చందమామ కథలు-రెండు రహస్యాలు
జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దేశమంతటా పాదయాత్రలు చేస్తూ భగవంతుని సారాంశాన్ని వ్యాపింపచేస్తున్న రోజులవి. అలా ఓ రోజు అటవీ ప్రాంతం గుండా కాశీనగరానికి తన భక్త బృందంతో యాత్రసాగిస్తూ ఉండగా, చీకటిపడే సమయం కావొచ్చింది.
దూరంగా మినుకు మినుకుమంటూ దీపపు కాంతులతో ఓ ఊరు కానరావడంతో ఆ పూటకు అక్కడికి చేరి కాస్త విశ్రమించి మరునాడు పయనం సాగించవచ్చని శంకరాచార్యుల వారు శిష్యులకు ఆనతీయడంతో వారంతా ఊరి వైపు పయనం సాగిం చారు.
ఊరు సమీపించగానే ఆది శంకరాచార్యులవారు విచ్చేస్తున్నారని తెలిసిన జనులు తండోపతండాలుగా చేరి భజనలతో, దీపాలతో, పుష్పాలతో ఎదురేగి వచ్చి వారందరినీ ఊరిలో ఆశ్రమానికి కొనిపోయారు. కావలసిన పాలు పండ్లు భోజభక్ష్యాదులు అమర్చి ఆ రాత్రి వారిని సేవించారు.
మర్నాడు ఊరిలోని ప్రతి గడపను దర్శించారు, ఇంటింటో గోమాత దర్శనమిచ్చింది. ప్రతి ఇంటి వాకిటా తులసి వనాలు దర్శనమిచ్చాయి. పూజా మందిరాలలో వేదాలు వల్లింపబడుతున్నాయి. ఆ ఊరిని చూసేసరికి సమస్త దేవతలూ అక్కడే కొలువుతీరి ఉన్నట్లుగ్గా అనిపించింది.
జనులందరినీ దీవిస్తూ జగద్గురువు తన శిష్యులతో తిరిగి పయనమై అందరివద్దా వీడ్కోలు తీసుకున్నారు.
ఊరికి కాస్త దూరంగా నడిచివచ్చాక శంకరాఛార్యుల వారు కాస్సేపు ఆగి ఆ ఊరి వైపు చూశారు. శిష్యగణం అంతా చూస్తుండగా ఊరిని దీవిస్తూ, 'ఈ ఊరిలో ప్రతి గడపా నలుదిశలా చెదిరిపోవు గాక,' అని ఆశీర్వదించి నడక ప్రారంభించారు. స్వామి నోటి వెంట వచ్చిన ఆ వాక్కు విని శిష్యగణం ఆశ్చర్యపోయింది. జగద్గురువు ఎదుట నోరు మెదిపే ధైర్యం చాలక ఆలోచనలో పడ్డారు.
మరలా దట్టమైన కీకారణ్యం గుండా కాశీనగరం వైపు నడక సాగిస్తుండగా కొద్ది సేపటికి సాయం సమయం అయింది, దూరంగా మళ్లీ కొన్ని దీపపు కాంతులతో మరో ఊరు గోచరించింది. శంకరాచార్యులవారు ఈసారి ఆ ఊరి వైపు నడవమని ఆదేశించగా అంతా అటు పయనించి ఊరు చేరారు.
ఓ రాగి వృక్షం కింద పెద్ద అరుగు కనిపించేసరికి అక్కడ జగద్గురువు తన శిష్యులతో కలిసి ఆసీనులయ్యారు. కాని అక్కడి జనులలో సాత్వికత మచ్చుకైనా కానరావడం లేదు.
ఆదిశంకరాచార్యుల వారే అక్కడ వచ్చి నిలిచినా ఎవరికీ పట్టనట్లుగా చూసిపోతున్నారు. కొందరు జనులైతే మద్యం మత్తులో మునిగి జోగుతూ వీరిని చూసి పరిహాసం చేసి పోతున్నారు. అక్కడ సేవించడానికి మంచినీరు కూడా దొరకలేదు.
సుఖాలలో, మత్తుతో తులతూగుతున్న ఆ ఊరిని చూసి శిష్యగణం కోపంతో ఊగిపోతున్నా వారిని శాంతింపజేస్తూ జగద్గురువు ఆ రాత్రి అక్కడే గడీపి మరునాడు పయనం సాగించారు.
