బాల భారతం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
వాల్మీకి మహాముని ఆశ్రమంలో జన్మించిన కవల సోదరులు కుశలవులిద్దరూ అన్ని రంగాలలో ఆరితేరుతూ చక్కగా పెరుగుతున్నారు.
విద్యతో పాటు విలువిద్యలోనూ, ఆటపాటల్లోనూ, గుర్రపు స్వారీలోనూ తమకెవరూ సాటిలేరన్నట్టు తయారయ్యారు.
ఒక రోజు వారి పుట్టినరోజు, తాతయ్య ఆశీర్వచనాన్ని కోరుతూ వాల్మీకి మునికి పాదాభివందనం చేసి దీవించమన్నారు. వారిని ఆశీర్వదిస్తూనే వాల్మీకి ముని అన్నదమ్ములిద్దరికీ, పూలకుండీల్లో ఉన్న చెరో మొక్కని కానుకగా ఇస్తూ... “ఇవి సిరిమల్లె మొక్కలు.. వీటిని జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచండి.. నేడో రేపో మొగ్గ తొడగబోతున్నాయి” అని చెప్పాడు.
కుశలవులు ఆనందంగా ఆ మొక్కలని అమ్మకి చూపించి సరదాగా ఒక పోటీ పెట్టుకున్నారు. 'ఎవరి మొక్క ముందుగా మొగ్గ తొడిగితే వారు విజేతలన్నది' ఆ పోటీ.
ఆ రోజు పున్నమి రాత్రి. పడుకున్నారు గానీ అన్నదమ్ములు ఇద్దరికీ నిద్ర పట్టడం లేదు. ఎవరి మొక్క ముందుగా మొగ్గ తొడుగుతుందో అన్న ఆతృత. ముందుగా కుశుడు అర్ధరాత్రి వేళ లేచి అటూ ఇటూ చూసి కుండీల దగ్గరికి వెళ్లాడు. ఆశ్చర్యం... ఎర్ర రంగు పూలకుండీలోని తన మొక్కకి తెల్లగా మెరుస్తూ... మల్లె మొగ్గ కనబడింది. కుశుడికి సంతోషంతో ఎగిరి గంతేయాలి అనిపించింది.
అంతలోనే తమ్ముడి ముఖం గుర్తొచ్చింది. అది చిన్నబోతే తను చూడలేడు. ఎలాగైనా తమ్ముడే గెలవాలి అనుకొని... జాగ్రత్తగా...కుండీల్లోని మొక్కలని మట్టితో సహా మార్చేసి తనకేం తెలీనట్టు వచ్చి పడుకున్నాడు. మరికొంత సేపటికి లవుడు లేచాడు... అన్న లాగానే తాను కూడా మొక్కలని మార్చేసి... అన్నయ్యే... గెలవాలి అనుకుంటూ వచ్చి పడుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం తెల్లవారింది. అన్నదమ్ములిద్దరూ నిద్రలేచి తల్లి దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేసి... “అమ్మా! నిన్నటి పోటీలో ఎవరు గెలిచారో చూద్దాం.. రా” అంటూ తల్లిని తోడ్కొని మొక్కల దగ్గరికి వచ్చారు. అన్నే గెలుస్తాడని తమ్ముడు, తమ్ముడే గెలుస్తాడని అన్న, ధీమాగా ఉన్నారు. దానికి తోడు సోదరుడి కోసం త్యాగం చేసానన్న తృప్తి ఇద్దరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తీరా మొక్కల దగ్గరికొచ్చి చూసేసరికి ఆశ్చర్యం... రెండు కుండీలలో మొక్కలకీ తెల్లగా మెరుస్తూ... నవ్వుతూ ఉన్నట్లున్న మల్లెమొగ్గలు. వాటిని చూడగానె... అన్నదమ్ములిద్దరూ ఆనందంతో కేరింతలు కొట్టారు.
తామిరువురూ అన్నింటా సమానమే అంటూ ఒకరినొకరు అభినందించుకున్నారు. అన్న కోసం తాను త్యాగం చేశాను కనుకనే దేవుడు మెచ్చుకొని తన మొక్కకీ మొగ్గని పూయించాడు అనుకున్నాడు లవుడు. తమ్ముడి కోసం తను చేసిన త్యాగ ఫలితమే తన విజయం అనుకున్నాడు కుశుడు. అన్నదమ్ములిద్దరి ముఖాలలో ఆనందాన్ని చూస్తూ... తానూ మురిసిపోయింది సీతమ్మ. రెండో కుండీలో మొక్కని తానే మార్చానని.. పిల్లలిద్దరిలో ఎవ్వరు ఓడిపోయి బాధపడినా తను సహించలేదన్న సంగతి సీత వాళ్లకి చెప్పనేలేదు.
అంతవరకూ రాత్రంతా వెలిగి వెలిగి... ఇంటికెళ్లిపోతున్న చందమామ... 'అన్న గెలవాలని తమ్ముడూ... తమ్ముడు గెలవాలని అన్నా... ఇద్దరూ గెలవాలని తల్లీ పడ్డ ఆరాటమంతా... నింగిలోంచి తొంగి తొంగి చూస్తూనే వున్నాను సితమ్మ వాకిట్లో సిరిమల్లె మొక్క.. పూసింది... మల్లెపూలు కాదు.. ప్రేమ పూలని
విరబూసింది. మనుషుల మధ్య ఇలాంటి ప్రేమ పూలే ఇంటింటా విరబూయాలి' అనుకుంటూ ఆనందంగా పరుగు పెట్టాడు.