బాల భారతం-గురుదేవోభవ
అదొక ప్రాచీన గురుకులం. శివానందుడు శిష్యులను తీర్చిదిద్దడంలో మేటి అని పేరుగాంచిన గురువు. ఒకరోజు శివానందుడు శిష్యులకు వేదపాఠాలను బోధిస్తుండగా సమీపంలోనే కూర్చొని అతడి భార్య కాత్యాయిని పెరుగు చిలుకుతూ తనూ శ్రద్ధగా వింటోంది.
పాఠాలు పూర్తయ్యాక ముందు రోజు చెప్పిన శ్లోకాలను అప్పజెప్పమన్నారు గురువుగారు. ముందుగా రామానందుడు శ్లోకాన్ని మొదలు పెట్టి తడబడుతూ మధ్యలో ఆగిపోయాడు.
శివానందుడు కోపగించుకుంటూ నీకు ఈ మధ్యనకీ ఏకాగ్రత తప్పుతోంది. చదువు మీద శ్రద్ధ పెడుతున్నట్లు కనిపించడం లేదు. మందబుద్ధిని వదిలి శ్రద్ధగా చదువుకో అని మందలించాడు.
ఈ తరువాత పద్మపాదుడి వంతు వచ్చింది. అతనూ తడబడి మధ్యలోనే ఆగిపోయాడు. ఈ సారి మాత్రం శివానందుడు చిరునవ్వు నవ్వుతూ “ఒక్కసారి కళ్లు మూసుకుని మొత్తం శ్లోకం గుర్తు తెచ్చుకో... నువ్వు తప్పకుండా చెప్పగలవు” అన్నాడు శాంతంగా. పద్మపాదుడు కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని మనసులోనే శ్లోకాన్ని మననం చేసుకొని తడబడకుండా అప్పజె ప్పేశాడు.
ఆ పూట పాఠాలు పూర్తయ్యాక, శిష్యులందరినీ భోజనానికి పంపించారు. తనూ కాత్యాయినిని పిలిచి కాళ్లు కడుగుకునేందుకు నీళ్లిమ్మన్నాడు. శివానందుడికి నీళ్లందిస్తూనే కాత్యాయిని తన మనసులో మెదులుతోన్న సందేహాన్ని ఆయన ముందుంచింది.
“మీరు శ్లోకం అప్పజెప్పలేక పోయినందుకు రామానందుడిని మందలించారు, అదే పద్మపాదుడిని మాత్రం ఏమనలేదు... చూస్తుంటే మీకు పద్మపాదుడి పట్ల పక్షపాతం ఉందేమోననిపిస్తుంది. చదువు చెప్పే గురువులకిది తగదు కదా” అని ప్రశ్నించింది. శివానందుడు చిరునవ్వు నవ్వి ఆమె చేతికి కొంచెం తడి మట్టిని తీసి ఇస్తూ “దీనిని ఒక ఆకులో వేసి ఎండలో పెట్టు. అలానే ఇప్పటి వరకూ మజ్జిగ చిలికావుగా అందులోంచి కొంచెం వెన్న తీసి మరో ఆకులో పెట్టి ఎండలో ఉంచు” అని చెప్పాడు. తనకి అర్ధం కాకపోయినా శివానందుడు చెప్పినట్టే చేసి అతడికి భోజనం వడ్డించింది.
భోజనం చేయడం పూర్తయ్యాక, శివానందుడు కాత్యాయినితో అంతకుముందు ఎండలో ఉంచిన రెండు ఆకులనూ తీసుకు రమ్మన్నాడు. తెచ్చాక వాటిని చూపిస్తూ “చూశావా ఈ రెండూ ఎండలో పెడితే మన్ను మరింత గట్టిపడింది, వెన్న మాత్రం కరిగిపోయింది... అదే సూర్యుడు... అదే ఎండ... కానీ తడిమట్టిని గట్టిగానూ, వెన్నను ద్రవంగానూ మార్చాడు... పదార్థాల స్వభావాన్ని బట్టి సూర్యుడు కూడా తన ధర్మాన్ని మార్చుకుంటున్నాడు.
గురువు అనేవాడు కూడా అలాగే ఉండాలి. శిష్యుల స్వభావాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా తన శిక్షంని మార్చుకోవాలి. సున్నిత మనస్కుడైన పద్మపాదుడిని మందలిస్తే మందలిస్తేనే గానీ తన బద్ధకాన్ని వదలడు. అందుచేతనే నేను అలా చేశాను తప్ప నా శిష్యులందరూ నాకు సమానులే” అంటూ అసలు విషయాన్ని కాత్యాయినికి వివరించాడు శివానందుడు. మిమ్మల్ని గొప్ప గురువని కొనియాడటానికి కారణం నాకు అర్థమయ్యింది అనుకుంటూ మనసులోనే 'గురుదేవోభవ' అనుకుంది