Moral Stories-అర్దణా రాజు
పాటలీపుత్ర నగరంలో ఒక పేదవాడుండే వాడు. వాడు నీళ్లు మోసి జీవితం వెళ్ల బుచ్చుతుండేవాడు. వాడుండేది నగరపు ఉత్తర ద్వారం వద్ద. ఆ నగరం దక్షిణ ద్వారానికి సమీపంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె కూడా నీళ్ల బిందెలు మోసి జీవయాత్ర గడుపుతున్నది. ఈ ఇద్దరికీ స్నేహం కుదిరి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్నప్పటికీ ఇద్దరూ నగరం చెరొక మూలాపని చేస్తూ ఉండటం వల్ల తరచు ఒకరి నొకరు చూసుకునేవారు కారు.
ఇలా ఉండగా ఒకరోజు ఎదో పండగ వచ్చింది. నీళ్లు మోసేవాడు తన పని త్వరగా ముగించుకుని దక్షిణ ద్వారం దగ్గర ఉండే తన భార్యను చూడబోయాడు.
“ఇవాళ పండగ రోజు. అందరూ పండుగచేసుకుంటారు. మనం మాత్రం చేసుకోవద్దా? నా దగ్గిర అర్హణా ఉన్నది. నీదగ్గర ఎమాత్రం ఉన్నది?” అని భార్య అడిగింది, తన అర్ధణా చూపుతూ.
“నాదగ్గర కూడా అర్ధణా ఉంది. దాన్ని ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున జాగ్రత్తగా దాచి ఉంచాను, అన్నాడు భర్త. “చాలు. అందులో ఒక కానీ పెట్టి పూలు కొందాం. ఇంకో కానీకి చందనం కొందాం. మిగిలిన అర్ధణాతో పాయసం తాగుదాం! అన్నది భార్య.
ఈ మాటలకు నీళ్ళు మోసేవాడు పరవశుడై పోయాడు. తానూ, తన భార్యా కలిసి పండగ చేసుకుంటున్నామన్న ఆనందంలో వాడికి వళ్లు తెలియలేదు.
“నువ్విక్కడే ఉండు. నేనిప్పుడే ఉత్తర ద్వారానికి వెళ్ళి నా అర్ధణా తెస్తాను, అంటూ వాడు బయలుదేరాడు.
మిట్టమధ్యాహ్నం కావస్తోంది. నెత్తిన ఎండ మందడివోతున్నది. కింద దారివెంబడి ఇసుక నిప్పులు చెరుగుతున్నది. కాని ఆనందంలో, నీళ్లు మోసెవాడికీ ఎండా తెలియలేదు. కాళ్ళకు వేడీ తెలియలేదు. వాడు ఉత్సాహంగా గెంతుతూ, పాడుతూ, ఉత్తరపు ద్వారం కేసి పోతున్నాడు.
రెండు ద్వారాలకూ మధ్య మార్గంలో రాజుగారి మేడ ఉన్నది. రాజు పై అంతస్తులో నిలబడి చూస్తూంటే ఎండను లక్ష్య పెట్టకుండా, కాళ్లు కాలుతున్న సంగతి కూడా తెలియకుండా, పాడుతూ వెళ్ళుతున్న నీళ్ళు మోసేవాడు కనిపించాడు. రాజుకు వాణ్ణి చూసి ఆశ్చర్యమయింది. వాడి ఆనందానికి కారణమేమిటో తెలుసుకుందామని, ఆయన నౌకర్లను పిలిచి, 'ఆ పాడుతూ వెళ్లేవాణ్ణి నా దగ్గరికి పట్టుకురండి, అని ఆజ్ఞాపించాడు.
భటులు వెళ్లి నీళ్లు మోసేవాడితో, “ఎయ్, రాజుగారు రమ్మంటున్నారు, రా, అన్నారు.
“నాకు రాజుగారితో ఏం పని? నేనాయన నెరుగను, అన్నాడు నీళ్లు మోసేవాడు, తన దారిన తాను వెళ్లడానికి సిద్దపడుతూ.
రాజభటులు వాణ్ణి పట్టుకుని బలవంతాన రాజుదగ్గరికి ఈడ్చుకు వెళ్లారు. రాజుగారు వాణ్ణి చూసి “ఎమోయ్, పైన, నెత్తి కింద కాళ్లూ మాడుతున్నా లెక్క చేయకుండా ఎక్కడికి పోతున్నావు?' అని అడిగాడు.
