. ఒకరోజు వాడినెవరూ కనికరించలేదు. సూర్యుడు పైకక్కేకొద్దీ ఆకలి మంట వాడిని దహించి వేయసాగింది.
ఇంతలో నడివయస్సు ఉన్న ఓ ఆసామి కిరాణా కొట్టులో వందరూపాయల నోటిచ్చి ఎదో కొని చిల్లర నోట్లు పక్కజేబులో వేసుకోవడం విశాఖుణ్ణు ఆకర్షించింది. ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని విశాఖుడు ఆ వ్యక్తి వెంటపడ్డాడు. అంతకుముందు తనకు తోడు కలిసిన వీధి బాలుడొకడు ఒడుపుగా జేబు దొంగతనం చేయడం విశాఖుడు చూశాడు.
వాడిని అనుసరిస్తూ రద్దీగా ఉన్న కూడలిలోకి రాగానే వెనుకనుంచి ఆ ఆసామి జేబులో చెయ్యి పెట్టి విశాఖుడు నోట్లు అందుకోబోయాడు.
అంతే! క్షణంలో అప్రమత్తుడైన ఆ వ్యక్తి చటుక్కున వాడి చెయ్యి పట్టుకున్నాడు.
ఈ హఠాత్పరిణామానికి వాడు బిత్తరపోయాడు. ఆ వ్యక్తి జనాన్ని పిలిచి అల్లరి చేస్తాడని, తనకిక చావుదెబ్బలు తప్పవని అనుకుంటూ విశాఖుడు గజగజ వణికి పోసాగాడు. కానీ ఆ వ్యక్తి అలాంటిదేం చేయలేదు.
ఆయన పేరు కేశవయ్య,. విశాఖుడితో, నాయనా, నీకు తల్లిదండ్రులు ఉన్నారా, లేదా? ఈ చిన్న వయస్సులో ఈ పాడుపని ఎందుకు చేస్తున్నావు? అంటూ ప్రశ్నించాడు.
విశాఖుడు తన దీనగాధను చెప్పుకుని, “అయ్యా, మిరు చాలా మంచివారని నాకనిపిసోంది. రెండు రూపాయలిస్తే నాకీ పూట గడుస్తుంది. అన్నాడు.
"నేను నీకు రెండు రూపాయలివ్వగలను. అది నాకు పెద్ద సంగతి కాదు. కానీ నువ్వు ఇలా అడుక్కోవడం మొదలు పెడితే నీకిదే అలవాటు అవుతుంది. నావెంటరా. నీకు కడుపు నిండా తిండి పెట్టిస్తాను, అంటూ కేశవయ్య వాడిని ఓ ఖరీదయిన హోటల్‌కి తీసుకెళ్లాడు.
“చూడు బాబు, ఒక్కసారి దొంగతనం చేస్తూ పట్టుబడ్డావంటే సమాజం నీకు దొంగ అన్న ముద్ర వేస్తుంది. ఒక్కోసారి చేయని నేరానికి కూడా నింద మోయాల్సి వస్తుంది. జనం పసివాడన్న కనికరం కూడా లేకుండా నిన్ను గొడ్డును బాదినట్లు బాదుతారు. నామాట విని నువ్వు దొంగతనాల జోలికి వెళ్లవద్దు. ఏదైనా పని చేసుకో,” అంటూ హితబోధ చేశాడు.
ఇలా కబుర్లు చెప్పుకుంటూ హోటల్లో వారిద్దరూ రకరకాల ఆహార పదార్థాలు తెప్పెంచుకొని పుష్టగా తిన్నారు. తరువాత 'కేశవయ్య చెయ్యి కడుక్కువసానని వెళ్లాడు అంతే! ఆ తరువాత అతడి జాడలేదు. అతడు హోటల్ వాళ్ళతో విశాఖుడు తన కొడుకనీ తిన్నదానికి డబ్బంతా వాడే ఇస్తాడని చెప్పి తప్పించుకున్నాడట.
ఆ ఆసామి డబ్బు ఖర్చు కాకుండా పుష్టిగా తిని వెళ్లడానికి, మోసంతో తనని ఉపయోగించుకున్నాడని విశాఖుడికి అర్థమైంది.
తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో ఆ హోటల్ యజమాని దుర్గయ్య మండిపడ్డాడు. 'నా హోటల్లో పదిరోజులు పనిచేసి నా బాకీ తీర్చు! అంటూ గదమాయించాడు.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలు తోమడం, కుర్చీలు, బల్లలను శుభ్రం చేయడం వంటి పనులు పది రోజులపాటు కష్టపడి పనిచేశాడు. పని మొదట్లో కష్టమనిపించినా తరువాత అలవాటైంది. ఈ పదిరోజుల్ల్తోనూ వాడు ఒక గొప్ప సత్యాన్ని గుర్తించాడు. కష్టపడి పని చేస్తే ఆకలి బాధ ఉండదని. అందుకే అక్కడి నుండి వెళ్లిపోకుండా ఆ హోటల్‌లోనే పనివాడిగా కొనసాగాడు.
విశాఖుడు నిజాయితీగా ఉంటూ యజమాని నమ్మకం సంవాదించాడు. పది సంవత్సరాల వ్యవధిలో యజమానితో అవసరం లేకుండా హోటలు నడిపే మేనేజరయ్యాడు. హోటలు బాగా లాభాలనార్జించింది. విశాఖుడికి జీతం పెరగడంతో డబ్బు కూడబెట్టి స్వంత ఇల్లు కట్టుకున్నాడు. నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్నాడు.
అయితే విశాఖుడికి తెలియని రహస్యం ఒకటుంది. కేశవయ్య మోసగాడు కాదు.
దొంగగా మారిపోయే స్టితిలో ఉన్న కేశవుడి చేత కొద్ది రోజులు బలవంతంగా పని చేయించగలిగితే పనివిలువ తెలిసి మంచి దారిలోకి రాగలడని కేశవయ్య అంచనా వేశాడు. విశాఖుడు, కేశవయ్య హోటల్‌లో తిన్నదానికి డబ్బు చెల్లించలేదనేది ఒట్టిదే. విశాఖుడు మంచిదారిలోకి తీసుకురావడానికి కశవయ్యు హోటల్ యజమానిని ఒప్పించి ఇరువురూ కలిసి ఆడిన నాటకం అది. కశవయ్య తిన్నదానికి డబ్బు చెల్లించడమే కాదు, విశాఖుడికి బట్టలు కుట్టించడానికి కొంత డబ్బు కూడా ఇఛ్చి వెళ్లాడు.
కేశవయ్య చేసిన ప్రయోగం ఫలించి విశాఖుడు ప్రయోజకుడయ్యాడు.
ఒకరోజు కేశవయ్య తిరిగి వచ్చి హోటల్ యజమానిని ఓ గదిలోకి తీసుకెళ్ళి ఎదో మాట్లాడుతుండటం విశాఖుడు చూశాడు. వాడికి కేశవయ్యపై మండిపోయింది. చాటు నుండి వారి సంభాషణల్లో అసలు నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తరువాత ఆనందంతో కేశవయ్య కాళ్ళమీద పడి కృతజ్ఞతలు తెలువుకున్నాడు.
చిన్నవయసులో పసివాళ్లు చెడుదారి వైపు మళ్ళకుండా చూసుకుంటే వారి భవిష్యత్తు మంచి బాటలో పయనిస్తుంది.