జామకాయ గెలిచింది
నేను బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి తెగ ఆకలేస్తోంది. ఇంట్లోకి అడుగుపెడుతూనే అమ్మా ఆకలేస్తుంది తినడానికి ఏమన్నా పెట్టవా అని అడిగాను. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చోగానే అమ్మ పళ్లెంలో ఏదో తీసుకు రావటం కనిపించింది. అమ్మ ఏదో రుచికరమైన పదార్థాలు చేసి ఉంటుందని ఆశగా పళ్లాన్ని చేతిలోకి తీసుకున్నాను. అంతే యాక్ జామకాయ ముక్కాలా! అంటూ పళ్లాన్ని టీపాయ్ మీద పెట్టాను.
అమ్మ మొహం వాడిపోయింది. జామ కాయలు ఆరోగ్యానికి మంచిది నాన్నా అంటూ ఏదో చెప్పబోయింది. 'ఏం కాదు! ఆపిల్ పండు, స్ట్రాబెర్రీలు అయితేనే ఆరోగ్యానికి మంచివి' పైగా తినటానికి, చూడడానికి బాగుంటాయి. అవైతే ఖరీదు ఎక్కువ అని పనికిరాని జామపళ్ళు ఇచ్చావు అని ఏడుస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను. అమ్మ ఎప్పుడూ ఇంతే నా కోసం మంచి పదార్థాలు కొనదని ఉక్రోషంతో ఏడుస్తూనే నిద్రలోకి జారుకున్నాను.
*****************************************************************************
ఒక పెద్ద జామ తోటలో ఉన్నాను ఎటుచూసినా చెట్టు నిండా జామకాయలే, వాటి నుంచి వచ్చే తీయటి వాసనలతో కడుపు నిండిపోతుంది. పక్కకి తిరిగి చూస్తే ఎవరూ లేరు. నేను దారి తప్పి పోయాను ఏమో అని బిక్క మొహం వేసుకుని నిల్చున్నాను. ఇంతలో నవ్వులు వినిపించాయి పైకి చూస్తే ధోర జామ కాయలు కొన్ని నా వంక చూస్తూ నవ్వుతున్నాయి.
ఎందుకలా నవ్వుతున్నారు అడిగాను ఉక్రోషంగా. 'మరేం లేదు నువ్వు మేము పనికిరాని కాయలు అన్నావు నీ అమాయకత్వానికి నవ్వుకుంటున్నాం' అన్నాయి. నిజంగానే మీరు పనికి రాని వాళ్ళు! మీకంటే యాపిల్ పళ్ళు చాలా గొప్పవి అన్నాను.
నా మాటలు వినటంతోనే జామపండ్లు నవ్వులు ఆగిపోయాయి వాటిలో ఒక పెద్ద జామ పండు ఇలా గంభీరంగా అంది. 'ఒక పండు గొప్పదనం దాని అందాన్ని బట్టి, ఖరీదు బట్టి లెక్క వెయ్యకూడదు బాబు' దాని ఉపయోగాలు గురించి కూడా ఆలోచించాలి. 'మీకు కూడా ఉపయోగాలు ఉంటాయా అడిగాను ఆశ్చర్యంగా!'. బోల్డన్ని! ఇంకా చెప్పాలంటే యాపిల్ పండ్ల కంటే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అంది ఆ పెద్ద జామకాయ. నేను ఏమీ మాట్లాడక పోయేసరికి తనే చెప్పసాగింది.
ఉదాహరణకు యాపిల్ కంటే జామపండులో 5 శాతం ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. 5 శాతమే కదా అది అప్పటికప్పుడు ఖర్చయిపోతుంది అనేసాను తేలిగ్గా. అయితే యాపిల్ లో కంటే మాలో కొవ్వు శాతం 500 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలం మీ శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.
ఇంకా అడిగాను ఆసక్తిగా! మీ శరీర నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లు 5 రెట్లు ఎక్కువగా అందిస్తాయి. జామకాయలు మొత్తంగా చూస్తే 100 గ్రాముల ఆపిల్ తినడం వల్ల 52 కేలరీల శక్తి లభిస్తుంది. అంతే బరువున్న జామకాయ తినడం వల్ల 68 కేలరీల శక్తి లభిస్తుంది అంది ఆ పెద్ద జామకాయ. అంతేకాదు మమ్మల్ని తినటం వల్ల పళ్ళ జబ్బులు నయం అవుతాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రక్తపోటు తగ్గుతుంది.
ఇప్పుడు చెప్పు మేము పనికి రాని వాళ్ళమా! అంటూ ఆవేశంగా అడిగింది ధోర జామకాయ. 'లేదు లేదు అన్నాను' నేను ఇకనుంచి ఏ పండుని పనికిరానిది అని అనను ప్రతి పండు ప్రత్యేకమే అని నాకు అర్థం అయింది. దయచేసి నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఇంతలో జామ తోట అంతా కదిలిపోవడం మొదలైంది. చెట్లన్నీ అటూ ఇటూ ఊగి పోతున్నాయి. కాయలన్నీ నేలపై రాలిపోతున్నాయి. నన్ను కూడా ఎవరో కదుపుతున్నట్లు అనిపించింది.
*****************************************************************************
తొమ్మిది అయిపోయింది లేచి కాస్త అన్నం తినేసి పడుకో అన్న మాటలు వినిపించాయి. కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అమ్మ. ఇంతసేపు నేను కలగంటున్నానా అనుకున్నాను కళ్ళు నులుముకుంటూ. నేను సాయంత్రం అన్న మాటలకి అమ్మ బాధపడుతుంది క్షమించమ్మా ఇంకెప్పుడూ పళ్ళు తిననని మారం చేయను . అంతేకాదు ఇవాళ రాత్రి పడుకోబోయే ముందు ఓ జామకాయ తిని మరి పడుకుంటాను అనేసరికి అమ్మ ఆశ్చర్యంగా చూసింది. నాకు కల వచ్చినట్లు నీకు నాకు మాత్రమే తెలుసు కదా.