బాల భారతం-చంద్రం తెలివి
బంగారయ్య మహా జాలి మనిషి ఊల్లో ఏ అవసరం వచ్చినా ఆదుకుంటూ ఉండేవాడు. అతని జాలిని అలుసుగా తీసుకుని కొందరు మాయమాటలు చెప్పి అతని వద్ద డబ్బు కాజే సేవారు. ఇదంతా చూసి అతని భార్య విమలమ్మ “నేను మీకంటే కఠినంగా ఉంటాను కాబట్టి ఇంటి పెత్తనం నాకివ్వండి' అంది.
బంగారయ్య 'హమ్మయ్య;'" అనుకుని వచ్చే ఆదాయాన్ని భార్య చేతికిస్తూ, మనశాంతిగా ఉండసాగాడు. ఇదిలా ఉండగా ఒకనాడు విమలమ్మ దగ్గరే ఉండే ఆమె తమ్ముడు చంద్రం “అక్కా... నరసయ్య అనే నా స్నేహితుడికి యాభైవేల రూపాయలు అవసరమయ్యాయి. నీ దగ్గర ఉంటే సర్దుబాటు చెయ్యి! వడ్డీతో సహా ఇప్పిస్తాను” అని చెప్పి నరసయ్య చేత విమలమ్మకు 'అప్పు ఒప్పంద పత్రం' రాయించి డబ్బు ఇప్పించాడు.
కాలం గడుస్తోంది. నరసయ్య బాకీ తీర్చకుండా జల్సాగా ఖర్చులు చేస్తూ, తనకు కావలసినవన్నీ సమకూర్చుకోసాగాడు. ఆ సంగతి తెలిసి విమలమ్మ గాబరాపడిపోతూ బాకీ విషయమై తన తమ్ముడిని అడిగింది.
“అక్కా!.... నేనుకూడా అనేకసార్లు నరసయ్యతో. బాకీ తీర్చేయమని చెప్పాను... వాడు 'ఇవాళ, రేపు అంటూ వాయిదాలు వేస్తున్నాడు. వాడి వాలకం చూస్తుంటే బాకీ ఎగ్గొట్టేస్తాడేమోనని నాకు అనుమానం కలుగుతోంది. అతడు రాసిన 'అప్పు ఒప్పందపత్రం' ఇలా తీసుకురా... ఎలాగోలా మన బాకీ మనం వసూలు చేసుకుందాం!” అని అడిగాడు చంద్రం.
విమలమ్మ ఆదుర్దాగా పెట్టెలోంచి అప్పు ఒప్పంద పత్రం' తీసి, కంగారుగా తెచ్చి తమ్ముడు చేతికివ్వబోతుంటే, సరిగ్గా అప్పుడే గాలివేగంగా వీచడంతో ఆ పత్రం కాస్తా రివ్వమంటూ ఎగిరివెళ్ళి వీధివైపున ఉన్న నీళ్ళకుండీలో పడింది. చంద్రం గబగబా పరిగెత్తి ఆ పత్రాన్ని చేతుల్లోకి తీసుకొని, కొన్ని క్షణాలు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత తేరుకొని, “కొంపమునిగింది!.... ఆ నరసయ్య సిరా పెన్నుతో రాసిన పత్రం కదా. నీళ్ళలో పడి అక్షరాలన్నీ కరిగిపోయాయి. ఇక ఈ పత్రం చెల్లుబాటు కాదు. జరిగిందంతా నరసయ్యతో చెప్పి, వడ్డీ సంగతి. అటుంచి, అసలు సొమ్ము అయినా ఇవ్వమని బతిమాలుకోవాలి” అంటూ ఊళ్లోకి వెళ్లిపోయాడు.
జరిగిన దానికీ విమలమ్మ, బంగారయ్యలు బెంగపడి, దిగులుగా కూర్చున్నారు. చంద్రం ద్వారా జరిగిన సంగతి తెల్సుకొన్న నరసయ్య 'అప్పు ఒప్పంద పత్రం' ఎటూ చెల్లుబాటు కాదు గనుక బాకీ ఎగ్గొట్టేయవచ్చన్న దుర్చుద్ధితో గ్రామపెద్దను వెంటబెట్టుకుని అప్పు తీర్చే నెపంతో బంగారయ్య ఇంటికొచ్చాడు.
చంద్రానికి నరసయ్య పథకం అర్థమైంది. అయినా ఏ భావం వ్యక్షపరచకుండా, వచ్చినవారిని కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు.
ఆ తర్వాత గ్రామపెద్ద కల్పించుకొని, “చంద్రం! నీ అక్క దగ్గర నరసన్న అప్పుగా తీసుకొన్న యాభైవేలు వడ్డీతో సహా తీర్చే ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చాడు. మొత్తం సొమ్ము నా చేతికే ఇచ్చాడు. నీవు 'అప్పు ఒప్పంద పత్రం' ఇస్తే వడ్డీ లెక్కగట్టి, మొత్తం డబ్బు మీకిచ్చేస్తాను” అన్నాడు.
ఆ మాటకు బంగారయ్య, విమలమ్మలు మొహమొహాలు చూసుకొన్నారు. అయినా చంద్రం తొందరపడకుండా కొద్దిసేపు అటూఇటూ తచ్చాడి.. నెమ్మదిగా 'అప్పు ఒప్పంద పత్రం' తెచ్చి గ్రామపెద్ద చేతిలో పెట్టాడు.
అది అక్షరాలా నరసయ్య స్వహస్తాలతో రాసిందే! అది చూసిన నరసయ్య 'ఇదంతా మోసం. నేను రాసిచ్చిన పత్రం నీటిలో పడి అక్షరాలు. కరిగిపోయాయని చెప్పావు కదా!... తొందరపాటుగా అన్నాడు.
దానికి చంద్రం “నీవు మాకు రాసిచ్చిన పత్రం నీటిలో పడిన మాట వాస్తవమే! కానీ అదృష్టవశాత్తూ అక్షరాలేమీ చెక్కు చెదరలేదు. అయితే అది నీటిలో పడడంతో నాకో ఆలోచన వచ్చింది. నువ్విలాంటి పథకం. ఏదో వేస్తావనే నీతో అలా అబద్ధం చెప్పాను...” అన్నాడు.
అసలు సంగతి గ్రహించిన గ్రామపెద్ద 'చంద్రం, నరసన్నకు భలే శాస్తి చేశాడని' సంతోషపడి, బాకీ మొత్తం తీర్చేసి వెళ్ళాడు. విమలమ్మ తన తమ్ముడి తెలివితేటలకు మురిసిపోయింది. దయాగుణంతో పాటుగా లౌక్యం కూడా ఉండాలని బంగారయ్య కూడా తెలుసుకున్నాడు.