బాల భారతం-అతెవా మతెవా
నేలమ్మ పరిచిన అరిటాకు లాంటి పచ్చిక బీట్లో మేస్తోంది మేకల మంద. కొపవ చిన్నకత్తి కట్టిన పొడవాటి కర్రను ఆనుకుని నిలుచున్నాడు కాపరి. అతడి పెదాలకు ఆనించి ఉన్న పిల్లన గ్రోవి చెరకుగడ ముక్కలా ఉంది. దాన్నుంచి 'చెవులతో లొట్టలు వేయించే' పాట గాల్లోకి ప్రవహిస్తోంది. అతెవా అనుకున్నట్టు
మేస్తూ మేస్తూనే ఆ గానాన్ని ఆలకిస్తున్న మేకలు పాలబువ్వలో తేనె కలుపుకుని తింటున్నపిల్లకాయల్లా మధ్య మధ్య తలెత్తి మెరిసే కళ్లతో వాడిని చూస్తున్నాయి.
ఊళ్లోకెల్లా 'అతి తెలివైన వాడు' (అతెవా) అని పేరుమోసిన వాడు అక్కడకొచ్చి కాపరితో అన్నాడు. మేకలిస్తే ఆవులిస్తా!
కాపరి ఒక్క క్షణం ఆలోచించి "ఏ మేక కావాలో ఎంచుకో!” అన్నాడు.
మందలోకెల్లా సదురుగా ఉన్న మేకను చూపాడు అతెవా. కాపరి దాని మెడలో తాడు కట్టి అతెవా చేతికిచ్చి "నాకు ఇవ్వాల్సిన ఆవులెక్కడ?” అని అడిగాడు.
అతెవా మారువేషంలోని గుంటనక్కలా నవ్వాడు. తర్వాత కడుపు నిండిన తోడేలులా నెమ్మదిగా నోరు తెరిచి “'హా..హా...య్” అంటూ దీర్ణంగా ఆవులించి, "చాలా?” అన్నాడు.
ఏంటి చాలేది! అంగీ కట్టుకుని, తలపాగా చుట్టుకున్న అమాయకత్వంలాప్రశ్నించాడు కాపరి.
"నేనేమన్నాను? 'మేకనిస్తే ఆవులిస్తా' అన్నాను. నువ్వు మేకానిచ్చావు అన్నమాట ప్రకారం నేను ఆవులిచ్చాను.
సరిపోయింది కదా!” పాము బుసలా ముసిముసిగా నవ్వాడు ఆతెవా.
అతెవా ఆనుకున్నట్లు కాపరి బిత్తరపోయి నెత్తి గోక్కోలేదు “నేను గ్రామాధికారి వద్దకు పోయి చెపుతా” అన్నాడు నిబ్బరంగా.
“పద నేనూ వస్తా..." కులాసాగా ఈలేస్తూ, మేకను లాక్కుంటూ బయల్దేరాడు అతెవా. కాపరి మందను దగ్గరలో ఉన్న మరో కాపరికి అప్పగించి ఊరి దిక్కుకు నడిచాడు.
రచ్చబండపై పదిమంది మధ్యలో కూర్చుని ఉన్నాడు గ్రామాధికారి. కాపరి ఆతెవా చేసింది చెప్పాడు. అతెవాదీ, గ్రామాధికారిదీ ఒకే కులం. అతెవా వంక మెచ్చుకోలుగా చూస్తూ, ఏదో తమాషాను విన్నట్టు “హో... హో...” అంటూ పగలబడి నవ్వాడు గ్రామాధికారి.
“మేకనిస్తే ఆవులిస్తానన్నాడని చెబుతున్నావు. మేకనిచ్చాక ఆవులించాడనీ నువ్వే చెబుతున్నావు. అతెవా అన్నట్లే చేశాడు తప్ప మాట తప్పలేదే? ఇక నేను చెప్పేదేముందిరా! ” అన్నాడు తప్పొప్పుల తూకంలో తనంతటి వాడు లేడన్నంత ధీమాగా.
అందరూ అనుకున్నట్లు కాపరి ముఖం చిన్నబుచ్చుకోలేదు. గ్రామాధికారి మాటల్ని 'అక్షరసత్యాలుగా ఆంగీకరిస్తున్నట్లు తలాడించాడు.