“అయ్యా, నా గుండెలో ఇంతకన్న వేడి అయిన కోరిక ఉండటం వల్ల నాకు ఈ ఎండ వేడి తెలియడం లేదు, అన్నాడు నీళ్లు మోసేవాడు.
“అదెంత గొప్ప కోరికో అనుకుంటూ రాజు, “ఏమిటా కోరిక?” ఆని అడిగాడు.
“అయ్యా, ఇవాళ పండుగ. నా భార్య దగ్గర అర్దణా ఉన్నది. నేను ఉత్తర ద్వారం వద్ద గోడలో ఇటుకల సందున అర్దణా దాచుకున్నాను. ఇద్దరి డబ్బులూ కలిసి అణా అవుతుంది, అందులో కానీకి పూలూ, కానీకి చందనం కొని మిగిలిన అర్దణాతో పాయసం వండుకుని ఇద్దరమూ హాయిగా పండగ చేసుకుంటాం. అందుకే బయలుదేరాను. నేను నా అర్దణా తీసుకుని తిరిగి దక్షిణ ద్వారానికి వెళ్లాలి. అప్పుడు పండుగ చేసుకోవాలి. నా భార్య కాచుకుని ఉన్నది. అందుచేత త్వరగా నన్ను పోనివ్వండి, అన్నాడు నీళ్లు మోసేవాడు.
ఇది విని రాజు నివ్వెరపోయాడు.
“ఇంకా వచ్చినంత దూరం వెళితే కాని ఉత్తర ద్వారం రాదు. దానికి రెట్టింపు నడిస్తే గాని మళ్ళీ దక్షిణ ద్వారానికి చేరుకోవు. ఎందుకంత శ్రమ? నేను అర్దణా ఇస్తాను. నీ భార్య వద్దకు తిరిగిపోయి పండగ చేసుకో! అన్నాడు రాజు.
“చిత్తం. తమరిచ్చే అర్ధణా తీసుకుంటోను, నా అర్దణా కూడా తెచ్చుకుంటాను,' అన్నాడు నీళ్లు మోసేవాడు.
“ఆ అర్ధణా కోసం ఎందుకు మథన పడతావు? కావలిస్తే పావలా ఇస్తాను. తీసుకుని తిరిగిపో, అన్నాడు రాజు.
“చిత్తం, పావలా ఇప్పించండి. నా అర్దణా కూడా తీసుకుని తిరిగిపోతాను. అన్నాడు నీళ్లు మోసేవాడు.
రాజుకు పట్టుదల వచ్చింది. ఎంత ఇస్తే వాడు ఆ అర్దణాను మరిచిపోతాడో చూద్దామని, వాడికి ఒక రూపాయి దగ్గర నుంచి లక్షరూపాయల దాకా ఇస్తానంటూ వెళ్లాడు. ఎ౦త ఇచ్చినా వాడు తన అర్దణాను తీసుకోనిమ్మని బతిమాలసాగాడు.
చివరకు రాజు విసిగి, నువ్వా అర్దణా తీసుకోకుండా ఉండేటట్టయితే సగం నగరానికి ఇప్పుడే నిన్ను రాజు చేస్తాను. ఏమంటావు? అని అడిగాడు.
“చిత్తం! అలాగే చేయండి, అన్నాడు నీళ్లు మోసేవాడు. వెంటనే రాజు మంత్రికి కబురు చేసి “వీణ్ణి సగం నగరానికి రాజును చేస్తూ పత్రం రాయండి, అన్నాడు.
నగరాన్ని మంత్రి ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించాడు. 'అందులో ఏ సగం కావాలో కోరుకో. ఆ ప్రకారం మంత్రి గారు పత్రం రాసేసారు. ఆ సగంలో నువు రాజ్యం ఏలవచ్చు, అన్నాడు రాజు.
“చిత్తం, నాకు ఉత్తరపు సగం ఇప్పించండి, అన్నాడు నీళ్లు మోసేవాడు. ఉత్తర ద్వారం దగ్గర దాచుకున్న అర్ధణా కోసమే వాడు అలా కోరాడని అందరూ అనుకున్నారు.