చందమామ కథలు-దయ్యం వదిలింది
వాగులపల్లిలో కాపురముంటున్న రైతు రాములుకు తిమ్మాపురంలో నివసించే రైతు సింహాద్రి తోడల్లుడవుతాడు.
ఇద్దరూ సన్నకారు రైతులే అయినా సింహాద్రి అనుభవజ్ఞులను సంప్రదిస్తూ చక్కగా తన పొలాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసేవాడు.
వ్యవసాయానికి సంబంధించిన ఏ కొత్త విషయం తెలిసినా సింహాద్రి తన పొలంలో అమలు జరిపి ఎక్కువ దిగుబడిని పొందడమే గాక తనకు లాభాన్ని తెచ్చిపెట్టిన అంశాలను తోటి రైతులతో చర్చిస్తూ వాళ్లు కూడా వ్యవసాయంలో ఎదగడానికి సహాయం చేస్తూండేవాడు. దీంతో రైతుగానే కాకుండా సమాజంలోనూ అతని స్ధాయి పెరుగుతూ వచ్చింది.
రాములు స్వభావం దీనికి పూర్తిగా వ్యతిరేకం. తనకు దిగుబడి బాగా వచ్చినప్పుడు అది ఏ కారణంగా వచ్చిందో ఎవరికీ చెప్పేవాడు కాడు. అలాగని ఏదయినా తెగులు సోకిపంట పాడయిపోతున్నప్పుడు కూడా ఇతర రైతులను హెచ్చరించేవాడు కాదు. దాంతో అందరి పైర్లకు బాగా నష్టం కలిగేది.
రాములు ఎంత కష్టపడినా సింహాద్రి స్థాయి ఎప్పుడూ అంతకు మించే ఉండేది. అందువలన రాములుకి సింహాద్రిని చూస్తే ఎంతో అసూయగా ఉండేది.
ఒకసారి వర్షాలు సరిగా లేక పొలంలోని బావిలో నీరు బాగా అడుగుకు వెళ్లిపోయి పొలానికి నీరు పెట్టడం కష్టమవుతుండేసరికి సాటి రైతులను కలుపుకుని ఆలోచన చేశాడు సింహాద్రి. తరువాత తన ఊరి వ్యవసాయాధికారితో మాటాడి ఆయన సలహాతో పట్నం వెళ్లి బావినుంచి పైకి నీళ్లు తోడే యంత్రాన్ని ఒకదానిని కొనుగోలు చేశాడు సింహాద్రి.
దానివల్ల నీరుతోడే శ్రమ తప్పడంతో పాటు పొలానికి తగిన నీరు చక్కగా అందడంతో అతని పొలంతో బాటు అతను కలుపుకున్న రైతుల పొలాలు కూడా ఆ యేడు బాగా పండాయి. ఆ తరువాత సింహాద్రి సలహాతో ఆ ఊళ్లోని మరికొంతమంది రైతులు కూడా జట్టుగా ఏర్పడి ఉమ్మడిగా అలాంటి యంత్రాలను కొనుక్కుని లాభపడ్డారు.
రాములుకి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అదీగాక అతని బావిలో నీరు కూడా ఆ సంవత్సరం చాలా లోతుకు పోయింది. తనుకూడా పొలంలో అలాంటి నీళ్లు తోడే యంత్రాన్ని పెట్టుకోవాలనుకున్నాడు.
అయితే అతనికి నలుగురినీ కలుపుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని తన దగ్గర కూడా తగినంత డబ్బు లేకపోవడంతో తప్పనిస్థితిలో ఊళ్లోని వరాల సెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు.
“ఈ సారి నా పొలం విరగపండితే ఈ అప్పు మొత్తం తీర్చడం ఎంత పని” అని కూడా అనుకున్నాడు రాములు. తను నీళ్లు తోడే యంత్రం కొంటున్న విషయం తోడళ్లుడికి తెలియడం రాములికి ఇష్టం లేకపోయింది. అలాగని ప్రక్క ఊళ్లో ఆ యంత్రాలను కొనుక్కున్న వాళ్ల సాయం తీసుకుందామన్నా వాళ్లు సింహాద్రికి చెప్పేస్తారని ఆలోచించి చివరకు తనే పట్నం బయలు దేరాడు.
అక్కడ నీరు తోడే యంత్రాల గురించి వాకబు చేస్తుంటే అతని వాలకం కనిపెట్టిన మనిషొకడు రాములుకి ఇటువంటి కొనుగోలులో ఎలాంటి అనుభవం లేదని కని పెట్టేశాడు. తాను మంచి యంత్రాన్ని కొనిపిస్తానని నమ్మబలికి, తనకు ఏదయినా వస్తువు అమ్మిపెడితే డబ్బు ముట్టజెప్పే వర్తకుని దగ్గరకు తీసికెళ్లి రాములు చేత నాసిరకం యంత్రాన్ని కొనిపించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చల్లగా మళ్లీ వెళ్లి తనకు రావలసిన డబ్బును వర్తకుని దగ్గర వసూలు చేసుకున్నాడు.
