పంచతంత్ర కథలు
యుక్తితో కుందేలు క్రూరమైన సింహాన్ని చంపిన కథ దమనకం చెప్పగా విని, కరటకం, “ఇలాంటి యుక్తులు ఎల్లప్పుడూ పారుతాయని ఎలా చెప్పగలవు? అని అడిగింది.
“మనం ప్రమాదాలకు సిద్ధపడాలి. లేకపోతే లాభం పొందలేం. ధైర్యవంతుడికి దేవతలు కూడా తోడ్పడతారు. సాలెవాడు సాహసంతో విష్ణువుపాత్ర ధరించబట్టె గదా మహా సౌందర్యవతి అయిన రాజకుమార్తెను పొందగలిగాడు? అన్నది దమనకం. “అదెలాగ?” అని కరటకం అడిగింది. ఆ కథను దమనకం ఇలా చెప్పింది:
సాలె విష్ణువు కథ
వంగదేశంలోని పుండ్రవర్థనం అనే నగరంలో ఆప్తమిత్రులైన ఒక సాలెవాడూ, వడ్రంగీ ఉండేవారు. వాళ్లు తము వృత్తులలో గొప్ప నిపుణులు కావడం చేత, అధిక సంపాదనలు కలిగి, అందమైన భవంతులతో నివసిస్తూ, డబ్బును మంచినీటిలాగా ఖర్చు చేసేవారు. సువాసనలు గల పూలు ధరించి అత్తరువులు ధరించి సుగంధ తాంబూలాలు సేవించేవారు.
ఒకసారి ఒక గొప్ప ఉత్సవం జరిగింది. వేడుకలు జరిగే ప్రతి స్టలానికీ జనం అందమైన దుస్తులు ధరించి ' తండోపతండాలుగా వస్తున్నారు.
సాలెవాడూ, వడ్రంగీ కూడా చక్కగా అలంకరించుకుని బయలుదేరారు. అక్కడ వాళ్లు ఉత్సవం జరిగే ప్రతిచోటికి తిరిగి ఆనందిస్తూ, ఇతరులు చేసుకున్న అలంకరణలను పరిశీలించసాగారు.
ఒక మహాభవనం గవాక్షంలో రాజకుమార్తె సుదర్శన చెలికత్తెలను వెంట ఉంచుకుని వారి కళ్ళబడింది. ఆమె నవ యౌవనంలో ఉన్న అపురూప సౌందర్యవతి. ఆమెను చూస్తూనే సాలెవాడు తీవ్రమైన మోహానికి గురి అయినాడు. అతను తన వికారాన్ని ఎలాగో బయటపడకుండా దాచుకుని, ఇంటికి తిరిగి వచ్చాడు. కాని, తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎటు చూసినా రాజకుమార్తె రూపమే కనబడసాగింది. ఆటను ఎంతో విచారంగా, ఆమెనే ధ్యానిస్తూ పడుకున్నాడు.
అతను, తనస్థితిని గురించి ఆలోచిస్తూ, “అందం ఉన్న చోట మంచితనం కూడా ఉంటుందంటారు గదా, ఈ అందగత్తె నన్ను ఎందుకిలా బాధిస్తున్నది? రాజకుమార్తె నా హృదయంలో తిష్టవేసుకుని, దాన్ని ఎందుకు దహిస్తున్నది? దేవుడు నా ప్రాణం తీయదలిస్తే అందుకు మరెదన్నా సాధనం చూడక ఈమెను ఎందుకు ఉపయోగించుకున్నాడు? ప్రపంచంలో ప్రతిదీ క్షణికమేనని బుద్ధుడు చెప్పిన మాట నిజం కాదు. నిజమైతే, రాజకుమార్తె మీద నాకు కలిగిన మోహం పోదే?'' అనుకున్నాడు.
ఇలా ఆలోచనలతో సాలెవాడు ఆ రాత్రి అంతా జాగరణ చేశాడు. మర్నాడు అదే వేళకు వడ్రంగి అతన్ని చూడటానికి చక్కగా అలంకరించుకుని వచ్చి తన మిత్రుడు మంచం పై శవంలాగా పడిఉండటం చూసి “మిత్రమా నీకేమయింది?" అని అడిగాడు.
సాలెవాడు నిట్టూర్పులు విడిచాడే గాని జవాబు చెప్పలేదు. వైద్యం కొంత తెలిసిన వడ్రంగి తన స్నేహితుడి నాడి పరీక్షించి, నుదురు తాకి చూసి, “మిత్రమా, నీది ప్రేమజ్వరం లాగుంది. ఎవరిని ప్రేమించావు?” అని అడిగాడు.