ఊరికి కాస్త దూరంగా వచ్చి శంకరాచార్యుల వారు ఊరి వైపు చూస్తూ ఆగారు. శిష్యులంతా ఊరిని శపించమన్నట్లు కళ్లెర్రజేసి చూస్తున్నారు. కాని స్వామి వారు ఆ ఊరిని దీవిస్తూ, “ఈ ఊరు కలకాలం ఇచ్చోటనే ఐకమత్యంతో కలిసి ఉండుగాక, ' అని దీవించి ముందుగు సాగారు.
శిష్యగణం మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆతిథ్యం దొరికిన చోటుని చెదిరిపొమ్మన్నారు. అవమానం జరిగిన చోట అందరినీ కలిసి ఉండమని దీవించారు. స్వామి ఆంతర్యం ఏమై ఉంటుంది? శిష్యులను తొలిచి వేస్తున్న సందేహాన్ని గమనించిన జగద్గురువు వారితో “మీరంతా నా దీవెనలలో అంతరార్థం తెలియక సతమతమవుతున్నారు కదూ,' అని అడిగ్లారు.
అప్పుడు అందరూ ముక్షకంఠంతో 'అవును స్వామీ,, దయచేసి వాటి అంతరార్థం తెలియజేసి మా సందేహాన్ని నివృత్తి చేయగలరు', అంటూ ప్రాధేయపడ్డారు.
శంకరాచార్యులవారు ఆ అడవిలో ఓ చల్లని వృక్షం కింద అందరినీ కూర్చుండ బెట్టి తానూ ఆశీనులై వివరిస్తూ, 'నాయనలారా, మనకు ఆతిథ్యం లభించిన మొదటి ఊరు అణువణువు భక్తి పారవశ్యంతో నిండి ప్రతి మనిషీ పావనుడై ఉన్సాడు. వారంతా వేదాలు, పురాణాలు అవపోసన పట్టిన మహాజ్ఞానులు. ఇటువంటి ఊరును చెదిరిపోవుగాక అంటే నా మనోభీష్టం అది కాదు. వారంతా నలువైపులా వ్యాప్తి చెందితే వారు ఏ మూల చేరినా అక్కడ భక్తి, సంస్కృతి విరాజిల్లుతుందని అర్ధం. వారు పాదాలు మోపిన ప్రతిచోట ఎంతో ఆదర్శవంతమైన సమాజం వేళ్లూనుకుంటుంది. అలా వారు ఇక్కడే ఉండిపోతే సామాన్యులు జ్ఞానులయ్యేదెలా.. అందుకే వారిని నలుదిశలా విస్తరించేలా ఆశీర్వదించాను.
మనకు అవమానం జరిగిన రెండవ ఊరుని కలిసి ఉండమని ఎందుకు దీవించానంటే ఈ ఊరిలో ప్రతి వ్యక్తీ తమోగుణంతో పెరిగి ఉన్నారు. మద్యపాన సేవనంతో మానవీయతను మరిచిపోయి నడుచుకుంటున్నారు. ఆ జనం ఏ చోటుకు చేరినా అఆ ప్రభావం మిగతా సమాజంపై పడి భ్రస్టుపడుతుంది. అందుకే వారిని అక్కడే కలిసి ఉండమంటూ.. పునరపి మరణం పునరపి జననంతో చివరికి ఆ జీవన వైవిధ్యమే ఓ నరకప్రాయమని తెలుసుకునేలా దీవించాను, ఈ రహస్యం సామాన్యులకి అంతుపట్టనిది. అర్ధమయిందా... నాయనా....ఇక పదండి' అంటూ జగద్గురువు ముందుకు సాగారు.
తమ సందేహాలను నివృత్తి గావించుకున్న శిష్యులందరి మొహాల్లో వెలుగునిండుకుంది. తన సంకల్చబలంతో ఈ నేలను పునీతం చేసిన ఆదిశంకరులు భగవంతుడు కాక ఇంకెవరు అనుకుంటూ భక్తి పారవశ్యంతో కాశీక్షేత్రం వైపు పాదయాత్ర కొనసాగించారు.