చందమామ కథలు-అప్పు తెచ్చిన ముప్పు
శ్రీపురం అనే గ్రామంలో నారాయణ, రామ్మూర్తి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరిదీ వ్యవసాయమే.
రామ్మూరికి పదెకరాల పొలం ఉంటే, నారాయణకు ఉన్నది ఐదు ఎకరాలే. ఆర్థికంగా కూడా నారాయణ కంటే రామ్మూర్తి పరిస్థితే మెరుగ్గా ఉండేది.
పట్టణం నుండి షాహుకార్లు శ్రీపురం వచ్చి రైతులకు, ఇతరులకు సొమ్ములు అప్పులిచ్చేవారు. కొందరైతే అడక్కుండానే 'మొహమాటపెట్టి మరీ ఇచ్చేవారు.
కొందరి వద్ద పొలాలు స్థిరాస్తులూ తాకట్టు పెట్టుకుంటే, మరి కొందరి వద్ద తెల్లకాగితాల పైన సంతకాలు తీసుకునేవారు. వడ్డీ అధికమైనా, సునాయాసంగా అప్పు లభిస్తున్నందున నిస్సంకోచంగా తీసుకునేవారంతా.
నిజానికి రామ్మూర్తికి అప్పు చేసి వ్యవసాయం చేయవలసిన ఆగత్యం లేదు. అయినా సొంత సొమ్మును ఖర్చుచేయకుండా అప్పుచేసి వ్యవసాయం చేసేవాడు. వచ్చిన పంటను చీకటి బజారులో విక్రయించి బాగా సామ్ముచేసుకునేవాడు.
నారాయణకు మాత్రం అప్పు చేయడం సుతరామూ ఇష్టం ఉండేది కాదు. ఉన్న సొమ్ముతోనే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుక్కుని.. చాలినంత మేరకే పొలం సాగు చేసుకునేవాడు. అవసరమైతే భార్య మెళ్లో నగను అమ్మేసేవాడు. పంట చేతికి వచ్చాక మళ్లీ చేయించి ఇచ్చేవాడు. అందువల్ల ఉన్నది ఐదెకరాలైనా అందులో సగం కంటే ఎక్కువ సాగు చేసుకోలేకపోయేవాడు. దాంతో కుటుంబం గడపడం గగనమైపోయేది.
మిత్రుడి అవస్థ చూసిన రామ్మూర్తి నారాయణను కూడా షాహుకార్ల వద్ద రుణాలు తీసుకుని పొలమంతా పండించుకోమని ఒత్తిడి చేసేవాడు. అప్పు చేసేందుకు ఇష్టపడని నారాయణ మాత్రం ససేమిరా అనేవాడు.
నారాయణ భార్య సీతాలక్ష్మికి భర్త వరుస నచ్చేది కాదు. “చాలీ చాలని సొమ్ముతో ఎదుగూ బొదుగూ లేని వ్యవసాయం ఏం చేస్తావు? లోకంలో అప్పు చేయనివాడు ఎవడు? ఆ రామ్మూర్తిని చూసైనా నేర్చుకో," అంటూ సాధించేది.
“అప్పు, నిప్పు, తప్పు - ఈ మూడూ మనిషికి కష్టాలు తెచ్చిపెట్టేవే. ఏ కారణంగానైనా రుణం తీర్చలేకపోతే అది వెన్ను మీద రణమై కూర్చుంటుంది. అనాలోచితంగా నిప్పును తాకితే చేయి కాలుతుంది. అలాగే ఒకసారి తప్పు చేస్తే అది జీవితాంతమూ బాధిస్తూనే ఉంటుంది. వీలైనంత మటుకు వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. అప్పుచేసి పప్పుకూడు తినే కంటే, కష్టించి కల్లో గంజో తాగి పరువుగా బతకడం మేలు. ప్రశాంతంగా నిద్రించగలుగుతాం,” అంటూ భార్యను సమాధాన పర్చడానికి ప్రయత్నించేవాడు నారాయణ. సీతాలక్ష్మి అతడిని వెర్రివాడిలా చూసేది.