సాలెవాడు ఆశ్చర్యంతో లేచి కూర్చుని, “బాధను ప్రేమించిన భార్యతో గాని మిత్రుడితో గాని పంచుకుంటే తగ్గుతుందంటారు, ”అంటూ తనలోని బాధను బయటపెట్టాడు. వడ్రంగి అంతా విని, “సుప్రతివర్మ మహారాజు క్షత్రియుడు, నువ్వు వైశ్యుడివి. నీ కన్న గొప్ప కులానికి చెందిన స్త్రీని కోరటానికి నీకు జంకులేదా? అని అడిగాడు.
“క్షత్రియుడు క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహం ఆడవచ్చు. ఆమె రాజుకు వైశ్య భార్య వల్ల పుట్టినదే అయి ఉంటుంది. లేకపోతే నాకు ఆమె పైన ప్రేమ కలిగి ఉండదు. ఇటువంటివాటికి అంతరాత్మే సాక్షి!” అన్నాడు సాలెవాడు.
“ఇప్పుడు ఏం చేయాలి? ' అని అడిగాడు వడ్రంగి.
“నాకు చితి సిద్ధం చెయ్యి. నాకు రాజకుమార్తె లభించడం అసంభవం. ఆమె లభించకపోతే నేను బతకటం అసంభవం. అంతులేని శరీర బాధా, మనోవేదనా అనుభవించి నేను చావక తప్పదు... అన్నాడు సాలెవాడు.
“అదంతా కట్టిపెట్టు. ధనంతోగాని, బుద్దితోగాని సాధించరానిది ప్రపంచంలో ఏదీ లేదు. లేచి, స్నానం చేసి, భోజనం చేసి మామూలుగా ఉండు. నీకు రాజకుమార్తె దక్కే వైనం నెను ఆలోచిస్తాను, అన్నాడు వడ్రంగి.
తన మిత్రుడి తెలివితటలలో అపారమైన విశ్వాసం ఉండటం చేత సాలెవాడు విచారం కట్టిపెట్టి, మామూలు ప్రకారం జీవించసాగాడు. కొద్ది రోజుల అనంతరం, వడ్రంగి సాలెవాడి వద్దకు గరుడ రూపంలో విమానాన్ని తెచ్చాడు. అది చక్కగా రంగులు వేసి ఉన్నది. దాన్ని నడపటానికి ఒక కాడ ఉన్నది. అలాంటి విమానాన్ని పూర్వం ఎన్నడూ ఎవరూ చూసి ఉండరు.
దాన్ని ఎలా నడపాలో సాలెవాడికి చెబుతూ, “పైకి లేచి ఎగురుతూ వెళ్లాలంటే, ఈ కాడను బయటకు లాగు. కిందికి దిగి ఆగదలిస్తే కాడను లోపలికి నొక్కెయ్యి, ' అన్నాడు వడ్రంగి.
సాలెవాడు ఆ గరుడ విమానాన్ని నడపడం పూర్తిగా నేర్చుకున్నాడు.
“సుప్రతివర్మ మహారాజూ, ఆయన కుటుంబమూ, ముఖ్యంగా రాజకుమార్తె సుదర్శనా, నారాయణుడి భక్తులు. వారి పూర్వీకుడు ఒకడికి నారాయణుడు ప్రత్యక్షమై, వరాలు ఇచ్చినట్టు కూడా చెప్పుకుంటారు. నువు శంకు, చక్ర, గదా, పద్మాలు ధరించి, ఈ గరుడ విమానంపై వెళ్లి, రాజభవనం పై భాగానా వాలు. అక్కడే రాజకుమార్తె శయన మందిరం ఉన్నదనీ, అక్కడ ఆమె ఒంటరిగా పడుకుంటుందనీ నేను తెలుసుకున్నాను. నువు నారాయణుడి లాగా నటిస్తూ, గాంధర్వ విధిని ఆమెను నీ భార్యను చేసుకో,' అన్నాడు వడ్రంగి.
ఆ పగలల్లా సాలెవాడు ఆనందంగా ఊహలలో విహరించి, రాత్రి పడగానే ఖరీదైన పట్టుబట్టలు కట్టుకుని, సుగంధ లేపనాలు ఒంటికి పూసుకుని, శంఖు, చక్ర, గదా, పద్మాలు వెంటబెట్టుకుని గరుడ వాహనం ఎక్కి, తిన్నగా వెళ్లి, రాజకుమార్తె శయన మందిరం ముందు డాబా మీద వాలాడు.
అది పండు వెన్నెల రాత్రి. రాజకుమారి పంచలో మంచం మీద పడుకుని, అకస్మాత్తుగా నారాయణుడి తనకు సమీపంలో గరుడవాహనం మీద చూసింది. సాలెవాడి రూపం నారాయణుడిని వర్ధనకు తగినట్లె ఉన్నది. ఆమె చప్పున లేచి, సాలెవాడి ముందు సాష్టాంగపడి, “స్వామీ, నాపైన అనుగ్రహంతో ఇలా రావడానికి కారణం ఏమిటి?” అని అడిగింది. (ఇంకా ఉంది)