చందమామ కథలు-విలువైన నిధి
దండకారణ్యానికి తూర్పు దిక్కుగా పర్వత సానువుల మధ్యలో ఉన్న చంద్రవరం గ్రామంలో సోముడనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు మరణించేనాటికి ఒక పాత ఇల్లూ, దానినానుకుని కొంత పంటపొలమూ మిగిలాయి వాడికి.
స్వతహాగా బద్దకస్తుడు కావడంతో పగలంతా రచ్చబండ మీదా, గుడి ప్రాంగణంలోనూ గడుపుతూ, ఎవరైనా జాలిపడి ఇంత పెడితే తిని రాత్రికి వారింట్లో పడుకుని కాలం గడుపుతూందేవాడు సోముడు.
ఒకరోజు రాత్రి సోముడు మంచి నిద్రలో ఉండగా అటకమీద ఎలుకలు చేసిన చప్పుడుకు మెలకువ వచ్చి అటక ఎక్కిచూడగా పొతకాలం నాటి పెట్టె ఒకటి కనిపించింది. దానిని చూడగానే వాడికళ్లు ఆనందంతో మెరిశాయి. అంతకాలమూ దానిని గమనించనందుకు తనను తాను నిందించుకుంటూ ఎలాగోలా కష్టపడి ఆ పెట్టెను అటకమీదినుంచి కిందికి దించాడు.
కానీ దాన్ని తెరిచి చూశాక అందులో కనిపించిన పనికిరాని పొత సామాన్లు వాడికి అంతులేని నిరాశను కలిగించాయి. నిద్రాభంగం చేసిన ఎలుకల్ని తిట్టుకుంటూ అన్యమనస్కంగా ఒకొక వస్తువునూ తీసి బయట పెట్టినవాడికి పెట్టె అడుగున ఒక తాళపత్రం కనిపించింది.
ఆ తాళపత్రంలో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకున్నవాడికి అంతులేని ఆనందం కలిగింది. చంద్రవరం గ్రామానికి పశ్చిమ దిశగా ఉన్న కొండల మధ్య ఉండే లోయలో ఒకశిథిలాయంలో గొప్పనిధి ఉన్నదని వాడికి ఆ పత్రం ద్వారా తెలిసింది.
కానీ అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే వివరాలు ఆ తాళపత్రంలో లేవు. సోముడు దిగులు పడకుండా మరునాడు తెల్లవారుజామునే బయలుదేరి ఊరికి పశ్చిమ దిశగా నడిచి ఓ గ్రామం చేరుకున్నాడు.
చాలాదూరం నడవటం వలన వాడికి నీరసం ముంచుకొచ్చింది. ఒకరిద్దరు గ్రామస్థులను, తినేందుకు ఏమైనా పెట్టమనీ అడిగాడు. వారు ఊరి పెద్దను భూమయ్యను కలవమని చెప్పారు.
సోముడు భూమయ్యను కలుసుకుని తనకింత అన్నం పెట్టమని బ్రతిమాలుకున్నాడు భూమయ్య వాడికి భోజనాలు పెట్టించాడు. షడ్రసోపేతమైన భోజనాన్ని అది “ఊరు కాని ఊల్లో నామీదఇంత ప్రేమ చూపించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు,” అన్నాడు సోముడు.
“నాకు తెలుసులే! అలా పెరట్లోకి వెళ్లి పశువులపాకను శుభ్రంగా ఊడ్చి, పశువులను శుభ్రంగా కడిగి కొట్టంలో కట్టేస్తే నా రుణంలో సగం తీరుతుంది," అన్నాడు భూమయ్య.
ఒక్క క్షణం తెల్లబోయినా భూమయ్య చెప్పిన పనిని పూర్తి చేసేసరికి అలవాటు లేని కారణాన వాడికి ఒళ్లంతా నొప్పులు పుట్టి భూమయ్య ఇంటి అరుగు మీదే ఒళ్లెరక్కుండా నిద్రపోయాడు.
మర్నాడు ఎవరో తట్టి లేపినట్టనిపించి లేచి కూర్చున్నాడు సోముడు. చేతికర్రతో అతడి భుజంమీద పొడుస్తూ... “లే.. లే... బారెడు పొద్దెక్కింది. పశువుల నలా కాసేపు అడవిలో తిప్పి తోలుకుర్నా” అన్నాడు భూమయ్య.
దిక్కులు చూస్తున్న సోముడితో, “నా రుణంలో సగం బాకీ అలానే ఉందనే సంగతిని మరిచిపోయావా ఏంటి?” అని హుంకరించాడు భూమయ్య,
పశువుల్ని తోలుకుని దాపులనున్న అడివికి వెళ్లక తప్పలేదు సోముడికి.
అలా వారం రోజుల పాటుగా ఉదయం తిన్న తిండికి సాయంత్రం, సాయంత్రం తిన్న తిండికి మర్నాడు ఉదయం పనిచేసినా అతడి బాకీ సగానికి సగం అలానే ఉండిపోతూ వచ్చింది.
ఈ వెట్టి చాకిరీ చేయడం కంటే పస్తు లుండటమే నయమనిపించి ఒక రోజున ఎవరికీ చెప్పకుండా పశువుల్ని కొట్టంలో కట్టివేశాక ఊరు వదలి పారిపోయి ఊపిరి పీల్చుకున్నాడు సోముడు.
