రాజును మించిన రైతు
మామిడి దేశం రాజు గారు దేశ పర్యటనకు బయలుదేరారు. దారిలో ఆయనకు ఒక రైతు కనిపించాడు. అతని గురించి వివరాలను తెలుసుకోవాలని అనుకున్నారు. రాజుగారు
'ఏమోయ్ నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావు? అని అడిగారు.
'నాలుగు వరాహలండి' అని వినయంగా చెప్పాడు రైతు.
'ఆ నాలుగు వరహాలని నువ్వు ఎలా ఖర్చు పెడతావు అని అడిగారు ఆసక్తికరంగా
'ఒక భాగం నాకోసం, ఒక భాగం వర్తమానానికి, ఒక భాగం గతం కోసం, ఒక భాగం భవిష్యత్తుకు'' అని చెప్పాడు.
ఆ పొడుపు కథకు జవాబు ఏమిటని రాజు అడిగితే 'ఒక భాగం నా అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాను, మరోక భాగాన్ని ఇంటి ఖర్చులకు అంటే వర్తమానానికి, నన్ను పెంచిన తల్లిదండ్రుల కోసం ఒక భాగాన్ని ఖర్చు పెడతాను అదే గతం కోసం, ఇక మిగిలిన భాగం నా పిల్లల కోసం వాడతాను వారే నా భవిష్యత్తు కదా!'.
ఈ మాటలు విన్న రాజుగారు చాలా సంతోషించారు. "నా మొహాన్ని వందసార్లు చూసేదాకా ఈ జవాబులు ఎవరికీ చెప్పవద్దు" అని ఆదేశించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం రైతు అడిగిన పొడుపు కథని తన మంత్రికి వినిపించారు. దానికి ఆ మంత్రి ఒక రోజు గడువు కోరాడు.
ఆరోజు రాజు గారు ఎవరిని కలిశారో వాకబు చేసిన మంత్రి రైతు వద్దకు తిన్నగా వెళ్ళాడు. అతనికి వరహాల మూట ఇవ్వగానే టక్కున జవాబు చెప్పేసాడు. రైతు మంత్రి అటు వెళ్ళగానే రైతు భార్య అతన్ని మందలించింది. 'కనీసం వంద సార్లు తన మొహం చూస్తే కానీ జవాబు ఎవరికీ చెప్పవద్దు అన్నారు కదా!' అంది.
దానికి రైతు చిరునవ్వు నవ్వుతూ వరహాల మూట నుంచి ఒక వరాహన్ని బయటకు తీసి దీనిపై ఎవరి ముఖం ఉంది అని అడిగాడు. 'ఎవరి ముఖం ఉంటుంది రాజుగారి ఒకటే ఉంటుంది!' అని జవాబు చెప్పింది రైతు భార్య. ఈ మూటలో సరిగ్గా వంద వరహాలు ఉన్నాయి అంటే నేను రాజుగారి ముఖాన్ని వందసార్లు చూసినట్లే కదా అన్నాడు. తన భర్త ఆత్మవిశ్వాసానికి తెలివికి మురిసిపోయింది రైతు భార్య.