బాల భారతం-మధ్యవర్తిగా ఉంటే!
ఒకప్పుడు చంపావనంలో కాకారి అనే గుడ్డ్గగూబ ఉండేది. అది ఒకరోజు చెట్టపై ఉన్న పురుగులు తింటూ కూర్చుంది. దారిన పోతున్న ఓ వేటగాడు దాన్ని చూడనే చూశాడు. వెంటనే ఒక మట్టిగడ్డని తీసుకుని తన వడిసెలతో గురిచూసి వదిలాడు. ఆ దెబ్బకి గుడ్లగూబ పడిపోకుండా తమాయించుకుంది. కానీ పాపం మట్టిగడ్డ దాని రెక్కలో ఇరుక్కుపోయింది.
గుడ్లగూబ పక్క చెట్టపై సూత్రి అనే కాకి ఉండేది. వడిసెల దెబ్బకు విలవిల్లాడుతున్న గుడ్డగూబని చూసి దానికి 'పాపం' అనిపించింది. వేటగాడు అటువెళ్లగానే గుడ్లగూబ దగ్గరకు వచ్చి 'కాకారి మావా! నువ్వు కొంచెం ఓర్చుకో. కలకంఠి అనీ నాకు తెలిసిన కోకిల ఉంది. తనకి తెలియని వైద్యం లేదు. తన దగ్గరకి పోదాం పద' అని నిదానంగా కోకిల దగ్గరకి గుడ్డగూబని తీసుకువెళ్లింది.
గుడ్ల్గగూబని పరీక్షించిన కోకిల 'నేను తప్పకుండా నీ బాధని తొలగిస్తాను. కానీ నా రుసుముని (ఫీజు) చెల్లించకపోతే ఊరుకునేది లేదు" అంది.
దానికి కాకి 'మరేం కంగారు పడవద్దు కలకంఠి బావా! ఈ గుడ్లగూబ నీ రుసుముని చెల్లించకపోతే నాదీ బాధ్యత' అని మధ్యవర్తిగా నిలిచింది.
అప్పుడు కోకిల 'అయితే నా చికిత్స విను! ఒక తొట్టెలో నీళ్లు పోసి దానిలో కూర్చో. కాసేపటికి నీ రెక్కలో ఇరుక్కున్న మట్టిగడ్డ నీళ్లలో కరిగిపోతుంది. దాంతోపాటు నీ నొప్పి కూడా తగ్గిపోతుంది" అంది.
ఇది విన్న గుడ్డగూబకి 'ఓస్ ఇంతేనా!” అనిపించింది. వెంటనే దగ్గర్లో ఉన్న నీళ్ల తొట్టెలో మట్టిగడ్డ కరిగిపోయేదాకా కూర్చుంది. కాస్త ఉపశమనం లభించాక లేచి బయల్దేరడానికి సిద్ధపడింది.
“అదేంటీ! నా రుసుం చెల్లించకుండా వెళ్లిపోతున్నావు?' అని కంగారుగా అడిగింది కోకిల.
“కాసేపు ఆలోచిస్తే ఈ ఉపాయం నాకు కూడా తట్టేదే! ఈమాత్రం దానికి రుసుం ఎందుకు' అని చక్కా ఎగిరిపోయింది గుడ్లగూబ.
అప్పుడు ఆ కోకిల, కాకిని పట్టుకుని “రుసుం చెల్లించకపోతే నీదే బాధ్యత అని చెప్పావు. ఇప్పుడునా రుసుం చెల్లిస్తావా లేదా?” అని నిలదీసింది.
'నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నేనునీ రుసుం చెల్లించలేను' అంది కాకి.
చంపావనంలో ఏదన్నా తగాదా వస్తే శశం అనే కుందేలు దగ్గరకి వెళ్తారు. అలా ఆ కోకిల, కాకి తమ గొడవని తేల్చుకునేందుకు కుందేలు దగ్గరకి వెళ్లారు.
జరిగిందంతా తీరికగా విన్న కుందేలు “అన్నమాట ప్రకారం ఆ రుసుము నువ్వే చెల్లించాలి. లేకపోతే ఈ కోకిల చెప్పిన పని చేసిపెట్టి తన రుణం తీర్చుకోవాలి' అంది. దానికి కాకి సరేనంది.
"నాకు ఈమధ్య బొత్తిగా తీరిక ఉండటం లేదు. రోగులను చూడటానికి ఎక్కడెక్కడికో వెళ్లాల్సి
వస్తోంది. అందుకని నేను పెట్టిన గుడ్లను నువ్వే
పొదిగి పెట్టాలి" అంది కోకీల.
దానికి కాకి ఒప్పుకోడంతో ఆ గొడవ అక్కడితో ముగిసింది. అప్పటి నుంచీ కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడుతూ ఉంటుంది. పాపం కాకేమో వాటిని పొదుగుతుంది.
ఇంతకీ గుడ్గగూబ సంగతి చెప్పనే లేదు కదూ! తను కనబడితే కాకి, కోకిల ఎక్కడ నిలదీస్తాయో అని రాత్రిళ్లు ఎవరికీ కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది.
చంపావనంలో మిగతా జీవులన్నీ ఈ సంఘటన తర్వాత జాగ్రత్త పడ్డాయి. ఎవరిని పడితే వారిని నమ్మి మధ్యవర్తిగా ఉండకూడదని నిశ్చయించుకున్నాయి. మాట ఇచ్చే ముందర ఆలోచించాలి అని కూడా.