Evolution of Indian Constitution-1

TSStudies

భారత రాజ్యాంగం - పరిణామ క్రమం (Evolution of Indian Constitution)

రాజ్యాంగం - అర్ధం
రాజ్యాంగం అనేది ప్రజాస్వామిక ధేశాల్లో, సర్వోన్నత శాసనం మరియు మౌలిక చట్టం. అందుకే రాజ్యాంగాన్ని “Basic Law” లేదా "Fundamental Law” అంటారు. దేశంలోని పరిపాలనా వ్యవస్థలు, వాటి అధికారాలు, విధులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరుస్తారు.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం రాజ్యాంగ పాలన. రాజ్యాంగ భావనను శాస్త్రీయంగా వివరించిన మొదటి తత్వవేత్త “అరిస్టాటిల్"‌. రాజ్యాంగ పాలన క్రింద ప్రజలు కొనసాగడం చైతన్యానికి ప్రతీకే తప్ప నియంత్రణకు, బానిసత్వానికి సంకేతం కాదని పేర్కొన్నాడు. రాజ్యాంగంలో వివిధ ప్రభుత్వ అంగాల నిర్మాణం, వాటి అధికార పరిదులు మరియు వాటి మధ్య గల సంబంధం; ప్రజల హక్షులు, వాటి పరిరక్షణ మరియు పరిపాలనా స్వభావం నిర్దిష్టమైన రూపంలో క్రోడీకరించబడి ఉంటాయి. దేశంలో అన్ని చట్టాలకు రాజ్యాంగమే మూలాధారం.
భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్హ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, ఉద్యమాలు, సంస్కరణలు దోహదం చేసాయి. కనుక రాజ్యాంగ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను సమగ్రంగా తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ పరిణామక్రమాన్ని క్రింది విధంగా పరిశీలించవచ్చు.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన (1773 - 1857)
ఈ దశలో భారత దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపార మరియు ఇతర వ్యవహారాలను నిర్వహించింది. దీనిని నియంత్రించడానికి బ్రిటిష్‌ పార్లమెంటు కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే చార్టర్ చట్టాలు అంటారు.

రెగ్యులేటింగ్‌ చట్టం - 1773
రెగ్యులేటింగ్‌ చట్టానికి రాజ్యాంగ వికాసపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంగ్లాండ్‌ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్‌ పార్లమెంట్‌ చేసిన మొట్టమొదటి చట్టం.
అందుకే దీనిని భారతదేశానికి సంబంధించి “మొట్టమొదటి లిఖిత చట్టం (First Written Charter)" గా పేర్కొంటారు.
అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ
పరిపాలన, అధికారాలు సంక్రమించడం జరిగింది. దీనితో భారతదేశంలో “కేంద్రీకృత పాలన”కు పునాదులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

ముఖ్యాంశాలు
ఈ చట్టాన్ని మే, 18, 1773లో అప్పటి ప్రధాని లార్డ్‌ నార్త్‌ బ్రిటిష్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు. కంపెనీ వ్యవహారాలను
నియంత్రించడానికి ఉద్దేశింపబడినందున దీనిని రెగ్యులేటింగ్‌ చట్టం అంటారు.
బెంగాల్‌ గవర్నర్‌ యొక్క హోదాను “గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌"గా మార్చి ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఆ విధంగా మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌గా నియమించబడినది వారన్‌ హేస్టింగ్స్‌.
బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లను బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌కు ఆధీనులుగా చేయడం జరిగింది.
కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి-ఎలిజా ఇంఫే
ఈస్ట్‌ ఇండియా కంపెనీపై బ్రిటీషు ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి, తమ రెవెన్యూ, పౌర మరియు సైనిక వ్యవహారాలలో కంపెనీ కోర్ట్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌ నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు.
కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను నిషేధించారు. వారు ప్రజల నుంచి లంచాలను, బహుమతులను స్వీకరించకుండా కట్టడి చేశారు.
20 సం॥ వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు. అయితే, ఈ చట్టం ద్వారా ఆశించిన నియంత్రణ, కేంద్రీకృత పాలన నిరోధం అధికార సమతుల్యతలు నెరవేరలేదు. అలాగే, గవర్నర్‌ జనరల్‌ యొక్క కార్యనిర్వాహక పరిధిపై స్పష్టత ఏర్పడలేదు.