బాల భారతం-అర్హత
ఛాలా కాలం క్రితం అవంతీ రాజ్యాన్ని విక్రమాదిత్యుడు పాలించేవాడు. ఆయనకి ఇద్దరు కుమారులు. కవలలు. వారికి జయుడు, విజయుడు అని పేర్లు పెట్టి గారాబంగా 'పెంచసాగారు. వారికి ఐదవ ఏడు రాగానే గురుకులానికి పంపారు.
రాజకుమారులు విద్యాభ్యాసం తరువాత ఆశ్రమాన్ని వీడి రాజభవనానికి చేరుకున్నారు. వారిని చూసి విక్రమాదిత్యుడు ఎంతో సంతోషించాడు. అప్పుడే అతనికొక ధర్మ సందేహం కలిగింది. సంప్రదాయం ప్రకారం తన తదనంతరం పెద్ద కుమారుడు సింహాసనాన్నిఅధిష్టించాలి. కానీ ఇద్దరూ కవలలు. అలాంటప్పుడు తన వారసుడిగా ఎవర్ని ఎన్నుకోవాలి?
విక్రమాదిత్యుడు తన సందేహాన్ని మంత్రి సుబుద్ధికి తెలిపాడు. సుబుద్ధి “ప్రభూ! మీ కుమారులిద్దరూ వయసులోనూ, విద్యలోనూ సమానులు. కానీ పాలనా దక్షత ఎవరికి ఉందో తెలుసుకోవటానికి ఒకటే మార్గం! ఇద్దరికీ కీలకమైన బాధ్యతల్ని అప్పగించి చూడాలి” అన్నాడు.
రాజుకి మంత్రి సలహా నచ్చింది. అదే సమయంలో ఇరుగు పొరుగున ఉన్న చంద్రగిరి, సింహపురి అనే రెండు రాజ్యాలతో అవంతీ రాజ్యానికి సరిహద్దు తగాదాలు వచ్చాయి. ఆ రెండు దేశాలు ఇరుపక్కల నుంచి దండెత్తివచ్చాయి. విక్రమాదిత్యుడు సుబుద్ధి సలహాను పాటిస్తూ తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి ఉత్తర ప్రాంతపు సైన్యానికి జయుడిని, దక్షిణ ప్రాంతపు సైన్యానికి విజయుడిని సైన్యాధిపతులుగా నియమించి ఆ రెండు రాజ్యాల్నీ ఓడించమని ఆదేశించాడు.
జయవిజయులు ఇద్దరూ తమ సైన్యాలను బాగా నడిపి యుద్ధంలో విజయం సాధించారు. జయుడు శత్రు రాజును సంహరించి అతని స్థానంలో తన ప్రతినిధిని చంద్రగిరిలో నియమించాడు.
విజయుడు మాత్రం శత్రురాజును క్షమించి సింహపురికి అతణ్నే సామంత రాజుగా నియమించాడు. అలా ఇద్దరూ తమ తండ్రి అప్పగించిన కార్యాన్ని విజయవంతంగా ముగించి రాజ్యానికి తిరిగొచ్చారు.
రాజు తన ఆస్థానంలోని పండితులతో, మేధావులతో సభ ఏర్పాటు చేసి తన కుమారుల్లో సింహాసనానికి ఎవరు తగినవారో తేల్చమని కోరాడు. అందరూ సమాలోచనలు జరిపి చివరికి “మహారాజా! శత్రుశేషం, రుణశేషం ఉండరాదంటారు. జయుడు శత్రురాజును సంహరించి శత్రుశేషం లేకుండా చేశాడు. అయితే విజయుడు మాత్రం శత్రురాజుని క్షమించి అతన్నే రాజుగా నియమించి తప్పు చేశాడు. అతను ఏదో ఒక రోజు మళ్లీ తిరుగుబాటు చేయవచ్చు. అందువల్ల జయుడే తగిన వారసుడు” అన్నారు.
అయితే ఈ అభిప్రాయంతో రాజుకు సంతృప్తి కలగలేదు. మంత్రి సుబుద్ధివేపు చూశాడు.
సుబుద్ధి నవ్వుతూ “మహారాజా!
రాజు గెలవాల్సింది యుద్దాలు కాదు. ప్రజల మనసుల్ని! జయుడు శత్రురాజును చంపాడు కానీ చంద్రగిరి ప్రజల దృష్టిలో రాజు హంతకుడిగా ముద్ర వేసుకున్నాడు. రేపు అక్కడ తిరుగుబాటు జరిగితే ప్రజలు జయుడి మీద కక్షతో తిరుగుబాటుదారులకు సాయపడొచ్చు. కానీ సింహపురి పరిస్థితి దీనికి భిన్నం. తమ రాజుకు క్షమాభిక్ష పెట్టినందుకు అక్కడి ప్రజలకు, రాజుకూ విజయుడి పట్ల కృతజ్ఞతా భావం ఉంటుంది. వారు విజయుడికి వ్యతిరేకంగా పనిచేయరు.
అందువల్ల సింహపురి శాశ్వతంగా మన సామంత రాజ్యంగా ఉంటుంది. నిజమైన రాజధర్మాన్ని పాటిస్తూ యుద్దాన్ని శాంతియుతంగా ముగించిన విజయుడే మీకు తగిన వారసుడని నా అభిప్రాయం” అన్నాడు. మంత్రి అభిప్రాయంతో సంతృప్తి చెందిన రాజు విజయుడిని తన వారసుడిగా ప్రకటించాడు.