బాల భారతం-అపకారికి ఉపకారం
శివపురంలో నివసించే సుమంతుడు పేరొందిన ఆయుర్వేద వైద్యుడు. సుమంతుని పేరు ప్రఖ్యాతులు చూసి అతని పొరుగువాడైన దివాకరుడు ఓర్వలేక పోయేవాడు. సుమంతుని దగ్గరున్న వైద్య గ్రంథాలను నాశనం చేస్తే అతను వైద్యం చేయలేక ప్రజల్లో పేరు పోగొట్టుకుంటాడని భావించి సమయం కోసం ఎదురు చూడసాగాడు.
ఒకసారి సుమంతుడు కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లాడు. అతను తిరిగొచ్చేసరికి తన పర్జశాలలో జాగ్రత్త చేసిన గ్రంథాలతోపాటు, పర్ణశాల కూడా కాలిపోయి ఉంది. వైద్యగ్రంథాలు కాలిపోవడంతో సుమంతుడు ఎంతగానో విచారించాడు. కొన్ని నెలలు గడిచిపోయాయి.
ఒకరోజున దివాకరుని కుమారునికి హఠాత్తుగా ఒంట్లో బాగు లేకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. సృహ తప్పిన కుమారుడిని తీసుకుని సుమంతుని దగ్గరికి వెళ్లాడు. సుమంతుడు దివాకరుని కుమారునికి వైద్వం చేసి బతికించాడు.
దివాకరుడు సుమంతునికి నమస్కరించి “నువ్వు నన్ను క్షమించాలి. నీకొచ్చే 'పేరు-ప్రఖ్యాతుల్ని చూసి ఓర్వలేక నీ పర్ణశాలకు నిప్పు పెట్టి వైద్య గ్రంథాలన్నింటినీ నాశనం చేశాను. కానీ ఈ రోజున నువ్వు నా కొడుకుని రక్షించావు" అన్నాడు. సుమంతుడు
చిరునవ్వుతో “నువ్వు వైద్య గ్రంథాలనైతే తగులబెట్టావు కానీ నా జ్ఞానాన్ని తగులబెట్టలేదు కదా! నువ్వే నా పర్ణశాలకు నిప్పు పెట్టి ఉంటావని నేనేనాడో ఊహించాను. రోగిని కాపాడటం వైద్యునిగా నా బాధ్యత” అన్నాడు.
“అపకారికి కూడా ఉపకారం చేసే నీవంటి మంచి మనిషికి ఎంతో ద్రోహం చేశాను. నా పొరపాటుకి ప్రాయశ్చిత్తం లేదు” అని కుమిలిపోయాడు దివాకరుడు.
అప్పుడు సుమంతుడు “నీ తప్పును తెలుసుకున్నావు, ఇకనుంచైనా అందరితొ ప్రేమగా ఉండు” అని చెప్పాడు.
దివాకరుడు “నీలాంటి గొప్ప వ్యక్తి మా గ్రామంలో ఉండటం నిజంగా మా అద్నష్షం” అంటూ కొడుకుని తీసుకుని బయల్టేరాడు.