కొంతదూరం నడిచాక వాడికి ఒక సాధువు ఎదురొచ్చాడు: సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి, “ఇక్కడెక్కడో ఒక శిథిలాలయం ఉన్నదని విన్నాను. అక్కడికి నాకు దారి చూపించి పుణ్యం. మూటకట్టుకోండి స్వామీ,' అన్నాడు సోముడు.
అందుకా సాధువు నవ్వి, సమాధానం చెప్పకుండా ముందుకు నడిచాడు.
“మరేం చేస్తే నాకు దారి చూపిస్తారో అదయినా చెప్పండి స్వామీ!" అని బ్రతిమాలాడు సోముడు.
తనతో రమ్మని చెప్పి తన ఆశ్రమానికి తీసుకువెళ్లి అతడు చేయవలసిన పనుల్ని వివరించాడు సాధువు.
రోజూ చీకటితోనే లేచి ఆశ్రమం శుభ్రం చేయటం, వాగు నుంచి నీరు తెచ్చి ఆశ్రమంలో ఉన్న పాత్రలన్నీ నింపటం, అడవి నుంచి తేనె, పళ్లూ, దుంపలూ సేకరించటం, సాధువుకు కావాల్సిన ఇతర ఏర్పాట్లన్నీ చూడటం, ఈ పనులతో సోముడికీ క్షణం కూడా తీరిక దొరికేది కాదు.
సాధువు కూడా అతడి పరిచర్యల వలన సంతోషించినట్లే కనిపించాడు. ఒక రోజు రాత్రి తన కాళ్లు పడుతూ నిద్రకు జోగుతున్న సోముడి తలమీద చేయివేసి, 'ఏదో ఆలయానికి దారి అడీగినట్లుగా ఉన్నావు. ఇప్పట్లో అక్కడికి వెళ్లే ఉద్దేశం లేదా ఏం?” అన్నాడు సాధువు,
“ఇంతకూ అక్కడికి వెళ్లి ఏం చేయాలనుకుంటున్నావో తెప్పనే లేదు నువ్వు,” అన్నాడు సాధువు.
సోముడు గతుక్కుమని, “అది పరమ రహస్యం స్వామీ!' అన్నాడు.
“నువ్వక్కడికి వెళల్ళాలనుకుంటున్నది నిధి గురించి కాదు కదా?' అన్నాడు సాధువు కళ్లు తెరిచి.
సోముడు రెండు చేతులూ పైకెత్తి “విషయాన్ని మీ వద్ద దాచి పెట్టినందుకు నన్ను మన్నించండి స్వామీ. నేను అక్కడికి వెళ్లాలనుకుంటున్నది నిధి కోసమే,' అన్నాడు.
“గతంలో నీలానే చాలామంది అక్కడికి వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారు నాయనా! నువ్వక్కడికి వెళ్లడం వేస్ ఏమీ ప్రయోజనం ఉండబోదు, అన్నాడు సాధువు సోముడిని జాలిగా, చూస్తూ.
“నేనక్కడికి వెళ్లి తీరాలి స్యామీ! నాకు పట్టిన.దరిద్రాన్ని వదిలించుకోవాలంటే అదొక్కటే మార్గం!" అన్నాడు సోముడు.
“సరే అయితే విను,' అంటూ శిధిలాలయానికి వెళ్లేందుకు అవసరమైన వివరాలు చెప్పాడు సాధువు. ఆ రాత్రికి ఆశ్రమంలోనే విశ్రమించి మర్నాడు ఉదయాన్నే శిథిలాలయానికి బయలుదేరాడు సోముడు.
కొండలూ, కోనలూ దాటి భీకరారణ్యం గుండా ప్రయాణించి ఎట్టకేలకు పాడుపడిన ఆలయాన్ని చేరుకున్నాడు సోముడు, ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసిన తరువాత ఆలయప్రాంగణమంతా ఎంత వెదికి చూసినా నిధి ఉన్న జాడ అతడికి తెలియరాలేదు. సాధువు మాటల్ని మననం చేసుకుంటూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు సోముడు.
మర్నాడు ఉదయం లేచి మరింత శ్రద్ధగా ఆలయపు గోడలమీద ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని, కళ్లల్లో కళ్లు పెట్టుకుని మరీ వెదికాడు;సోముడు, చివరికతడి శ్రమ ఫలించి ఒకచోట రాగిరేకుమీద చెక్కబడ్డ గోడలో తాపడం చేయబడిన ఫలకం కనిపించింది.
ఆత్రుతగా దాన్ని చదివాడు.సోముడు. దానిమీద ఇలా చెక్కబడి ఉంది. “ఇప్పుడు నీకు కష్టం విలువ తెలిసింది. దీనికంటే విలువైన నిధి ఎక్కడైనా ఉన్నదని ఎవరైనా చెప్పినా నమ్మకు!"
దానిని చూసిన వెంటనే అంతులేని నిరాశ కలిగింది సోముడికి. స్థిమితంగా ఆలోచించగా అందులోని గూడార్టం అవగతమైంది వాడికి. వెంటనే వెనుదిరిగి ఊరికి ప్రయాణమయ్యాడు.
తరువాత క్రమేణా బద్దకాన్ని వదుల్చుకుని తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పంటభూమిని సాగు చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాడు సోముడు.