బాల భారతం-చందమామ పోయింది
అనగనగా ఓ ఊరు, అందులో ఆందరూ మూర్చులే! అందుకే అఆ ఊరి పేరు మూర్ఖపురం. ఒకసారి మూర్ఖపురానికి పెద్ద ఆపద వచ్చింది. పగలూ రాత్రీ విద్యుత్తే లేకుండా పోయింది. రాత్రవగానే ఎక్కడి పనులు ఆక్కడే ఆగిపోయేవి. ఏ పనీ చెయ్యకుండా రోడ్ల మీద తిరుగుదామంటే “ఢమాల్ ఢిమీల్ అని ఒకరికొకరు గుద్దేసుకునేవారు. తెల్లారి లేచేసరికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక చోట బొప్పి కట్టి ఉండేది.
పరిస్థితి ఇలాగే ఉంటే బతకడం కష్టం అనుకున్నారు ఊరిపెద్దలు. ఓ పగటిపూట ఊరి మధ్యలో ఉన్న వేప చెట్ట కింద అంతా సమావేశమయ్యారు. 'ఇలా అయితే మన ఊరు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు' అని నిట్టూర్చారు ఊరి పెద్ద చపలచిత్తంగారు.
“అవును, కొవ్వుత్తుల వెలుగులో ఎన్నాళ్లని వంట చేసుకుంటాం, ఎన్ని పనులని చూసుకుంటాం' ఆని నిట్టూర్చింది ఆయన భార్య.
“రూపాయి ఖర్చు లేకుండా మన ఊరు వెలిగిపోవాలంటే ఏం చెయ్యాలి' అని ఊరంతా తెగ ఆలోచించింది. ఒకరి తర్వాత ఒకరు బోల్డు సలహాలు చెప్పారు. చివరికి మూర్జేష్ అనే ఓ కుర్రవాడు లేచి 'మనం చందమామని దాచేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చు కదా!" అన్నాడు. అ సలహా ఊరంతటికీ నచ్చింది.
మరుసటి రాత్రి పౌర్ణమి, చందమామని పట్టేసుకుందామని ఊరి పెద్దలంతా హడావుడి పడ్డారు. ముందు చెరువులో ఉన్న చందమామని పట్టుకుందామనుకున్నారు కానీ చెరువు పెద్దదయి పోయింది. తర్వాత బావిలోని చందమామని పట్టుకుందామనుకుంటే బావి లోతుదైపోయింది. చివరికి చెంబులో ఉన్న చందమామని అయితే ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు అని నిర్ణయానికి వచ్చారు. అలా చందమామ ప్రతిబింబం ఉన్న ఒక చెంబుని జాగ్రత్తగా మూట కట్టి బీరువాలో దాచిపెట్టారు.
కొద్ది రోజులు గడిచేసరికి చపలచిత్తం గారింట్లో గాడిద తప్పిపోయింది. దాన్ని రాత్రిపూట వెతకడం కోసం చెంబులో దాచిన చందమామ అవసరం అయ్యింది. బీరువా తీసి మూట విప్పితే ఏముంది! ఖాళీ చెంబు వారిని వెక్కిరించింది.
“చందమామ పోయిందో...!' అని ఊరు ఊరంతా గోల చేశారు. 'నువ్వు తీసావంటే నువ్వు తీసావని' తిట్టకున్నారు. ఈసారి పౌర్ణమికి వచ్చే చందమామని మళ్లీ పట్టుకుని ఇంకా గట్టి బందోబస్తు మధ్య ఉంచాలని తీర్మానించారు. ఆకాశంలోని చందమామ మట్టుకు వీరి మూర్ఖత్వాన్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు విచక్షణతో దాన్ని ఎదుర్కోవాలి. (యాదుల జానపథ ఆధారంగా)