బాల భారతం-దొంగల్లో దొర
ఆర్యాపురంలో నివసించే రంగాకీ మహా బద్ధకం. ఏపనిలో పెట్టినా మూడోరోజే ఏదో వంకతో మానేసి ఖాళీగా తిరిగేవాడు. అది చూసి వాళ్ల అమ్మానాన్నా చాలా బాధపడేవారు.
ఒకసారి రంగా తండ్రి అతణ్ని ఓ బట్టల దుకాణంలో పనికి పెట్టాడు. కొన్నాళ్లకి ఎప్పటిలాగే రంగాకి పని మీద విసుగుపుట్టింది. నాలుగోరోజు పనివాళ్ళందరూ దుకాణం యజమానిచ్చిన వస్త్రాలు ధరించి పనిలో నిమగ్నమై ఉండగా రంగా వారి దుస్తులున్న గదిలోకి వెళ్ళి చొక్కాలు వెదికాడు. ఒకరి జేబులో వరహాలు కన్పించాయి. అందులోంచి కొన్ని వరహాలు తీసుకొని యజమానితో కడుపులో నొప్పని చెప్పి బయటపడ్డాడు.
అది మొదలు రోజూ ఏదో ఒక దొంగతనం చేసేవాడు. రోజంతా కష్టపడీ ఐదో, పదో సంపాదించేకంటే ఇదే బాగున్నట్లు అనిపించింది. అలా ఒకసారి పొరుగూర్లో దొంగతనానికి వెళ్ళి అక్కడ సత్రంలో తీసుకుంటుండగా కొందరి మాటలు వినిపించాయ్యి..
ఆ మాట్లాడుతోంది ముగ్గురు దొంగలు. వాళ్లు ఆ రాత్రి పక్క ఊరి జమీందారు ఇంట్లో దొంగతనానికి పథకం వేస్తున్నారు. అది విని రంగాకి ఆశ పుట్టింది. వాళ్లను కలిసి తనను కూడా వారితో కలుపుకోమన్నాడు. వాళ్లు సరేనన్నారు.
వారంతా అర్ధరాత్రి దాటాక జమీందారు భవనం వైపు నడిచారు. ఆ ముగ్గురు దొంగల్లో ఒకడు బల్లిలా గోడ మీద పాకి లోపలికి వెళ్ళి వీధి తలుపులు తెరిచాడు. రెండో దొంగ ఎలాంటి తాళాన్ని అయినా మారు తాళాల్తో తెరవగలడు. అలా ఇనుప బీరువాను, పెద్దపెద్ద పెట్టెలను సునాయసంగా తెరిచాడు ఆ దొంగ. ఇక మూడో దొంగ ఎంత బరువైనా ఎత్తుకుని ఆగకుండా పది మైళ్ళ దూరం వరకూ పరిగెత్తగలడు.
రంగా పని మాత్రం ఇంటిలోని మనుషులు లేచినట్లు అనిపిస్తే పిల్లిలా శబ్దం చేసి, మిగతా వాళ్లని హెచ్చరించాలని ముందే ఆలోచన చేశారు.
వాళ్లు చూసిన వాటిలో విలువైన నగలూ, ఆభరణాలూ గబగబా సంచుల్లోకి ఎత్తి మూట కట్టుకున్నాడు మూడో దొంగ. అంతలో ఏదో శబ్దం అయితే రంగా పిల్లిలా అరిచి వారిని జాగ్రత్త పడేలా చేసి తను కూడా బయటికి పరుగెత్తాడు.
అయితే రంగా పరిగెడుతుండగా ఒక గోతిలో పడి కాలూ చెయ్య విరగ్గొట్టుకున్నాడు. తెల్లవార్లూ బాధతో అరుస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అతనికి అమ్మానాన్నా గుర్తుకొచ్చారు. వాళ్లు చెప్పినట్టు విని చక్కగా కష్టపడి పని చేసుకుంటే తనకు ఇప్పుడు ఈ అవస్థ తప్పేది కదా అనిపించింది. ఉదయాన్నే ఆ దారిలో వెళ్తున్న బాటసారి ఒకడు రంగా మూలుగు విని అతన్ని బయటకు లాగాడు.
ఆ రాత్రి జరిగిన దానికి రంగాలో పశ్చాత్తాపం మొదలైంది. ఇకపై దొంగతనాలు చేయకూడదని ... నిశ్చయించుకున్నాడు. అంతే కాకుండా తన తోటి దొంగలను కూడా మార్చాలనుకున్నాడు!
