బాల భారతం-భళారే బ్రహ్మయ్య
పూర్వం దండకారణ్యంలో లవణాసురుడనే రాక్షషుడుండేవాడు. బలిష్టమైన శరీరం, తల మీద కొమ్ములు, పొడవాటి కోరలతో భయంకరంగా కనిపించేవాడు. విచ్చలవిడిగా తిరుగుతూ... చేతికి దొరికిన జంతువులను, మనుషులను తింటూ ఉండేవాడు. అతనికి ఓసారి బ్రహ్మను గురించి తపస్సు చేసి వరాలు పొందాలనే కోరిక కలిగింది.
వెంటనే పట్టుదలతో ఆతి భయంకరమైన తపస్సు మొదలుపెట్టాడు. అతని శిరస్సులోంచి వచ్చిన మంటలు భూలోకం దాటి స్వర్గలోకానికి ఎగబాకాయి. ఆ మంటలకు భయపడిన దేవతలు, మునులు బ్రహ్మను శరణు కోరారు.
పరిస్థితిని గమనించిన ఆయన వెంటనే లవణాసురునికి ప్రత్యక్షమై, “ఏం వరం కావాలో కోరుకో...!” అన్నాడు.
బుద్ధిహీనుడైన లవణాసురుడు బ్రహ్మ ప్రత్యక్షం కాగానే... ఏం వరం కోరుకుంటే బాగుంటుందా... అనే ఆలోచనలో పడిపోయాడు. అతని మౌనానికి కారణం అర్ధమైన బ్రహ్మ... “నువ్వు ఏం కోరుకోవాలో తేల్చుకోలేక పోతున్నావు. అయినా... నీ తపస్సుకి మెచ్చి... నీకు రెండు వరాలు ఇస్తున్నాను. నీకు ఇష్టమైనప్పుడే వాటిని కోరుకో...!” అని మాయమైపోయాడు.
ఏ వరమైతే బాగుంటుందా అనుకుంటూ తన గుహకు బయల్టేరాడు. అలా కొంతదూరం వచ్చేసరికి... అతనికి కమనీయమైన స్త్రీ స్వరం వినిపించింది. ఆ మధురమైన పాట అతని మనసుకు విందు చేయగా... ఆ పాట పాడే సుందరి మరెంత అందంగా ఉంటుందోనని ఊహించుకుంటూ ఆ స్వరం వచ్చిన దిక్కుకి వడివడిగా అడుగులు వేశాడు.
అతను వెళుతున్న కొద్దీ ఆ గానం మరింత ముందుకు సాగిపోతూ ఉంది. ఎంత సేపటికీ... ఆ సుందరి కనిపించకపోయేసరికి అతనికి విసుగెత్తిపోయింది. ఆ సుందరిని ఎలాగైనా చేరుకోవాలనిపించింది. సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మ ఇచ్చిన వరాలు గుర్తుకొచ్చాయి.
బ్రహ్మని స్మరించి, “ఒక్క క్షణంలో ఆ సుందరి ముందర నన్ను నిలబెట్టు!” అన్నాడు.
మరుక్షణంలో... అపురూప సౌందర్యరాశియైన ఒక అప్పరస అతని ముందర ప్రత్యక్షమైంది. ఆమె అందాన్ని చూసిన అతను విస్తుపోతూ, “సుందరీ నువ్వెవరో నాకు తెలియదు గానీ అపురూపమైన సౌందర్యం నా మనసుకి నచ్చింది. నీకు సమ్మతమైతే పెళ్లాడుతాను” అన్నాడు.
అందుకు ఆ అప్సరస, “అంతకన్నానా...! మీలాంటి వారిని వివాహమాడే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉంది. అయితే ఒక షరతు..!” అంది. “షరతా... ఏంటది?” ఆతృతగా అడీగాడు.
“నేనేమో... అప్సరసను, అందంగా ఉన్నాను. మీరేమో కోరలు, కొమ్ములు, భీకరాకారంతో భయం కలిగిస్తున్నారు. మీరూ నాలా అందంగా మారిపోతే బాగుంటుంది కదా! అలాగే మీ క్రూరమైన అలవాట్లూ పోవాలి” అంది.
అప్పటికే ఆమె ప్రేమలో చిక్కిన అతను... మారు మాట్లాడకుండా, తిరిగి బ్రహ్మను తలచుకొని, “నాకు అందమైన రూపంతోపాటు, మంచి బుద్ధుల్ని ప్రసాదించు అన్నాడు.
వెంటనే, లవణాసురుడు అందమైన యువకునిగా మారిపోయాడు. తనరూపం తననే అబ్బురపరచేలా ఉంది.
వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై, “లవణాసురా! నీకిచ్చిన రెండు వరాలు అయిపోయాయి. అయినా నీవు వాటిని చెడుకు . ఉపయోగించలేదు. అది మెచ్చాను. మీరిద్దరూ వివాహం చేసుకొని, సమీప నగరానికి వెళ్లండి. మీరు కష్టపడి జీవించేందుకు కావల్సిన నైపుణ్యాలని అందిస్తాను, హాయిగా సుఖంగా బతకండి...” అని చెప్పి మాయమయ్యాడు.
రాక్షసత్వం కోల్పోయిన లవణాసురుడు... లవణుడిగా మారిపోయాడు. ఆమెను పెళ్లాడి బ్రహ్మ చెప్పిన విధంగా సమీప నగరానికి చేరాడు.
ఇదంతా చూసి ఆశ్చర్యపోతున్న దేవతలూ, మునులూ “బ్రహ్మదేవా! మీరు ఆ రాక్షసుడీపై ఇంతగా దయ చూపడానికి కారణం ఏమిటి?” అని అడిగారు.
దానికి బ్రహ్మ చిరునవ్వుతో “ఎంతటి దుష్టులకైనా మారేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి కదా!
అందుకే ఒక స్త్రీని సృష్టించి అతను ఆమె కోసం మారతాడేమో చూశాను. నా పరీక్షలో అతను నెగ్గాడు, ఇతరులకు కష్టం కలిగించే వరాలని కాకుండా తను మంచివాడుగా మారే వరాలే అడిగాడు. అందుకే అతడి ప్రేమకు మెచ్చి, కష్టపడి జీవించే అవకాశం కల్పించాను” అన్నాడు
బ్రహ్మ నాటకాన్ని మెచ్చుకొని... అందరూ హర్షద్వానాలు చేశారు.