వరుసగా రెండేళ్లపాటు పంటలు పండకపోవడమో, పండిన పంట నాశనం కావడమో జరిగింది. రైతులందరూ కష్టాలలో పడ్డారు. భూకామందులు తట్టుకోగలిగినా, సన్నకారు రైతుల గతి దుర్భరమైంది. దేశంలో తిండి గింజలకు, పప్పు దినుసులకు, కరువు ఏర్పడింది.
“పట్నం షాహుకార్లతో చెప్పి అప్పు ఇప్పిస్తాను. మళ్లీ విత్తనాలు కొని సాగుబడికి పూనుకో,' అని సలహా ఇచ్చాడు రామ్మూర్తి నారాయణకు. సీతాలక్ష్మి కూడా అదేమాట అంది. కాని, అప్పు చేయడానికి అంగీరించలేదు నారాయణ. “అవసరమైతే కూలో నాలో ఐనా చేస్తాను కాని అప్పు మాత్రం చేయను,” అన్నాడు. భర్తపైన అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది సీతాలక్ష్మి,
ఒకరోజు ప్రభుత్వాధికారులు కొందరు హఠాత్తుగా రామ్మూర్తి ఇంటిపైన దాడి చేసి, అతను చీకటి బజారులో విక్రయించడానికి దాచి ఉంచిన ధాన్యం, పప్పు దినుసులు కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. విపరీతమైన జుల్మానా కూడా విధించారు. దాంతో ఉన్న సొమ్ము ఊడ్చి పెట్టి జరిమానా కట్టేసి, శిక్షనుండి తప్పించుకోగలిగాడు రామ్మూర్తి.
ఇంతలో రైతులకు అప్పులిచ్చిన షాహుకార్లు గ్రామం మీద పడి రెండు మూడేళ్లుగా తమ బాకీలు తీర్చడం లేదన్న మిషతో.. రైతుల పొలాలను, స్థలాలను, ఇతర స్థిరాస్థులను జప్తు చేసేసుకున్నారు.
అంతవరకు పిలిచి మరీ రుణాలు ఇచ్చిన షాహుకార్లు ఇప్పుడు బాకీ చెల్లించడానికి రామ్మూర్తికి గడువు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అతని పొలమూ, ఇల్లూ స్వాధీనం చేసేసుకున్నారు.
విషయం ఆలకించిన నారాయణ మిక్కిలి విచారించి మిత్రుడిని పరామర్శించడానికి వెళ్లాడు. “నేను మొదటినుండీ చెబుతూనే ఉన్నాను. అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేస్తే ఇలా పరాభవానికి గురికాక తప్పదు. అప్పుకు తోడు, చీకటి బజారులో ప్రవేశించి నువ్వు తప్పు కూడా చేశావు. నిప్పును తాకకముందే తెలుసుకోవాలి అది కాలుతుందని, చేయి కాలిందని ఆనకమొత్తుకుని ప్రయోజనం ఏమిటి?” అన్నాడు సన్నగా మందలిస్తూ, మిత్రుడి పలుకులలోని సత్యాన్ని గుర్తించిన రామ్మూర్తి పశ్చాత్తాపానికి గురయ్యాడు.
నారాయణ జాలిపడి, “జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఆర్థికంగా కోలుకునేంతవరకు నా భార్య నగలు అమ్మి నా పొలంలో ఉమ్మడి వ్యవసాయం చేద్దాం. దిగుబడిని చెరిసగం పంచుకుందాం,” అన్నాడు స్నేహితుడిని ఓదార్చుతూ.
మిత్రుడి మంచితనానికి కన్నులు చెమ్మగిలడంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు రామ్మూర్తి. గ్రామంలో జరిగిన సంఘటనలను గురించి ఆలకించిన సీతాలక్ష్మి నిర్ధాంతపోయింది. భర్త ఔన్నత్యం గుర్తింపుకు రావడంతో వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది.
తన అవివేకాన్ని క్షమించమంటూ కోరిన భార్యను ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు నారాయణ.