బాల భారతం - కలిసొచ్చిన అదృష్టం
పూర్వం బెలగాం గ్రామంలో సోమయ్య అనే అతనుండేవాడు. అతడు సోమరి! ఏ పనీపాట చేసేవాడు కాదు. పైగా చదువబ్బలేదు. తాతతండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు!
అతని భార్యపేరు మధుమతి! కష్టజీవి! తెలివితేటలు కలది! పళ్లూ, కూరగాయలు తెచ్చి అమ్ముతూ ఏదో విధంగా గంపెడు పిల్లలున్న సంసారాన్ని నెట్టుకొస్తోంది! పనీపాట చెయ్యని భర్తను చూసి ఆమె, “ఇంట్లో కూర్చుని ఉంటే సంసారం ఎలా గడుస్తుంది? నేను ఒక్కదాన్ని సంసారం ఈదలేకపోతున్నాను. పిల్లలను 'సెంచడం కష్టమవుతోంది!” అని చిరాకు పడింది.
సోమయ్య, భార్యతో “ఏమేవ్! నాకు చదువురాదు. శాస్త్రాలు మంత్రాలు అసలే రావు. నీకు తెలియదా? పోనీ వ్యాపారం వెలగబెడదామంటే మనకంత స్తోమత లేదు. ఒళ్లు వంచి పనిచెయ్యడం నాకు మొదటి నుంచీ చేతకాదు. అయినా నువ్వు ఏదో ఒకటి చెయ్యమని సతాయిస్తున్నావు. ఒక పని చెయ్యాలనుకుంటున్నాను. నేను జ్యోతిష్కునిగా చలామణి అవుతాను. నీ సహాయం కావాలి!” అని అన్నాడు.
మధుమతి భర్త వంక అదోలా చూస్తూ “మీరేం చేయాలనుకుంటున్నారు? ” అని అడిగింది.
ఇటూ అటూ చూసి ఎవరూ లేరని నిర్ధరించుకొని భార్యతో సోమయ్య, “రోజూ నేను శృఉదయమే స్నానపానాదులు పూర్తి చేసుకొని నుదుటున విభూతి పూసుకొని వారాల పేర్లు, నెలల పేర్లు, నక్షత్రాల పేర్లు నాకు కంఠోపాఠమే కదా! అర్ధరాత్రి ఎవరిదో ఒకరిది పశువును శాలనుంచి విప్పి . ఊరవతల అడవిలో కట్టివస్తాను. తెల్లారి పశువు లేకపోవడం చూసి పశువు యజమాని కంగారు పడతాడు. ఆ సమయంలో నువ్వు వెళ్లి నా భర్త జ్యోతిషం నేర్చుకున్నారు. మీ పశువెక్కడుందో చెప్పగలరని చెప్పాలి. ఆ తరువాత కథను నేను నడుపుతాను. అలా పదో పరకో సంపాదించుకోవచ్చు” అని చెప్పాడు.
భార్య మధుమతి చేసేదేమీ లేక సరేనంది. అనుకున్న ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఆలోచన అమలు చేశారు. చాలా ప్రతిష్టలు ఆ రాజ్యమేలే రాజు వరకూ వెళ్లాయి. రాజు సోమయ్య ను పిలిపించి సన్మానం చెయ్యాలనుకునే తరుణంలో రాణి సుగుణాదేవి హారం పోయింది. జ్యోతిష్కుని పిలవండని రాజు భటులను ఆజ్ఞాపించాడు.
ఆ సమయంలో రాణి గారి దాసీ అక్కడే ఉన్నది. కాళ్ళుచేతులు ఆడలేదు భటులకు కనిపించకుండా వారిని వెంబడించి గ్రామం చేరుకుంది.
భటులు సోమయ్యను కలిసి రాజుగారు రమ్మన్నట్లు చెప్పారు. సోమయ్యకు గాభరా పట్టుకుంది. కాళ్లూ చేతులూ వణికిపోతున్నాయి. ప్రాణభయం పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లి భార్యను “'మధుమతీ!' అని కేకవేసి “ఇప్పుడు చూడు! రహస్యం బయటపడింది. రాజు చంపేస్తాడు!” అన్నాడు.
ఇంటిగోడ పక్కనున్న సందులో రాణి గారి మాటలన్నట్టు అనుకుంది. గబగబా ఇంట్లోకి ప్రవేశించి సోమయ్య కాళ్లపై పడింది. “నన్ను క్షమించండి! నేను రాణిగారి హారం దొంగిలించాను! ఎప్పుడూ నన్ను చూడని మీరు నా పేరు పెట్టి పిలిచారంటే మీ మహిమ కొద్దిదేమీ కాదు!” అని సోమయ్య చేతులు పట్టుకొని వేడుకుంది.
సోమయ్యకు విషయం అర్ధమయింది. దాసి పేరు తన భార్య పేరు ఒక్కటే అని గ్రహించాడు. ఆ విషయం బయట పెట్టకుండా “నువ్వు రాజుగారి కోటకు వెంటనే వెళ్లి రాణిగారి తలదిండు కింద హారం పెట్టా! నీ పేరు బయట పెట్టనులే!” అన్నాడు. ఆమె సోమయ్యకు కృతజ్ఞతలు చెప్పి భటుల కంటపడకుండా నగరం బయలుదేరింది.
భటులతో సోమయ్య రాజుగారి దర్బారుకు వెళ్లాడు. రాజు రాణీగారి హారం పోయిన వైనం చెప్పి ఎక్కడుందో చెప్పమన్నాడు. సోమయ్య కొద్దిసేపు ఏవేవో లెక్కలు వేసినట్టు నటించి “మహారాజా! రాణీగారి హారం ఆమె తలదిండు కిందే ఉంది. చూడండి!” అన్నాడు.
భటులు అంతఃపురంలోకి వెళ్లి హారం కోసం వెతికారు. సోమయ్య చెప్పినట్టే రాణిగారి తలదిండు కింద హారం దొరికింది.
రాజుగారి ఆనందానికి అంతులేదు. సోమయ్యను సన్మానించి వెయ్యి వరహాల సంచిని కానుకగా అందించాడు! బతుకుజీవుడా అనుకొని సోమయ్య గ్రామం చేరుకున్నాడు. ఆ రోజు నుంచి జ్యోతిషం మానుకొని రాజుగారిచ్చిన ధనంతో పొలంకొని కష్టపడి వ్యవసాయం చేసుకొని బతకసాగాడు.