బాల భారతం- రాబందు చిలుక
ఒక చిట్టడవిలో ఒక చిలుక ఉంది. గుడ్లు పొదగటానికి చెట్టుపై గూడుకట్టుకుంది. గుడ్లు పెడితే నాలుగు పిల్లలయ్యాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోసాగింది. అదే అడవిలో ఒక రాబందుంది. దానికి ఆకలేస్తే పక్షుల్ని, వాటి పిల్లల్ని ఎత్తుకెళ్లేది. దగ్గరలో రాబందు కనిపిస్తే చాలు పక్షులన్నీ పిల్లల్ని రెక్కల కింద దాచుకునేవి.
ఒకనాడు చిలుక ఆహారం కోసం వెళ్లింది. అది రాబందు చూసింది. చిలుక పిల్లల కోసం చెట్టు కొమ్మలపై వాలింది. పిల్లలు దాన్ని చూసుకోక ఆడుకుంటున్నాయి. ఈ లోపు ఒక పిల్ల గూటి నుంచి జారి కింద పడటం రాబందు కంట పడింది. దాన్ని పట్టుకోవాలని కొమ్మపై నుంచి కిందికి వాలింది. రాబందుని చూసి చిలుక పిల్ల గజగజ వణికి పోసాగింది. ముట్టుకోకముందే భయపడుతున్న పిల్లని చూసి రాబందుకు జాలేసింది.
అంత చిన్న పిల్లని తిన్నా ఆకలైతే తీరదు. ఎగరలేక పోతోంది కనుక తీసి గూట్లో పెట్టేద్దామని ముక్కుతో పట్టుకుంది. ఈలోగా వచ్చేసింది. రాబందు నోట తన పిల్లని చూసి దాని ప్రాణాలు గుబగుబలాడాయి. కానీ రాబందు. చిలుక పిల్లని తీసుకొచ్చి గూటి వద్ద వదిలింది. దాని ఔదార్యానికి చిలుకకు ముచ్చటేసింది. తాను ఏరి తెచ్చిన ఆహారంలో కాస్త తినమని పెట్టింది. “వద్దు... నీ పిల్లల ఆకలి ముందు తీర్చు' అంది రాబందు. ఆనాటి నుంచి చిలుకారాబందు మంచి 'స్నేహితులయ్యాయి.
రాబందు మంచిదేనని, కేవలం ఆకలి తీరేందుకే పక్షుల్ని వాటి పిల్లల్ని తింటోందని అర్ధమైంది చిలుకకు. అయినా సరే రాబందును మార్చి, దాని బారి నుంచి తోటి పక్షుల్ని రక్షించాలనుకుంది.
ఒకరోజు చిలుక నిటారు కొండ మీద చెట్టుపై ఉన్న రాబందు గూటికి వెళ్లింది. రాబందు అప్పుడు గూట్లో లేదు. పిల్లలే ఉన్నాయి. ఇంతలో ఒక పాము రాబందు పిల్లల్ని తినడానికి వచ్చింది. అది చూసి చిలుక గాల్లో ఎగురుతూ దాన్ని ముక్కుతో పొడవసాగింది. ఇంతలో రాబందు రానే వచ్చింది. దాన్ని చూసి పాము భయపడి పారిపోయింది. అప్పుడు రాబందు చిలుకతో 'ఇవాళ నువ్వు లేకపోతే నా పిల్లల్ని పాము తినేసేది. నీకేం కావాలో అడుగు' అంది.
అప్పుడు చిలుక... “మిత్రమా! నీ పిల్లల్ని పాము ఏం చేస్తుందో అని ఎంతో కంగారు పడ్డావు! మరి మిగిలిన పక్షులూ వాటి పిల్లల్ని నువ్వు తినేస్తుంటే బాధపడతాయి కదా? అందుకే నువ్వివాల్టి నుంచి బతికున్న పక్షుల్ని తినొద్దు. అంది.
రాబందు అలోచనలో పడింది. కాసేపటికి నవ్వుతూ 'సరే మిత్రమా నువ్వు చెప్పినట్టే చేస్తాను. చనిపోయిన జంతువులు, పక్షుల్ని మాత్రమే తింటాను' అని హామీ ఇచ్చింది.
ఈ విషయం తెలిసి పక్షులన్నీ సంతోషించాయి. అలా చిలుక తన స్నేహితుణ్ని మార్చిందన్నమాట!