చందమామ కథలు-గాడిద జ్యోస్యం
సువర్ణానదీ తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడుండేవాడు. ఆయన పంచాంగాలు గుణించడంలో, ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్న చాలా గొప్పవాడని పేరు వచ్చింది. తరవాత జాతకాలు రాయటంలో అంతటి వాడు లేడని అనసాగారు.
సిద్ద్ధాంతిగారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంతిగారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదు.
క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహమూ, బోలెడంత డబ్బూ సంపాదించుకుని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారైనాడు. పంటలొచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతిగారు స్వగ్రామానికి వెళ్లి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్లు చేయించి, ధాన్యం కొట్లలో వేయించి, దాని అమ్మకానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని రాజధానికి తిరిగి పోతుండేవాడు.
ఒక ఏడు ఆయన ఈవిధంగానే తన గ్రామం వెళ్లాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసి పోశారు. మధ్యాహ్న భోజనం అయాక ఒక్ష కునుకు తీసి లేచి, సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నాడు.
ఆ సమయానికి ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిద పైన వేసుకుని ఇంటికి పోతూ, సిద్ధాంతి గారిని చూసి ఆగి, బాబూ? ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్లుంది. త్వరగా ఇల్లు చేర్చించండి! ఇంకా చూస్తారేం?' అన్నాడు.
“చేర్పిస్తాను ఇప్పుడేం తొందర వచ్చిందిరా?' అన్నాడు సిద్దాంతిగారు.
“తొందర కాకేమండీ? ఇంకో గంటలో భయంకరమైన తుఫాను ముంచుకొస్తుంటేనూ?'" అన్నాడు చాకలి ఆదుర్దాగా:
సిద్ధాంతి గారు నవ్వి, “నీ జోస్యం అఘోరించినట్టే ఉంది. ఈ కార్తెలో వానలే ఉండవు గదా. తుఫాను రావడమేమిటి? ఆకాశం చూడు, ఎంత నిర్మలంగా ఉందో! ఎక్కడా ఒక్క మబ్బు తునక లేదు. మంద మారుతం వీస్తున్నది! తెలిసీ తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు అన్నాడు.
“మీ మంచికోరే చెబుతున్నాను. కార్తెల సంగతి నేనెరగను కాని, ఇంకో రెండు గడియలలో తుఫాను రావటం మటుకు నిజం. వెంటనే బళ్లను పొలానికి తోలించి ఒక్క గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికీ తెప్పించుకోండి లేకపోతే, బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది! అంటూ చాకలి తన గాడిదను అదిలించి తన దారిన ముందుకు సాగిపోయాడు.
సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్లీ ఒక్కసారి ఆకాశాన్ని కలయజూశాడు. పడవముటగా చిటికన వేలంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాస్సేపటికల్లా, అడవి ఏనుగుల మందలాగా కారుమేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నదీ తెలియరాలేదు. ప్రపంచం చీకటిపడినట్లయి పోయింది. పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెకిలించగల పోరుగాలి సాగింది. ఆకాశాన ఉరుములూ, మెరుపులూ సాగి వాన ఆరంభమయింది.
సిద్ధాంతి గారికి ఏమి చేయాలో తోచలేదు, చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుని ఉంటే ఏమీ నష్టం ఉండేది కాదు. కాని పంచాగం ప్రకారం ఈ సమయంలో వానలుండటానికి వీలులేదు గనక సిద్ధాంతి గారు చాకలి మాట లక్ష్యపెట్టలేదు.
అన్నట్టు ఈ తుఫాను వస్తుందని చాక లికి గంటకిందటే ఎలా తెలిసింది? అని సిద్ధాంతి గారు ఆశ్చర్య పడ్డారు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తివెళ్లి, “ఒరే చాకలీ? నువు చెప్పినట్లే చిత్రంగా వాన వచ్చిందే! నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర 'నేర్చుకున్నావురా?' అని అడిగాడు.
“మరెవరోనా బాబూ, నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది. దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు. ఇంకో మూడు నాలుగు గడియల్లో వాన రాబోతోందనగా దాని వంటిమీదున్న రోమాలన్నీ నిలబడతాయి. అది చెవులూ, కళ్లూ పైకి తిప్పి మనకు వినబడని వానకోసం ఆలకిస్తుంది. తరవాత తోకను ముడిచి అటూ ఇటూ చిందులు తొక్కుతుంది! దాని జోస్యానికి తిరుగులేదు బాబూ!' అన్నాడు చాకలి.