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్టు తయారయింది రాములు పరిస్థితి. నీళ్లు తోడే యంత్రం సాయంతో లాభాలు గడిద్దామనుకున్న రాములుకు ప్రాణం విసుగెత్తిపోయింది.
ఎందుకంటే నెలనెలా యంత్రానికి పోసే చమురు ఖర్చు రానురాను ఎక్కువ కాసాగింది. నిజానికి ఆ ఖర్చుతో పదిమంది కూలీలను పెట్టుకుని నీళ్లు తోడించుకోవచ్చును.
తన తోడల్లుడికంటే ఈ ఏడాది ఎక్కువ దిగుబడి సాధించి తన గొప్ప చూపించాలనుకుంటే ఇలాగయిందేమిటి దేవుడా అనుకుంటూ ఏం చెయ్యాలో పాలుపోని రాములు పొలం గట్టుమీద నిలబడి దీనంగా నిలబడ్డాడు.
అది చూసిన ఎల్లన్న అనే రైతు రాములుతో మాట్లాడి విషయం రాబట్టాడు. “మీ తోడల్లుడి ఊళ్లో కొన్నవన్నీ బాగానే పని చేస్తున్నాయి కదా మావా! నీదొక్కటీ పనిచేయడం లేదంటే దీనికి దయ్యం పట్టిందేమో... రక్తం తాగినట్టు చమురు తాగేస్తోంది. పోనీ గణాచారి చేత తాయెత్తు కట్టించి చూడు,' అని సలహా ఇచ్చాడు.
రాములుకి ఇప్పుడింకో దిగులు పట్టుకుంది. తన పొలంలో దయ్యం ఉందని తెలిస్తే తక్కిన పొలం పనులకు పనివాళ్లు రారు. దానితో ఏటా పండే గింజలు కూడా రాలకపోతే తన బతుకేంగాను?
అందుకే ఊళ్లోని గణాచారిని బతిమాలి చాటుగా తీసుకొచ్చి ఒకరోజు రాత్రిపూట తన పాలంలో నీటియంత్రానికి పూజ చేయించి తాయెత్తు కట్టించాడు గణాచారి. అందుకు రాములు దగ్గరనుండి బాగానే డబ్బులు వసూలు చేశాడు.
ఇంతచేసినా రాములుకి ఫలితం లేక పోయింది. తాయెత్తు దారి తాయెత్తుదే అయింది. నీటియంత్రం యధాప్రకారం చమురు తాగుతూనే ఉంది.
పైగా ఆనోటా ఈనోటా ఈ కబురు కూలీలకు తెలిసిపోయి వాళ్లు భయపడి పొలం పనులకు రావడం మానుకున్నారు. దాంతో రాములు మంచం పట్టలేదు తప్ప బాగా కుంచించుకుపోయినట్లు అయిపోయాడు.
ఇంతలో ఒకరోజు అనుకోకుండా వాగులాపల్లిలోని గ్రామాధికారితో పనుండి ఆ ఊరు వచ్చిన సింహాద్రి ఆ పని పూర్తయ్యాక తోడల్లుడిని చూసేందుకు రాములింటికి వచ్చాడు.
రాములు ఏమీ చెప్పకపోయినా పొలానికి వెళ్లగానే లోపం ఎక్కడుందో అతనికి విషయం అర్ధమయిపోయింది.
“అన్నగారూ! మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను. వినండి. ఏదయినా కొత్త వస్తువు కొనేటప్పుడు నలుగురిని సంప్రదించి కొంటే దాని మంచి చెడ్డలు తెలుస్తాయి. నిజానికి మీ నీళ్లు తోడే యంత్రం పనిచేయకపోవడానికి కారణం, దయ్యం పట్టడం కానే కాదు. అది నాసి రకంది.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు యంత్రానికి సంబంధించిన గొట్టాన్ని బావిలోని నీటిమట్టం కంటే చాలా ఎక్కువ ఎత్తులో పెట్టించారు. అందుకే ఎక్కువ చమురు తాగుతోంది. దాని ఎత్తును సరి చేస్తే మీ సమస్య తీరుతుంది.”
రాములుకు అర్ధమయింది. దయ్యం పట్టింది తన నీటి యంత్రానికి కాదు. తనకే అసూయ అనే దయ్యం పట్టింది. తను సింహాద్రి మీద అసూయ పడి అతని కంటే ఎత్తుకు ఎదగాలనే దుగ్ధతో తప్పుదోవలో నడిచినా అదేమీ పట్టించుకోకుండా తన సమస్య తీరేందుకు పరిష్కారం చెప్పిన తోడల్లుడి మంచి మనసుకు కృతజ్ఞతలు అర్పిస్తూ తలవంచుకున్నాడు.
ఆ తరవాత రాములు కూడా సింహాద్రి బాటలోనే నడిచి నలుగురి చేత మంచి అనిపించుకోవడమే కాకుండా మంచి దిగుబడులు కూడా సాధించాడు.