చందమామ కథలు-చిత్రకారుల యుక్తి
పూర్వం జయవిజయులని ఇద్దరు చిత్ర కారులుండేవారు. వారు ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని, ఎరిగినవాళ్లు పోల్చుకునేలాగ చిత్రించగలిగేవారు.
వారు తమ అపూర్వ శక్తులను అనేక రాజాస్థానాలలో ప్రదర్శించి. ఎన్నో బిరుదులూ బహుమానాలూ పొందుతూ దేశాటన చేశారు.
ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తన ప్రజ్ఞను ప్రదర్శించారు.
మాధవవర్మ వారితో, 'మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకొక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు. ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్తరువులనే వేసి నాకు చూపించండి. అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్లయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను,” అన్నాడు,
ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్లు కనబడ్డారు.
“మీరు తరచు మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు:కదా! ఆ ముఖాలను చిత్రించడం మీకేమంత కష్టం? 'అలా కనిపించి వెళ్ళిపోయిన దాసీ, దాని చిత్తరువు అచ్చు గుద్దినట్లు వేశారే. అంత కన్న ఇది కష్టమైన పని కాదు,' అన్నాడు మాధవవర్మ
జయవిజయులు ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు. వారి కళ్లు ఎమో మాట్లాడుకున్నాయి.
“సరే మహారాజా! ఈ పరీక్షకు మేము నిలబడతాం! అన్నారు వారు.
రాజుగారు నౌకర్లను పిలిపించి, 'ఈ చిత్రకారులిద్దరినీ చెరొక గదిలోనూ ఉంచి, చిత్రాలు పూర్తి అయినాక వాటిని నా వద్దకు తీసుకురండి. వారుండే గదులలో అద్దాలు గాని అద్దాలలాటివి గాని ఏమీ లేకుండా చూడండి' అన్నాడు.
రాజుగారి నౌకర్లు వారిని చెరొక ఖాళీ గదికి తీసుకుపోయారు.
ఎవరి ముఖం వారు చిత్రించడం సులువైన పనికాదు. అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలలో కుడి ఎడమలు
వ్యత్యాసంగా ఉంటాయి.
ఆ కారణం చేత, జయవిజయులు రాజాజ్ఞ ప్రకారం ఎవరి ముఖం వారు చేసుకోవడానికి ప్రయత్నించినట్టయితే ఫలితం సరిగా ఉండేది కాదు.
అయితే వారు ఆ పని చేయడానికి ప్రయత్నించలేదు. విజయుడి ముఖాన్ని జయుడు, జయుడీ ముఖాన్ని విజయుడూ చిత్రించ నారంభించారు,
ఒక్క ఘడియ లోపల ఇద్దరి చిత్రణా ముగిసింది. వారు తమ తమ చిత్రాలను "వేరు వేరు పెట్టిలలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు.
రాజుగారి చేతికి అందగానే రెండు పెట్టెలూ కలిసిపోయాయి. వాటిలో ఉన్న రెండు చిత్తరువులనూ ఆయన చెరొక చేతిలో పట్టుకుని వాటిలో గల వాస్తవ చిత్రణకు దిగ్భ్రమ చెందాడు.
ఆయన జయవిజయులను సభకురావించి, వారి శక్తిని ఎంతో కొనియాడి, ఇద్దరికీ ఘనంగా సన్మానం చేసి పంపించాడు.