బాల భారతం-అసూయ పడితే అంతే సంగతులు
అనగనగ ఓ అడవి. ఆ అడవిలో నెమళ్ళు అన్ని ప్రతి పౌర్ణమినాడు ఒకచోట చేరి పురులు విప్పి నాట్యం చేసేవి. అడవిలోని జంతువులన్నీ అక్కడకు చేరి నెమళ్లు చేసిన నాట్యం చూసి మురిసిపోయి అభినందించేవి. మృగరాజు సింహం ఆ నెమళ్ల గుంపులో బాగా నృత్యం చేసిన దాన్ని గుర్తించి సత్కరించేవాడు.
ప్రతి పౌర్ణమికీ ఈ ఉత్సవాన్ని చూసే ఓ కాకి అసూయతో రగిలిపోయింది. ఎక్కడకు వెళ్లినా ప్రజలు తమ జాతిని చీదరించుకోవడం, నెమలి కనిపిస్తే దాని అందానికి మురిసిపోవడం లేదా, దాని ఈకలు దొరికినా ఇంటికి తీసుకెళ్లి భద్రంగా దాచుకోవడం తల్చుకొని తన జాతిని తానే అసహ్యించుకుంటూ ఏడవసాగింది.
అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఓ నక్క “కాకిబావా- ఎందుకు ఏడుస్తున్నావ్? ఏం జరిగిందీ!” అని అడీగింది.
దానికి కాకి “దేవుడు చూడు, నెమలిని ఎంత అందంగా పుట్టించాడో! మరి మేమేమో ఇలా అందవికారంగా ఉంటాం. దేవుడు చేసిన ఈ సృష్టిలో మాకు ఎంత అన్యాయం జరిగిందో చూశావా నక్కబావా? "
దేవుడు చేసిందని మనం బాధపడి ఏముందిలే కాకి బావా అంటూ సముదాయించే ప్రయత్నం చేసింది నక్క.
నా బాధకు మరో కారణం కూడా ఉందిలే నక్కబావా.
ప్రతి పౌర్ణమి నాడు నెమళ్లన్నీ ఒక గుంపుగా చేరి పురులు విప్పి నాట్యం చేస్తుంటే అడవిలోని జంతువులన్నీ ఆనందంగా చూస్తున్నాయి. నేను కూడా నెమలిగా పుట్టి ఉంటే వాటితోపాటు నాట్యం చేసేదాన్ని కదా! ఎంచక్కా, సింహం తాత చేతుల మీదుగా బహుమతి కూడా అందుకునేవాణ్నీ. ఆ అదృష్టం ఈ జన్మకు లేకపోయింది గదా అని ఏడుస్తున్నాను” అంటూ దీర్ణంగా నిట్టూర్చింది కాకి,
కొన్ని క్షణాలు ఆలోచించింది నక్క “కాకిబావా ఓ మంచి ఆలోచన అంది హఠాత్తుగా.
“ఏమిటది..?” అంది కాకి.
“నెమలిలా నెమళ్ల గుంపులో కలిసి నాట్యం చేయాలనే కదానీ కోరిక?” అని అడిగింది.
“అవును, జన్మలో
ఒక్కసారైనా నెమళ్ల గుంపుతో కలిసి నాట్యం చేయాలి" తన మనసులోని కోరికను తెలియజేసింది కాకి.
“దానికి నేను ఓ ఉపాయం
చెబుతాను. నాతో రా..” అంటూ కాకిని వెంటబెట్టుకొని నెమళ్ల గుంపు నాట్యం చేసే ప్రదేశానికి తీసుకెళ్లింది నక్క.
అక్కడ నెమళ్ళ గుంపు నాట్యం చేసిన తర్వాత ఊడి కింద పడిపోయిన ఈకలను ఒక్కొక్కటిగా ఏరి కాకి శరీరానికి అతికించి కాకీ ఆకారం అసలు కన్పించకుండా చేసింది. మసక వెలుతురులో ఆ కాకిని చూస్తే ఎవరైనా నెమలి అనే అనుకుంటారు. అలా మార్చేసింది కాకిని. అక్కడికి సమీపంలో ఉన్న కొలను దగ్గరకు తీసుకెళ్లి ఆ నీళ్లలో కాకీ రూపాన్ని చూసుకోమని చెప్పింది. కొలనులో తన రూపాన్ని చూసుకున్న కాకి సంతోషంతో మురిసిపోయింది.
ఆ మరుసటి రోజే పున్నమి. చంద్రుడు ఉదయించిన తర్వాత నెమళ్లు ఒక్కొక్కటిగా ఆ ప్రదేశానికి చేరుకున్నాయి.
అడవిలోని జంతువులన్నీ నెమళ్లు చేసే నృత్యం చూడటానికి సింహం తాతతో కలిసి కూర్చున్నాయి.
కాకిని నెమలిగా మార్చిన నక్క కూడా అక్కడకు చేరుకుంది. నెమళ్లు అన్నీ కలిసి నృత్యం ప్రారంభించాయి. ఆ గుంపులో నకిలీ నెమళ్లు కూడా చేరి నాట్యం చేయడం మొదలు పెట్టింది.
అసలు నెమళ్లతో సమానంగా “కాకినెమలి” నృత్యం చేయలేకపోతోంది. క్షణాలు గడిచేకొద్దీ నీరసించిపోసాగింది. కాళ్లు తడబడుతున్నాయి. దాని వాలకం చూసి మిగతా నెమళ్లకి అనుమానం వచ్చింది.
దగ్గరకు వచ్చి వాసన చూసి నకిలీ నెమలిగా గుర్తించాయి. ముక్కులతో పొడిచి ఈకలు పీకేసరికి దాని నిజస్వరూపం బయటపడిపోయింది. దాంతో కోపం వచ్చిన నెమళ్లు అన్నీ కలిసి కాకిపై దాడిచేశాయి. గాయపడిన కాకీ సొమ్మసిల్లి పడిపోయింది.
ఈ సన్నివేశాన్ని చూసిన నక్కబావ అక్కడి నుంచి చల్లగా జారుకుంది. సొమ్మసిల్లిన కాకీబావను సింహం తాత నీళ్లు చల్లి సేదతీర్చాడు.
“ఎందుకు చేశావ్ ఈ పని?” అడిగాడు సింహం తాత. జరిగిన విషయం మొత్తం చెప్పింది.
“ప్రపంచంలో ఏ జీవీ తక్కువ కాదు. ఎవరి ప్రత్యేకత వారిదే. నెమళ్లు అందంగా ఉన్నా నీలా ఎగరలేవు కదా! అందుకే ఎదుటి వారిని చూసి అసూయ పడకూడదు. అసూయ, ద్వేషం మనల్ని పతనం చేస్తాయి. ఇకపై నిన్ను నువ్వు చులకన చేసుకోకుండా తృప్తిగా బతుకు”. అంది.
సింహం తాత సలహాతో కాకీబావ బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయి కాకుల గుంపులో కలవబోయాడు. కానీ, కాకుల గుంపు కూడా “మన జాతిని తక్కువగా చూసి, నక్కబావ సలహాతో నెమలి వేషం వేసుకొన్నావు మళ్లీ మా మధ్యకెందుకొచ్చావు? వెళ్లిపో!” అని చీదరించుకున్నాయి. ఇప్పుడు కాకీ బావ ఒంటరిగా, దీనంగా స్నేహితుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
ఇకపై తనను తాను చులకన చేసుకోకూడదని, తనకు ఉన్న బలంతో లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు.