చందమామ కథలు-కపట దానం
పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండే వాడు. ఆయనకు అంతులేని పాలం, కట్టుకుపోయినన్ని పశువులూ ఉండేవి. అయినా పరమలోభి. కానీ సంపాదనలోంచి ఖర్చు చేయాలంటే గిజగిజా తన్నుకునే వాడు.
ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతున్నదన్న విచారంతో పాటు, దాన్ని ఊరి బయటికి లాగించటానికి రెండు రూపాయల ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది.
కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడకూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు. “చచ్చిపోయే ఆవును ఎట్లాగు ఆపలేం. పై ఖర్చు తగలకుండా చూడండి.” అన్నదావిడ భర్తతో.
“అదేనేనూ ఆలోచిస్తున్నాను,' అన్నాడు కరణం తలూపుతూ.
కరణంగారు వీధి అరుగుపై కూచుని ఉండగా, అటుకేసి ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త, ఆయనను చూడగానే కరణంగారికి మంచి ఆలోచన తట్టింది.
“ఏమయ్యా బ్రాహ్మడా? సమయానికి కనిపించావు. నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను," అన్నాడు కరణం.
“చిత్తం! ఏమిటి విశేషం?” అన్నాడు యాయవార బ్రాహ్మణుడు.
“వెనక నాకు పెద్ద జబ్బుచేస్తే గోదానం చెయ్యమన్నారు. అది ఈనాటికీ పడింది కాదు. ఇవాళ నువు కనిపించావు. నువ్వయినా పిల్దాపీచు కలవాడివి. గోవును దానం చేస్తాను. హాయిగా ఇంటికి పట్టుకుపో!” అన్నాడు కరణం.
బ్రాహ్మడికి పరమానందముయింది. ఆయనది పిల్లాపీచూ గల సంసారం. పాలకు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ కరణంగారు పరమలోభి అని విని ఈయనను ఎన్నడూ, ఏమీ యాచించలేదు. కాని తీరా చూస్తే ఈయన మంచి దానపరుడిలాగే కనిపించాడు.
“మీరిస్తానంటే నేను కాదంటానా? కాని ఇవాళ అష్టమి, బాగాలేదు. ఎల్లుండి దశమి నాడు దానం పడతాను,' అన్నాడు బ్రాహ్మడు వినయంగా.
“అలాకాదు. ఇవాళే, ఇప్పుడే పుచ్చుకోవాలి. నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు. గోదానానికి కూడా తిథి వార నక్షత్రాలేమిటి?” అన్నాడు కరణం.
కాదు కూడదంటే, కరణం ఆవును కాస్తా మరొకరి చేతిలో పెట్టేసిపోతాడని యాయవారు బ్రాహ్మడు మంచిరోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవటానికి సిద్దమయ్యాడు.
ఇద్దరూ బయలుదేరి కరణంగారి పశువులశాలకు వెళ్లారు. చావుబతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణంగారు “అదుగో మీ ఆవు. తీసుకుపో,” అన్నాడు.
బ్రాహ్మడికి కరణం దుర్చుద్ది అర్ధమయింది. ఆ ఆవుమీద పూర్తిగా ఆశ వదులుకున్నాకనే కరణం గారు దానం ఇవ్వడానికి నిశ్చయించాడు. లేకపోతే కానీకి గడ్డి తినే కరణం గారేమిటి? పోయి పోయి గోదానం చెయ్యటమేమిటి? గోదానం వెంటనే పుచ్చుకోమని తొందరపెట్టడం కూడా ఇందుకే నన్నమాట.
“దానికి ఒంట్లో బాగున్నట్లు లేదే?”
అన్నాడు బ్రాహ్మడు. “అది ఆరోగ్యంగా ఉందని నేనన్నానా? నేను దానమిద్దామనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా, చచ్చినా అది నీదే, నీకు దానం ఇచ్చేశాను. నాకిక దీని పూచీ ఏమీ లేదు,” అన్నాడు కరణం గారు.
“మీ చిత్తం, నాభాగ్యం ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు? నా ఆవును నేను పట్టుకుపోతాను. ఒక్క క్షణం ఆగండి,” అంటూ యాయవార బ్రాహ్మడు దొడ్లోకి వెళ్లి ఏదో ఆకుకోసం వెతకసాగాడు.
ఈ బ్రాహ్మడి తండ్రి గొప్పపశు వైద్యుడు. ఇతనికి కూడా కొన్ని మెలికలు తెలుసు.
అతను కొద్ది సేపట్లోనే ఒక మొక్కను పట్టి, దాని ఆకులు కోసి తెచ్చి, వాటి రసం ఆవు ముక్కుల్లోపిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది.
ఆవు లేచి నిలుచున్నది. కరణం గారి పై ప్రాణం పైనే పోయినంత పనయింది. “ఒక రూపాయి డబ్బులు ఖర్చయినా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా,” అని విచారించాడు.
బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేతబట్టుకుని, కరణం గారి దగ్గర సెలవు పుచ్చుకుని, దానిని ఇంటికి తోలుకుపోయాడు.