చందమామ కథలు-శివయ్య కోరిక
రామాపురంలో శివయ్య, గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్లు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, శివయ్యకు పొరుగింటి నుంచి కమ్మని నేతి గారిల వాసన వచ్చింది. నోట్లో నీళ్లూరుతుండగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి, భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, “నాకు నేతిగారెలు తినాలని ఉంది.” అంటూ సంకటిని దూరంగా నెట్టాడు. 'మనమేమన్న శ్రీమంతులమా ఏమిటి? పూట గడవని మనకు నేతిగారెలు అత్యాశే, అంటూ నొక్కింది గంగమ్మ చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటి తిన్నాడు.
ఆ సంవత్సరం జమీందారు, తన తండ్రి అబ్ధికానికి ఏర్పాట్లు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తి అయిపోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచివచ్చింది. తన భార్యని పెరట్లోకి పిలిచి, “ఏమేవ్! శ్రాద్దానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు. సాయంత్రానికి కొన్నయినా మిగులుతాయి కదా. ఈ రోజుకి నేతిగారెలు తినే యోగం వచ్చిం'దని సంబరపడిపోయాడు.
బ్రాహ్మణుల భోజనం అయిపోయాక, కొన్ని పిండివంటలు, గారెలు,మిగిలిపోయాయి. వాటిని ఏమి చేద్దామని అనుకుంటుండగా, “అయ్యా, శ్రాద్ధ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే, దగ్గర్లోని చెరువులో వదిలేయండి. పితృ దేవతలకు చేరుకుంటాయి, ' అన్నాడు బ్రాహ్మణుడు.
మిగిలిన పిండివంటలు మూటగట్టి, జమీందారు శివయ్యకిచ్చి, “ఒరే మన ఊరి చెరువులో వీటిని విడిచిరారా. మరిచేవు,' అన్నాడు. శివయ్య భారంగా చెరువుకేసి బయలు దేరాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, వాటిని చెరువులో వదిలాడు.
ఇంటికొచ్చిన శివయ్య, “చేతిదాకా వచ్చిన గారెలు నీళ్లపాలయ్యాయి., చెరువులో చేపైనా కాకపోతిని గారెలు తినడానికి అని వాపోయాడు. “మనకి తినే యోగం లేకుంటే ఎంత ప్రయత్నించినా దక్కవు," అంటూ గంగమ్మ ఓదార్చింది.
శివయ్య ఎలాగైనా గారెలు తినాలని నిశ్చయించుకున్నాడు. ప్రతి నెలా కొద్ది కొద్దిగా డబ్బు పోగేయసాగాడు. పండుగ సమీపిస్తుండగా, బజారు నుంచి నెయ్యి, మినప్పప్పు, ఇతర దినుసులు తెద్దామని బయలు దేరాడు.
ఎదురుగా తన బావా, చెల్లెలు రావటం చూశాడు. 'ఈసారి పండగ ఇక్కడే జరుపుకోవడానికి వచ్చాం అన్నయ్యా' అంది చెల్లెలు. వారిని లోపలికి తీసుకెళ్లాడు. గంగమ్మ భర్తని పిలిచి, “ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. బజారుకెళ్ళి పట్రా. గారెలు మరెప్పుడైనా చేసుకుందాం' అంది.
ఈ జన్మకి గారెలు తినే యోగం లేదనుకుంటా, అనుకుని బజారుకు బయలుదేరాడు శివయ్య, సరుకులు కొనుక్కుని ఇంటి దగ్గరకొస్తున్న శివయ్యకి కమ్మని నేతిగారెల వాసన రాసాగింది. ఆశ్చర్యంతో ఇంట్లోకి రాగా, గంగమ్మసంతోషంతో, 'మీ చెల్లెలండీ..వస్తుంటే దారిలో ఆంజనేయస్వామి గుడిలో పెట్టారట. మీకు ఇష్టమని పట్టుకొచ్చింది, అంటూ ముందు పెట్టింది.