తనకు నయం అయ్యాక మొదటిసారి ఆ దొంగలను కలిసిన సత్రానికి చేరుకుని వాళ్ల కోసం ఎదురు చూశాడు. అలా రెండు మూడు రోజులు చూసినా దొంగలు రాలేదు. రంగాకి వాళ్లను కనుక్కోవడం ఎలాగో అర్ధం కాలేదు.
ఇంతలో అతడికి ఒక చాటింపు వినపడింది. రాజుగారి ఖజానాని దొంగలు కొల్లగొట్టారనీ, దొంగల ఆచూకీ తెలిపిన వారికి ఘనమైన బహుమతి ఇస్తామన్నది ఆ చాటింపు సారాంశం.
తనని మోసం చేసిన దొంగలే ఈ దొంగతనం కూడా చేశారేమోనన్న అనుమానం రంగాకి కలిగింది. వెంటనే రాజధానికి బయలుదేరాడు. అక్కడి రాజభటులు చెప్పిందేమిటంటే 'వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. తలుపులు విరగ్గొట్టిన దాఖలాలు లేవు. కానీ ఇనుప బీరువాల్లో, నేల మాళిగల్లో దాచిన సంపదను ఏమాత్రం వదలకుండా దోచుకుపోయారు' అన్నారు.
వెంటనే అతడికి ఈ దొంగతనం చేసింది ఆ ముగ్గురే అని తెలిసిపోయింది. ఆ మాటే రాజభటులతో చెప్పాడు రంగా. వాళ్లు రంగాని నేరుగా మంత్రి దగ్గరకు తీసుకెళ్ళారు. రంగా తన గురించి నిజం చెప్పేశాడు. ఈ దొంగతనం ఎవరు చేసి ఉంటారో కూడా మంత్రికి చెప్పాడు.
మంత్రి అతడిని సరాసరి మహారాజు దగ్గరకు తీసుకెళ్ళాడు. మహారాజు రంగాని చూసి 'ఇతడే ఒక దొంగ అయి ఉండి మరో దొంగ గురించి చెబుతుంటే ఎలా నమ్ముతున్నారు మంత్రి గారూ?" అని ప్రశ్నించాడు.
దానికీ మంత్రి “మహారాజా! ఇతను మొదట పని దొంగనని, తర్వాత దొంగగా మారానని నిజాయితీగా అంగీకరించిన తర్వాతే వారి గురించి తెలిపాడు. తన తప్పు తెలుసుకున్నాడు కనుకనే మనకు సాయపడేందుకు వచ్చాడు. ఇతని సలహా, సహకారం వల్ల మనం దొంగలను పట్టుకోగలిగితే మంచిదే కదా!' అని నచ్చచెప్పాడు.
మహారాజు అంగీకరించాడు. ఆ మరుసటి మాసంలో రాజుగారి పుట్టిన రోజు. ఆ సందర్భంగా కొత్త తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఆ పోటీలు ఏమిటంటే వంద కిలోల బరువున్న బస్తాను భుజాలపై వేసుకొని పదిమైళ్ళు పరిగెట్టగలిగిన వారికి లక్ష వరహాలు బహుమతి ఇస్తారు. ఈ విషయం రాజ్యం నలుమూలలా చాటింపు వేశారు. అలా ఆ దొంగ కూడా పోటీకి వస్తాడనీ, రంగా అతడిని చూపిస్తే బంధిద్దామన్నది వాళ్ల ప్రణాళిక
అనుకున్నట్టుగానే ఆ దొంగ పోటీల్లో పాల్గొన్నాడు. అతడిని గుర్తు పట్టిన రంగా సైనికులకు సమాచారం అందించాడు. వెంటనే ఆ దొంగని బంధించారు. ఆతని ద్వారా మిగతా ఇద్దరి గురించి కూడా తెలుసుకుని దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
మహారాజు రంగాని సభలో ప్రత్యేకంగా ప్రశంసించడమే కాకుండా బహుమతినీ ఇచ్చాడు. రంగడు తన తప్పును ఒప్పుకున్నందున, క్షమించి కొలువులో ఉద్యోగమూ ఇచ్చాడు. అప్పటి నుంచి రంగా కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.