చందమామ కథలు-పరీక్షలు
ఒకానొక దేశంలో ఒక పేదవాడు ఎంతగా ప్రయత్నించినా సంసారం గడపలేక రాజు వద్దకు పోయి సహాయం వేడాడు.రాజు పేదవాడి కోరిక విన్నమీదట, “నిన్ను నాలుగు ప్రశ్నలు అడుగుతున్నాను. అన్నిటికన్న వేగమైనదేది? అన్నిటికన్న బలం కలదేది? అన్నిటికన్న మెత్తనైనదేది? అన్నిటికన్న ఆనందకరమైనదెది? రేపటిలోగా ఈ ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే నీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను,' అన్నాడు.
పేదవాడు ఈ ప్రశ్నలను మననం చేసుకుంటూ ఇంటికి వెళ్లి సమాధానాలు తట్టక తికమక పడసాగాడు. అతని కూతురు పదిహేడేళ్ల పిల్ల తండ్రిని చూసి, “ఏమిటి, నాన్నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అని అడిగింది.
“రాజుగారిని యాచించబోయాను.
ఆయన నన్ను నాలుగు ప్రశ్నలడిగి రేపటిలోగా సమాధానాలు చెప్పాలన్నారు. అటువంటి ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పగలను? అన్నాడు పేదవాడు.
అతని కూతురు ప్రశ్సలు విని, “దీనికింత ఆలోచన దేనికి, నాన్నా? అన్నింటి కన్న వేగమైనది గాలి. అన్నిటికన్న బలమైనది భూమి. ఎందుకంటే ఎంత బలంగల ప్రాణులకు కూడా భూమే బలమిస్తుంది. అన్నిటికంటె మెత్తనైనది చెయ్యి. హంసతూలికా తల్పం మీద పడుకున్న వాడు కూడా చెయ్యి ముడిచి తలకింద పెట్టుకుంటాడు. అన్నిటికన్న ఆనందకరమైనది నిద్ర. ఇంకా దేని చేతా పోని దుఃఖం కూడా నిద్రలో పోతుంది.
పేదవాడు ఈ సమాధానాలకు సంతోషించి మర్నాడు ఉదయమే రాజుదగ్గరకు వెళ్ళి సమాధానాలు నాలుగూ చెప్పాడు. 'ఈ సమాధానాలు నీ అంతటా నీవే తెలుసుకున్నావా? లేక ఎవరైనా నీకు చెప్పారా? అని రాజు అడిగాడు.
"నా కూతురు పదిహేడేళ్ల పిల్ల చెప్పింది, అన్నాడు పేదవాడు.
రాజు ఆశ్చర్యపడి, నీ కూతురు
అంత తెలివిగలదా? అయితే ఈ పోగు తీసుకుపోయి నీ కూతురికిచ్చి రేపటిలోగా దానితో నాకొక జరీ ఉత్తరీయం నేసిపెట్టమను, అని జానెడు పోగొకటి పేద వాడికిచ్చాడు.
పేదవాడు హతాశుడై ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రిని చూసి కూతురు, “ఏం నాన్నా? రాజుగారికి నీమీద ఇంకా దయ కలగలేదా? అన్నది.
ఆయన ఇంకో పరీక్ష పెట్టాడు. 'ఈ నూలు పోగుతో రేపటిలోగా నీవాయనకు జరీ ఉత్తరీయం నేసి ఇవ్వాలట,' అన్నాడు తండ్రి.
“అదెంత భాగ్యం నాన్నా? నువ్వొక ఛీపురుపుల్ల పట్టుకెళ్ళి, రాజుగారి కియ్యి. దానితో మగ్గం తయారు చేసి ఈ సాయంత్రంలోగా ఇవ్వమను. జరి ఉత్తరీయం అలాగే నేసిపెడతాను, అన్నది పేదవాడి కూతురు.
పేదవాడు ఛీపురుపుల్ల ఒకటి తీసుకుని రాజుగారి వద్దకు పోయి కూతురు చెప్పిన మాటలే అన్నాడు.
రాజు క్షణం ఆలోచించి, “ఎమో అనుకున్నాను. నీ కూతురు చాలా ప్రయోజకురాలే. నూరు కోడిగుడ్లుప్పిస్తాను.
వాటిని పొదగబెట్టి రేపు ఉదయానికల్లా పిల్లలు చేయించి నావద్దకు పంపమని నీ కూతురుకు చెప్పు, అన్నాడు.
ఇదంతా ఎదో ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ పేదవాడు నూరు కోడిగుడ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కూతురు మాత్రం నిశ్చతంగా ఆ గుడ్లతో అటూ, కూరా, పులుసూ వైరాలు చేసి మూడు పూటలా తండ్రికి పెట్టి తాను కూడా తిన్నది. మర్నాడు ఆమె తండ్రితో ఈ విధంగా అన్నది.
“నాన్నా, రాజుగారివద్దకు పోయి, గుడ్లన్నీ పొదిగాయని చెప్పు. అయితే కోడి పిల్లలు ఏ ఆహారమూ ముట్టడం లేదని, ఒక్కరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి తినేటట్టు లేవనీ, అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు. లేకపోతే కోడిపిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు.
పేదవాడు ఈ మాటలే రాజుకు చెప్పాడు. రాజు చాలా సంతోషపడ్డాడు. ఆయన పేదవాడితో, నీవింటికి వెళ్ళి, నేను రెండు గడియలలో మీ ఇంటికి వస్తున్నానని నీ కుమార్తెతో చెప్పు, అన్నాడు.
ఈ సంగతి తెలియగానే పేదవాడి కూతురు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి, గడపలకు పసుపు రాచి, మండపానికి పచ్చతోరణం కట్టింది. కాస్సేపట్లో రాజుగారు గుఱ్ఱం మీద వచ్చి పేదవాడి ఇంటిముందు గుఱ్ఱం ఆపాడు గాని దిగలేదు. రాజుగారిని ఆహ్వానించడానికి రాబోతున్న పేదవాడి కుమార్తె కూడా వాకిలి గుమ్మం దాటబోతూ ఒక కాలు మాత్రం బయటకు వేసి ఆగిపోయింది.
గుఱ్ఱం మీద ఉన్న రాజు ఆ పిల్లకేసి, “అమ్మాయీ, నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా? గుర్రాన్ని నడుపుకుని ముందుకు సాగబోతున్నానా? అని అడిగాడు. పేదవాడి కూతురు చిరునవ్వు నవ్వి, 'మహాప్రభూ! మీరు నాకన్న గొప్పవారు, తెలివిగలవారు, చదువుకున్న వారు. నేను లోపలికి వెళ్లబోతున్నానో బయటకి రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను! అన్నది.
రాజు సంతోషించాడు. గుఱ్ఱం దిగి లోపలికి వచ్చి పెద్ద వరహాల సంచి పేదవాడికిచ్చాడు. తరవాత ఆయన ఆ పేదవాడి కుమార్తెనే పెళ్లాడి ఆమెను తన పట్టపు రాణిని చేసుకున్నాడు.