బాల భారతం-వింత టోపీ
సర్పగంధుడనే రాజు ఏటా తన పుట్టినరోజున కళాకారులను సన్మానించేవాడు. ఒకసారి మాత్రం ఎప్పటిలాకాక వింతైన పోటీలు నిర్వహించాలనే కోరిక కలిగింది. అందులో గెలుపొందిన వారికి భారీగా పారితోషికంతో పాటు, సన్మానం కూడా ఉంటుందని చెప్పి చాటింపు వేయించాడు. అయితే అందులో పాల్గొనేవారు తెచ్చే వస్తువులు వింతగొలి పేవిగా ఉండాలన్న షరతు విధించాడు.
ఆ చాటింపు విన్న చాలా మంది కళాకారులు అనేక దేశాల నుంచి తమ తమ వింత వస్తువులనును ప్రదర్శించాలని ముందుకొచ్చారు. ఈ పోటీని చూడటానికి ఎందరో రాజులు వచ్చారు. ముందుగా సువర్ణ దేశం నుంచి సురుచిరుడనే యువకుడు తన దగ్గర ఒక వింత పుష్పం ఉందని చూపించాడు. అతను చూపించిన పువ్వును చూసి అక్కడున్న మిగతా రాజులంతా నవ్వారు.
“ఇది కేవలం వానరాకను తెలిపేందుకే వికసిస్తుంది. వర్ష సూచనకు నిదర్శనంగా పసుపు రంగులోకి మారుతుంది. ఎండగా ఉన్నప్పుడు ఎర్రగా, మబ్బుగా ఉంటే నీలంగా ఉంటుంది.” అనగానే మంత్రి సుకుమారుడు “నువ్వన్నది నిజం కాదు. బయట ఎర్రటి ఎండ కాయడం నేను చూసొచ్చాను. మరి ఇంతదాకా ఎర్రగా ఉన్న పువ్వు నీలంగా ఎలా మారింది?” అన్నాడు.
“నేను తెచ్చిన పుష్పంలో ఏమాత్రం తేడా ఉన్నా సరే నేను మీరు విధించే శిక్షకు తలొగ్గుతాను. బయటికెళ్లి చూడండి. మబ్బు వేసి ఉంటుంది.” అనగానే మంత్రి వెళ్లి చూసొచ్చి, “శభాష్! భలే వింతగా ఉంది.” అనేసి అభినందించాడు.
తరువాత వచ్చిన అభ్యర్థి సుశాంతుడు “నేను హిమాలయ ప్రాంతాల్లో తిరుగాడే రాజహంసను తీసుకొచ్చాను. దీని ప్రత్యేకతల్లా పాలు, నీళ్లను వేరు చేయగలగడం. మీరు పాలలో ఎంత నీటిని కలిపినా సరే అది చిటికెలో వేరుచేయగలదు. ” అనగానే సభలోనున్న ఒక రాజు ముందుకొచ్చి, నీళ్లను కలిపిన పాలను తెప్పించి రాజహంస ముందు పెట్టించాడు. అది పాలలోంచి నీటిని పీల్చి బయటకు వొంపింది.
తదుపరి అంశంగా ఒక కోయదొర తన దగ్గర ఉన్న దీపాన్ని చూపించి, దాని కాంతి పడిన చోటల్లా బంగారు మయం అవుతుందని దీపపు కాంతి అంతమవగానే బంగారమంతా మాయమైపోతుందని చూపించాడు.
అలాంటివే మరెన్నో వస్తువులను చూపించారు పోటీదారులు. ఇక పోటీలో మరే వస్తువులూ లేవనుకున్న తరుణంలో వైనా దేశ ఇంద్రజాలికుడు చుయాంగ్ వచ్చి, “నేను ఒక వింతటోపీ ధరించాను. అది నా తల నుంచి ఎవరూ తొలగించలేరు. తొలగించగలిగే వారికి నేనే తిరిగి బహుమతిని ఇస్తాను.” అని ప్రకటించాడు.
అక్కడున్న చాలా మందికి “ఓస్! ఇదో వింతా!” అనిపించింది. చాలా మంది అతని దగ్గరకెళ్లి అతని తలపైనున్న టోపీని తొలగించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరికి మంత్రి, మిగతా కొందరు రాజులు కూడా ప్రయత్నించి విసుగెత్తిపోయారు.
చివరికి రాజు సర్బగంధుడు కూడా ప్రయత్నించిన తదుపరి చుయాంగ్‌తో “నీ తలమీద టోపీ ప్రత్యేకత ఏమిటో మాకిప్పటికీ అర్థం కావటం లేదు. అదేమిటో మీరే వివరించండి” అన్నాడు అనుమానంగా.
“రాజా! నా తల మీదనున్నది టోపీ కాకపోవటమే వింత!” అనగానే అందరి దృష్టి దానిపై పడింది.
“ఔను రాజా! అది కేవలం నా శిరోజాలంకరణ ప్రత్యేకత. టోపీలాగ కనిపించేలాగ శిరోజాలను తీర్చిదిద్ది అందరినీ భ్రమలో ముంచెత్తటమే వింత! అనగానే రాజు దగ్గరగా వెళ్లి పరిశీలించి అతన్ని ఎంతగానో పొగిడాడు. ఆ వెంటనే సభికుల చప్పట్లతో సభంతా మార్మోగి పోయింది.
తాము సృష్టించి తెచ్చిన వస్తువుల కంటే లేనిదాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేసి తన సజీవమైన కళతో అందరినీ మంత్రముగ్ధులను చేయటమే నిజమైన వింత అని రాజు చుయాంగ్‌కే బహుమతిని ప్రకటించి పెద్ద ఎత్తున సన్మానాన్ని జరిపాడు. అయితే మిగతా కళాకారులను నిరాశ పరచక వారిని సైతం ఉచిత రీతిన సన్మానించాడు.