బాల భారతం-పాము మనిషి
ఆగు నన్ను కొట్టవద్దు ఆ అధికారం నీకు లేదు అన్న మాటలు వినపడ్డాయి. ఒకింత ఆశ్చర్యపోయి ఎత్తిన కర్రను దించి చూసాను. రెండు గజాల దూరంలో నేను కొట్టబోయిన పాము నన్ను ప్రశ్నిస్తుంది. ఇదివరకు నేను పాములని చంపాను. ఊళ్లో ఎవరింట్లోకి పాము వచ్చినా నన్నే పిలుస్తారు. ఎంతటి పాము అయినా నా ముందు బలాదూరే! అలాంటిది నా పెరట్లో కనిపించిన పామే ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తోంది.
“నువ్వు విష జంతువ్వి నా ఊళ్లో తిరుగాడే నీలాంటి ప్రాణులని చంపే అధికారం నాకుంది" అన్నాను.
నా మాటలకి పాము నవ్వి “పిచ్చివాడా ఈ ప్రపంచం నీ ఒక్కడిదే కాదు. సృష్టిలో అన్ని జీవరాశులకీ బతికే హక్కు ఉంది. ఆకలైనప్పుడు ఒక జంతువు ఇంకొక జంతువును తినే ఏర్పాటు వలన, సృష్టి తాలూకు జీవన చక్రం సమతుల్యంగా ఉంటోంది” అంది.
నేను కొంత సంశయించినా దాని మాటలతో ఏకీభవించక తప్పలేదు. అది ఇంకా ఇలా అంది “మేం ఆకలైనప్పుడు మాత్రమే వేరే జీవాల్ని తింటాం, ప్రాణరక్షణ కోసమే కాటు వేస్తాం. మరి మీరో! అవసరం ఉన్నా లేకున్నా అత్యాశతోనూ, అహంకారంతోనూ విచక్షణారహితంగా ఇతర ప్రాణులకు హాని తలపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా మేం మీకు సహాయం చేస్తున్నాం” అంది.
పాములు మనకు సహాయం చెయ్యడమేమిటి? కాటు వెయ్యడమేగా వాటి పని! - నా ఆలోచన లను పసిగట్టిన పాము, ఇలా అంది.
మీ పంటలను పాడుచేసే “ఎలుకలను, పందికొక్కులను మేము తింటున్నాం, మీ ఆరోగ్యం కోసం జరిపే పరిశోధనలకి మా విషాన్ని అందిస్తున్నాం. ఆఖరికి మా చర్మంతో కూడా మీరు అలంకరణ వస్తువులు తయారు చేసుకుంటున్నారు,”
“అందుకే మేము నిన్ను దేవునిలా భావించి, నీ పుట్టలో పాలు పోస్తున్నాం కదా!” అన్నాను ఆరిందలా.
“కోరికలు నెరవేరతాయన్న నమ్మకంతో మీరు పాలు పోస్తున్నారు. నిజానికి దాహమేస్తే మాకు పాలైనా, నీళ్ళైనా ఒకటే! అంతేకాక పసుపు, కుంకుమ, కర్పూరం, సాంబ్రాణి వంటి ఘాటైన వాసనలతో మమ్మల్ని ఆ ఛాయల్లోకి రాకుండా చేస్తున్నారు.” అంది బాధగా.
నా ప్రతి ప్రశ్నకీ పాము దీటైన జవాబు చెబుతోంది. ఇంక ఏం మాట్లాడాలో నాకు పాలు పోలేదు, చివరికి “మీ జాతి మమ్మల్ని మా పశువుల్ని నిష్కారణంగా కాటు వేయడం లేదా? అది పాపం కాదా? "అని అడిగాను.
అందుకు పాము అంది కదా “మేం ఎవరి జోలికీ పోం. వాసన
గ్రహించే శక్తి వల్ల, భూప్రక పనాల ద్వారా ప్రాణుల ఉనికిని. కనుగొనే సామర్థ్యం ఉండటం వల్లా. మా జాగ్రత్తలో దూరంగా ఉంటాం. ఆహారాన్వేషణలో భాగంగా తిరుగుతున్న మమ్మల్ని మీరు తొక్కినప్పుడు ముందుగా బుస కొట్టి తరువాత కాటు వేస్తాం. దానివల్ల మీకు పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే మాలో చాలా జాతి పాములకి అసలు విషమే ఉండదు. ఒక వేళ ఉన్నా మీ వైద్య శాస్త్రంలో వాటికి విరుగుడు ఉండనే ఉంది.” పాము మాటలనివిన్న తర్వాత నాకు ఎప్పుడూ రాని కొత్త అలోచన ఒకటి వచ్చింది.
పాముని ఇలాగే వదిలి వేస్తే దాన్ని ఎవరో ఒకరు చంపేస్తారు. అందుకని ఒక ఖాళీ జనపనార గోతాన్ని తెచ్చి పాము అందులోకి వెళ్లేట్టుగా చప్పుడు చేశాను. పాము అందులోకి వెళ్లిన తర్వాత గోతాం మూతిని బిగించి ఊరి
చివరన ఉన్న అడవిలోకి వదిలేశాను. అది జరజరా పాక్కుంటూ వెళ్లిపోతుండగా నాలో ఓ అనుమానం బయల్టేరింది
“నువ్వు నామీద పగబట్టి తిరిగి రావు కదా!” అని అడిగాను.
దానికి ఆ పాము వెనక్కి తిరిగి “వెర్రివాడ్డో! మీరు ఈ కాలంలో కూడా మూఢ నమ్మకాలతో బతుకుతున్నారు. పాములు మనుషుల్లాగా దుర్మార్గమైనవి కావు. వాటికి పగ పెంచుకునేంత, జ్ఞాపకశక్తి కూడా లేదు. ఒకే చోటకి కాకతాళీయంగా రెండు పాములు వస్తే అది పగని మీరు భ్రమిస్తున్నారు. ”; అని, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.