బాల భారతం-ఏకలవ్యుడు
పట్టుదల, ఏకాగ్రత, గురుభక్తి వంటి సుగుణాలకు అతడు పెట్టింది పేరు. పుట్టింది పెరిగింది గిరిజన జాతిలో అయినా గొప్ప విలుకానిగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఆ ఏకలవ్యుడి కథేంటో చదివేద్దామా!
ఏకలవ్యునికి చిన్ననాటినుంచీ విలువిద్య అంటే ఎంతో మక్కువ. తాను గొప్ప విలుకాడు కావాలన్న ఆశయంతో కురువంశ గురువయిన ద్రోణాచార్యునివద్దకు వెళ్లి తనను శిష్యునిగా స్వీకరించమనీ, విలువిద్యను బోధించమనీ ప్రాధేయపడతాడు.
ఏకలవ్యునికి చిన్ననాటినుంచీ విలువిద్య అంటే ఎంతో మక్కువ. తాను గొప్ప విలుకాడు కావాలన్న ఆశయంతో కురువంశ గురువయిన ద్రోణాచార్యునివద్దకు వెళ్లి తనను శిష్యునిగా స్వీకరించమనీ, విలువిద్యను బోధించమనీ ప్రాధేయపడతాడు.
రాజగురువు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రోణుడు రాజకుమారులకు మాత్రమే అత్యుత్తమ విద్య అయిన విలువిద్యను బోధిస్తానంటాడు. ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించేందుకు నిరాకరిస్తాడు. ఎంతో ఆశపడ్డ ఏకలవ్యుడు చిన్నబుచ్చుకుని వెనుదిరుగుతాడు. విలువిద్యపై తన మక్కువను చంపుకోలేకపోతాడు ఏకలవ్యుడు. ఎలాగైనా దానిని సాధించాలన్న పట్టుదలతో ద్రోణుడినే గురువుగా భావించి, ఆయన ప్రతిరూపాన్ని (మట్టిబొమ్మను) రూపొందించి, దాన్ని నిత్యమూ పూజిస్తాడు.
విశేషమైన గురుభక్తితో రేయింబగలు కఠోర సాధన చేసేవాడు. చెక్కు చెదరని సంకల్పం, ఏకాగ్రత, స్థిర చిత్తతల వల్ల అచిరకాలంలోనే అతనికి చక్కని విలువిద్య అబ్బింది.
ఒకనాడు ద్రోణుడు తన శిష్యగణంతో అడవుల గుండా పోతున్నాడు. వారి వెంట తీసుకుని వచ్చిన కుక్క మొరుగుతూ వారి ముందుగా వెళ్తుండగా అకస్మాత్తుగా దాని అరుపులు ఆగిపోయాయి. అందరూ ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.
ఒక్క క్షణంలో దాని నోటికి అడ్డుగా, చుట్టుతా బాణాలు సంధించి ఉన్నాయి. వ్యక్తులెవరూ కనిపించకుండా కేవలం శబ్దం ఆధారంగా ఎక్కడి నుంచో బాణాలు వేస్తున్న వారెవరో తెలియక ద్రోణుడు, ఆయన శిష్యులు ఆశ్చర్యపోయారు.
మరికొద్ది క్షణాల్లోనే మెరుపుతీగలాగా ఏకలవ్యుడక్కడికి వచ్చి, ద్రోణుని పాదాలపై పడి ప్రణమిల్లాడు. గురువు గారికి త్రమ శిష్యుడు ఏకలవ్యుని ప్రణామాలు అంటూ వినయపూర్వకంగా చేసిన ఏకలవ్యుని వందనం అందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. ఇక ద్రోణుడి ఆశ్చర్యానికి అంతేలేదు. “ఇదెలా సాధ్యమయింది నాయనా?' అని ఆయన ప్రశ్నించాడు.
మీరు అవునన్నా కాదన్నా మీరే నాకు గురువులు. త్రికరణ శుద్ధిగా మీ ప్రతిరూపాన్ని ధ్యానించి, పూజించి మీ ఆశీస్సులతోనే ఇంతటి విద్యను నేర్చుకున్నానంటాడు.
ఆ మాట విన్న ద్రోణుడు ఏకలవ్యుని దృఢ సంకల్పానికి ముగ్దుడయ్యాడు. అంతలోనే భూప్రపంచం మొత్తానికి సాటిలేని మేటి విలుకానిగా తీర్చిదిద్దుతానని అర్జునునికి చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకలవ్యుడు అర్జునుని మించిన విలుకాడు కాకూడదనీ, అలా జరిగితే, అర్జునునికి ఇచ్చిన ప్రమాణం భంగపడుతుందని అనుకున్నాడు.
వెంటనే ఏకలవ్యుని గురుదక్షిణ ఇమ్మని కోరాడు. విలువిద్యలో రాణించేందుకు చేతి బొటనవేలు చాలా అవసరం. అది తెలిసి ఏకలవ్యుడి కుడి బొటనవేలు గురుదక్షిణగా ఇమ్మని అడుగుతాడు ద్రోణుడు. ఏకలవ్యుడికి విషయం అర్థమవుతుంది. అయినప్పటికీ గురువు కోరికపై ఏమాత్రం సంకోచించకుండా తన కుడిచేతి బొటనవేలిని తెగనరికి గురువు పాదాల ముందు ఉంచాడు. చరిత్రలో గొప్ప శిష్యుల పేర్లు చెప్పమంటే ముందుగా చెప్పే 'పేరు ఏకలవ్యుడిదే.
మీరు మంచి శిష్యులు కావాలనుకుంటున్నారా?.
ఆ కాలంలో లాగా మీరు గురువుల కోసం ఎటువంటి త్యాగాలూ చేయనవసరం లేదు. వారు చేప్పే పాఠాలని, మంచి మాటల్ని శ్రద్ధగా వింటూ, బాగా చదువుకుంటే మంచి ప్రవర్తనతో పాటు మంచి మార్కులూ సొంతం చేసుకోవచ్చు.
Q): పైన చెప్పిన కథ ప్రకారం విద్య నేర్పకుండా ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్న ద్రోణుడు మంచి గురువునా లేక చెడ్డవాడా?