నేరపరిశోధన
శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరివాడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. అదృష్టవశాత్తూ నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యమూ ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకడమే గాక దానాలూ, దక్షిణలూ, సంభావనలూ దొరుకుతుండేవి. ఒంటరివాడు కావడం చేత ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్దికాలానికి వెయ్యి బంగారు దీనారాలుగా నిలువ చేసి, దాన్ని మరొక విధంగా భద్రపరచలేక, అడవిలో ఒక చోట పాతి పెట్టేశాడు.
భార్యా బిడ్డలూ, అన్నదమ్ములూ, బంధువులూ, ఎవరూ లేని ఆబ్రాహ్మణుడి పంచప్రాణాలూ ఆ బంగారం మీదే ఉండేవి. రోజూ ఆయన అడవికి పోయి, తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకు పోలేదు కదా అని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుందేవాడు.
ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దానినెవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి, గుండెలు బాదుకుని ఎడుస్తూ నగరంలో వచ్చి పడ్డాడు. కనిపంచినవారి కల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవరికీ తెలియలేదు.
“నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి? నది దగ్గరకెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను! అంటూ బ్రాహ్మణుడు నదికసి పరిగెత్తాడు.
రాజు ప్రసేనజిత్తు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగివస్తూ.. ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుడిని చూసి, విషయం తెలుసుకుని, ' ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా, ఆత్మహత్య చేసుకుంటావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించినవాణ్ణి పట్టుకుంటాను. లేదా, నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను. నువు నీ డబ్బు పాతిపెట్టిన చోటుకు ఏమైనా గుర్తులుంటెే చెప్పు?' అని అడిగాడు.
“మహాప్రభూ, నేను ధనం పాతిపెట్టి నచోట అడవిబీర మొక్క ఒకటి గుర్తుండేది. ఇప్పుడు అది కూడా పోయింది, అన్నాడు బ్రాహ్మణుడు.
అడవిబీర మొక్క ఎలా గుర్తవుతుంది. అలాంటివి అడవిలో ఎన్నయినా ఉండవచ్చు గదా? అన్నాడు రాజు.
“లేదు, మహాప్రభూ! ఆ ప్రాంతంలో అదొక్కటే అడవిబీరమొక్క, అన్నాడు బ్రాహ్మణుడు.
“అయితే, నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు? అన్నాడు రాజు.
“మహాప్రభూ, నాకు తప్పనిచ్చి మరే పిట్టకు కూడా తెలీదు. చెప్పుకునేందుకైనా నాకెవ్వరున్నారు? నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవరూ చూసి ఉండలేదు," అన్నాడు బ్రాహ్మణుడు.
రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఆ దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్పురించింది. ఆయన మంత్రిని పిలిపించి;
“మంత్రీ, నాకు ఆరోగ్యం సరిగా లేదు. వెంటనే నేను వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యుల నందరినీ పిలిపించండి,. అన్నాడు.
త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి, “ఏమయ్యా, నువు నిన్నా, ఇవాళ ఏయే రోగాలకు ఎలాంటి బెషధం ఇచ్చావు? ఏయే మూలికలు వాడావు?' అని ప్రశ్నించాడు.
వారంతా చెప్పింది విని పంపివేయసాగాడు. ఇదంతా యోచనగా చూస్తున్న మంతికి రాజుగారి అభిప్రాయం కొంచెమైనా అర్దం కాలెదు.
ఆఖరుకు ఒక వైద్యుడు, ప్రభూ, మాతృదత్తుడు అనే వైద్యశిఖామణికి అడవి బీరమొక్క రసం నిన్న వాడాను, అన్నాడు.
రాజు ఆసక్తితో, అలాగా? ఆ మొక్క ఎక్కడ దొరికింది?. అని అన్నాడు. “అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా, అన్నాడు వైద్యుడు.
“అయితే, ఆ సేవకున్ని మావద్దకు వెంటనే పంపించు, అన్నాడు రాజు.
వెద్యుడీ సేవకుడు రాగానే రాజు"ఒరే నిన్న నువ్వు అడవిబీర మొక్కను తవ్వినప్పుడు దానికింద దొరికిన వెయ్యి నాణేలను ఏం చేసావు?" అన్నాడు.
సేవకుడు తెల్లబోయి, మాయింట దాచాను, మహారాజా! అన్నాడు.
అవి ఫలానా బ్రాహ్మణుడివి అప్పగించి వెళ్లు, అన్నాడు రాజు.
చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు.
ఇదంతా పరికిస్తున్న మంత్రికి, రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాణ్ణి గుర్తించాడో ఎంత ఆలోచించినా బోదపడలేదు.
రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు.
“మహారాజా, మీరీ దొంగతనం చేసినవాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్ధం కాలేదు. అన్నాడు మంత్రి.
రాజు చిరు నవ్వు నవ్వి ఇలా వివరించాడు.
“దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టటానికి ఆలోచించాను. నగరంలోని ఇన్ని లక్షలమందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి గద! అక్కడ ధనం ఉన్న సంగతి ఏ ఒక్కరికి గాని తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలిసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవిబీర మొక్కతో పని ఉన్నవాడికిమాత్రమే. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా అడవిబీర మొక్క లేదని, ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మముడే చెబుతున్నాడు. అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది.
అదీ గాక, ధనంకోసమే తవ్వినవాడెవడైనా అడవిబీర మొక్కను అక్కడే పారేసి పోతాడు. కానీ అడవిబీర మొక్కకోసం తవ్విన వాడైతేనే మొక్కనూ, దాంతో పాటు ధనాన్నీ కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అయితే అడవిబీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుచేతనే వైద్యులందరిని పిలిపింఛాను . అడవిబీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టం ఏమిటీ మంత్రీ!
ఈ మాటలను విని ప్రసేనజిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు.