చందమామ కథలు-అనువుకాని చోట అధికులమనరాదు
పూర్వం అవంతీ రాజ్యంలో శివయ్య శాస్త్రి అనే పండితుడుండేవాడు. ఎన్ని విద్యలు నేర్చినా, అతను రాజాస్థానంలో ఉద్యోగం సంపాదించుకోలేకపోయాడు. తెలిసిన వారందరూ, “శివయ్యశాస్త్రీ, ఇంత పాండిత్యం ఉండీ నువ్విలా ఉండిపోవడం ఏం బాగా లేదు. ఒక్కసారి రాజుగారి దర్శనం చేసుకో. నీలాంటి పండితుడు ఉండాల్సిన స్థానం ఇది కాదు, ' అని ఎంతగానో నచ్చచెప్పారు.
దానికి అతను చిరునవ్వు నవ్వి ఊరుకునే వాడు. ఆస్థానంలో కొలువు కోసం అతను ఏనాడూ ప్రయత్నించలేదు. హితవు చెప్పిన వారందరూ విసుగు చెంది, అతనికి సూచనలివ్వడం మానేశారు. శివయ్య శాస్త్రి కొడుకు రఘునాథుడు తండ్రి వద్దనే శిష్యరికం చేసి, గొప్పగా పాండిత్యంలో రాణించాడు. అన్ని విద్యల్లో తండ్రిని మించిపోయాడు.
ఒకనాడు రఘునాథుడు శివాలయానికి వెళుతుండగా, ఎవరో ఇద్దరు తన గురించే మాట్లాడుకోవడం వినిపించింది. వారిలో ఒకడు రఘునాథుడు చాలా గొప్పవాడురా. ఇంత చిన్నవయసులో అంత పాండిత్యం ఆర్జించటముంటే మాటలా! అతడు తన తండ్రి పేరు నిలబెట్టాడు అన్నాడు. దానికి ఇంకొకతను, 'ఎంత పాండిత్యం సంపాదిస్తే మాత్రం ఎముంది, అతనూ తన తండ్రిలాగే ఇక్కడే మిగిలిపోతాడు. పాండిత్యం ఉన్నా ఎదుటివారి ముందు అది ప్రదర్శించే ధైర్యం లేకే శివయ్యశాస్త్రి ఇంట్లో మిగిలిపోయాడు. తండ్రికి లేని ధైర్యం కొడుకుకెలా వస్తుంది? అయినా విద్యను సరైన తీరులో ఉపయోగించుకోవడం కూడా తెలిసుండాలి. అది తెలియకనే శివయ్యశాస్త్రి ఆస్థానంలో ఉండవలసిన వాడు ఇంట్లో ఉన్నాడు. రఘునాధుడూ అంతే అన్నాడు.
ఇదంతా విన్న రఘునాధుడి మనస్సు అవమానభారంతో నిండిపోయింది. కానీ మొక్కలో ఎదుగుదల లేదు. రోజురోజుకీ తండ్రి చేసిన తప్పు తాను చేయకూడదనుకున్నాడు. తన ప్రతిభతో, ఆస్థానపండితుడై తానేంటో అందరిముందు నిరూపించుకోవాలనుకున్నాడు. గుడినుండి ఇంటికి వెళ్ళిన వెంటనే, తాను తీసుకున్న నిర్ణయాన్ని తండ్రితో చెప్పాడు.
రఘునాధుని నిర్ణయం విన్న శివయ్య శాస్త్రి, ఒక చిన్న చిరునవ్వు నవ్వి, “నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే హిమాలయాల్లో ఉన్న బ్రహ్మేంద్రముని ఆశీస్సులు కూడా తీసుకో. తిరిగి వస్తూ ఒక దేవదారు మొక్కను తీసుకురా అని అన్నాడు.
రఘునాథుడు హిమాలయాలకు వెళ్లి ముని ఆశీర్వచనాలు తీసుకుని దేవదారు మొక్కతో గ్రామానికి చేరుకున్నాడు.
శివయ్యశాస్త్రి, “నాయనా, భక్తితో ఈ మొక్కను పెంచు. అది మూడు చిగురులు వేసిన తర్వాత నువ్వు ఆస్తానానికి వెళ్లు. అన్నాడు.
రఘునాధథుడు ఆ మొక్కను జాగ్రత్తగా పెంచసాగాడు. ఎంత ప్రయత్నించినా ఆ వాడిపోతూ కొన్నాళ్లకు ఎండిపోయింది. కొడుకు బాధను చూసిన శివయ్యశాస్త్రి, “నాయనా చింతించకు, ఈ మొక్కందుకు చనిపోయిందో నీకు తెలుసా? ' అనడిగాడు.
“అది ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పోయింది. దానికి సరిపడా పోషకాలు ఈ భూమిలో లేవు, రఘునాథుడు అన్నాడు. “సరిగ్గా మన రాజ్యంలోనూ పాండిత్యానికి తగిన వాతావరణం లేదు. ఇక్కడందరూ యుద్ధ కళలనే ప్రేమిస్తారు. మనకు ఎంత పాండిత్యం ఉంటే ఏమిటి, దానికి విలువ లేనిచోట? విద్యలెన్ని నేర్చినా, దానికి తగిన గౌరవం ఇవ్వగలిగిన చోటనే అవి మనగలవు. కళాపోషకులు ఉన్న చోటనే పాండిత్యం (బతుకుతుంది, ఈ మొక్కలాగా. లెకపోతే ఎం జరుగుతుందో చూశావుగా, అన్నాడు శివయ్య శాస్త్రి,
“అర్ధమైంది నాన్నా, అందుకే అన్నారేమో, అనువుగాని చోట అధికులమనరాదు అని, అన్నాడు రఘునాధుడు మనసులో అవమానభారాన్ని కడిగేస్తూ.