బాల భారతం - చిత్రం ఒక్కటే దృశ్యాలు రెండు
పూర్వం మాల్యవనం రాజ్యాన్ని తేజసేనుడు పాలించే కాలంలో విటులుడు అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. రాజ పరివారం, ఉన్నత కుటుంబీకులు కోరిన బొమ్మలను గీసేవాడు. తన ఆత్మతృప్తి కోసం కూలీలు, రైతుల బొమ్మలు కూడా వేసేవాడు. దీంతో అతనికి ప్రజలందరిలో చక్కని ఆదరణ ఉండేది. అదే రాజ్యంలో శంకమూలుడు అనే చిత్రకారుడు కూడా ఉన్నాడు. అందరూ విఠలుడిని ప్రశంసించడంతో సాటి చిత్రకారుడి మీద ద్వేషం పెంచుకున్నాడు.
ప్రతిఏడాది, రాజ్యంలోని చిత్రకారులందరూ తలా ఒక చిత్రం వేసి, రాజు పుట్టిన రోజున బహూకరించేవారు. వాటిలో ఉత్తమ చిత్రానికి వేయి వరహాలు ఇచ్చి సన్మానం చేసేవాడు రాజు. ఆ ఏడాది శంకమూలుడు రాజు చిత్రాన్ని గీసి, విఠలుడు ఎలాంటి చిత్రం గీశాడో చూద్దామని వెళ్లాడు. విఠలుడు గీస్తున్న ప్రకృతి దృశ్యాలని చూసి, “రాజు చిత్రం గీయలేదేం?” అనడిగాడు.
“ఈసారి ఇదే చిత్రాన్ని బహూకరిస్తాను” అన్నాడు బొమ్మకు మెరుగులు దిద్దుతూ. శంకమూలుడు అ మర్నాడు మహారాజు దర్శనం చేసుకుని, తను గీసిన చిత్రాన్ని బహూకరించాడు. తర్వాత “మహారాజా! ఆ విఠలుడికి మీరంటే ఏమాత్రం లెక్కలేదు. మీకోసం చెట్లూ, పుట్టలూ గీస్తూ కూర్చున్నాడు” అన్నాడు.
రాజు విఠలుడికి కబురు పెట్టాడు. “నా బొమ్మ కాకుండా, ప్రకృతి దృశ్యాలని చిత్రించడంలో ఆంతర్యం ఏమిటి?” అనడిగాడు. “మహారాజులు మన్నించాలి. ప్రతి ఏడాదిలా ఊరికే మీ బొమ్మ వేయకుండా, కాస్త భిన్నంగా ఆలోచించి చిత్రం వేశాను. చూడండి" అని తను వేసిన చిత్రం చూపాడు. అందులో రత్నఖచిత సింహాసనం మీద ఠీవిగా కూర్చుని ఉన్న రాజు కనిపించాడు. అదే చిత్రాన్ని తలకిందులు చేయగా ఒక దట్టమైన చెట్టు కనిపించింది!
“రాజుగారు మా మనసులోనే కాదు ప్రకృతి అంతా నిండి ఉన్నారన్నది ఈ చిత్రంలోని భావం' అని వివరించాడు.
మహారాజు ఆ పొగడ్తతో ఉబ్బితబ్సిబ్బయ్యాడు. ఈ ఏడాది విఠలుడు వేసిన చిత్రమే గొప్పచిత్రం అని ప్రకటించి, పట్టలేని ఆనందంతో పదివేల వరహాలిచ్చి, ఘనంగా సన్మానం చేశాడు. ద్వేషంతో ఫిర్యాదు చేసిన శంకమూలుణ్ని “వేసేది చెట్టో మనిషో తెలీని వాడివి నువ్వేం చిత్రకారుడివి? ముందు ప్రతిభ పెంచుకో. ద్వేషం వల్ల కళ రాణించదు. కళాకారుడివని వదిలేస్తున్నా జాగ్రత్త!” అని హెచ్చరించాడు.
చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో విఠలుడిని క్షమాపణ వేడుకున్నాడు శంకమూలుడు. విఠలుడు పెద్ద మనసుతో అతడిని క్షమించాడు.