“తమరు చెప్పింది సబబేనయ్యా! ఆయన చెప్పినట్లే చేశాడండయ్యా! 'అవులిస్తా' అంటే నేను పాలిచ్చే ఆవులు అనుకున్నా. పొరపాటు నాదేనండయ్యాః అయితే ఇంకో చిన్నపని చేస్తే ఆయన మాట నూరుపాళ్లూ నిజం అవుతుందయ్యా” ఒద్దికగా అన్నాడు.
“ఏంట్రా అదీ!” ఆడిగాడు గ్రామాధికారి. “తాను గోడ కట్టినంత పక్కాగా తీర్చు చెప్పాక ఆందులో కంతలేం ఉంటాయి వీడి ముఖం' అన్నంత నమ్మకం ఆ ప్రశ్నలో.
“నేను ఇస్తానని ఒప్పుకున్న మేకకు తాడు కట్టి చేతికి ఇచ్చాను కదండయ్యా... పగ్గమే కడతాడో, పలుపే వేస్తాడో ఆయనను కూడా ఓ రెండు ఆవులింతలను నా చేతికి ఇమ్మనండయ్యా... పట్టుకుని వెళ్లిపోతాను" అన్నాడు కాపరి.
ఆ మాటకి గ్రామాధికారి ముఖం కందిపోయింది. తన ముసుగు అందరి ఎదుటా బయటపడిపోయింది. ఇక ఆతెవాకైతే కాపరి తెలివికి జడుపు పుట్టింది.
రచ్చబండ మీదున్న జనం ఒక్కుమ్మడిగా పకాలున నవ్వారు. చాలామంది గ్రామాధికారి వంక చూస్తూ అన్నారు - “వీడు చెప్పిందీ దర్మంగానే ఉందండోయ్. "
కాపరి తన జుట్టు పట్టుకుని జనం చేతిలో పెట్టినట్టు అనిపించింది గ్రామాధికారికి. ముఖం మీది చెమటను కండువాతో తుడుచుకుంటూ అడిగాడు - “అరె అతెవా! వాడు నీకు మేకను తాడు కట్టి చేతికి ఇచ్చినట్టే, నువ్వు కూడా 'ఆవులింతలను వాడి చేతికి ఇవ్వాలి కదా?”
“ఆదెలా కుదురుతుంది - ఎక్కడైనా ఆవులింతలను కట్టీ చేతికి ఇవ్వగలరా? " బిక్కముఖంతో ఉక్రోషంగా అన్నాడు ఆతెవా.
“ఇవ్వకపోతే మాట తప్పినట్టే కదయ్యా!” జనం మళ్లీ ఒక్కసారిగా అన్నారు. కాపరి ముఖం అప్పటికీ వినయాన్నే పులుముకుని ఉన్నా... ఆవుల మందను కాసే అలనాటి కొంటె కృష్ణుడిలా ఆతెవా వంక చూస్తున్నాడు.
గుడిలో పూజారి ఇచ్చిన తీర్ధం చేదుగా ఉన్నా గుటక వేయక తప్పన్నట్లు జనవాక్యాన్ని తలదాల్చక గ్రామాధికారికి తప్పలేదు. లేకపోతే తన తప్పు రెట్టింపై, పక్షపాతం తొక్క వలిచిన ఆరటిపండులా తెలిసిపోతుంది.
“ఆవులింతల్ని ఇవ్వలేకపోతే ఆవుల్నే ఇవ్వు. ఆవులిస్తానన్న మాటకు అదే పరిష్కారం" ఆదేశించాడు అతెవాని.
ఆతెవా “అన్యాయం” అంటూ అరిచాడు. వాడు జీవితంలో మొదటిసారి ఓడిపోయాడు. ఆ ఓటమి ఖరీదు కనీసం రెండు ఆవులు. ఆ క్షణంలో వాడికి కాపరి కర్రకున్న కత్తికన్నా పదునైన పచ్చి నిజమూ తెలిసొచ్చింది.
“మేకలన్నీ సాధు జంతువులు కావు. అమాయకంగా కనిపించే వారంతా నోట్లో వేలు పెడితే కొరకలేని వారూ కారు. ఆలాంటి వాళ్లలో 'మహా తెలివైన వాళ్లూ (మతెవా) ఉంటారు.