చందమామ కథలు - నష్టం మూడు సార్లు
పర్షియాను ఒకప్పుడు పరిపాలించిన ఖుస్రోకు చేపలంటే చాలా ఇష్టం. ఒక నాటి ఉదయం ఆయన, తన భార్య అయిన షిరీన్‌తో మిద్దెమీద కూచుని ఉండగా బెస్తవాడొకడు ఆయన కొక చేపను తెచ్చి కానుకగా ఇచ్చాడు. అది చాలా అపురూపమైనది. చాలా పెద్దది కూడా. రాజు దానిని చూసి ఎంతో సంతోషెంచి, బెస్తవాడికి బహుమానంగా నాలుగువేల కాసులివ్వవలసిందిగా ఉత్తరువు చేశాడు. తన భర్త సంతోషం కలిగినప్పుడు ఈ విధంగా ఒళ్లు తెలియని బహుమానాలివ్వటం షిరీన్ చాలాసార్లు చూసింది. ఆమెకిది ఎంతమాత్రం ఇష్టం లేదు.
బెస్తవాడు అవతలికి వెళ్ళగానే షీరీన్ తన భర్తను కోప్పడింది. “ఒక్క చేపకు నాలుగువేల కాసులు బహుమానమా? ఇలా ఇవ్వటం మొదలు పెడితే రేపటి నుంచి ప్రతిదానికీ ఇదే ప్రకారం ఇవ్వవలసి వస్తుంది. ఎదో మిష పెట్టి వాడికిచ్చిన డబ్బు తిరిగి తీసుకోండి అంది. “ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం కంటే రాజరికాని తలవంపు మరొకటి ఉంటుందా? ఎదో ఈసారికిలా పోనిద్దూ, అన్నాడు ఖుస్రో.
“అలా ఎంతమాత్రం వీలులేదు. మన మర్యాదకు భంగం ఏమి కలుగకుండానె ఇచ్చినది పుచ్చుకోవచ్చు. నేను ఉపాయం చెబుతాను వినండి. అది మగదని వాడన్నట్లాయెనా, మగది అక్కర్లేదు. ఆడచేప కావాలని ఈ చేపను
వాడికి తిరిగి ఇచ్చెయ్యండి. అది ఆడదెనని వాడంటే, మగ చేప కావాలని అనండి. అని షరీన్ భర్తకు నమ్మకంగా సలహా ఇచ్చింది.
ఖుస్రోకు తన రాణి పై చాలా మక్కువ. ఆమెకు అసంతృప్తి కలిగించడం ఆయనకే మాత్రం ఇష్టం లేదు. అందుచేత ఆయన, తన మనసు బాధపడుతున్నప్పటికి బెస్తవాణ్ణి వెనక్కు పిలిపించాడు. “ఎమోయ్, ఈ చేప ఆడదా, మగదా?' అని అడిగాడాయన.
బెస్తవాడు రాజుకు వంగి సలాము చేసి, “హుజూర్, ఈ జాతి చేపలలో ఆడా మగా లేదు. ప్రతి చేపా దేనికదే గుడ్లు పెట్టి పిల్లలు పాదుగుతుంది, అన్నాడు.
ఖుస్రో ఈ మాటలకు విరగబడి నవ్వుతూ, బెస్తవాడికి ఎనిమిదివేల కాసులిమ్మని ఉత్తరువు చేశాడు. అంత డబ్పూ ఎంచి బెస్తవాడి బుట్టలో వేశారు. వాడు పరమానందంతో బుట్ట తీసుకు బయలుదేరాడు.
వాడు రాజభవనం ముందు అవరణలో నుంచి పోతూండగా, ఒక కాసు బుట్టలో నుంచి పడి, గచ్చుమిద దొర్లి ఎటోపోయింది. వెంటనే బెస్తవాడు బుట్టను కిందపెట్టి, చుట్టుపక్కల అంతా వెతికి, పడిపోయిన కాసు ఏరుకుని, సంతోషంతో బుట్టలో వేసుకున్నాడు.
ఇదంతా' మిద్దెమిద నుంచి ఖుస్రో అతని భార్యా చూస్తూనే ఉన్నారు.
"చూశారా, ఎంత నీచుడో! ఒక్క కాసు పడిపోతే, ఎవరికన్నా పేదవాడికి దొరుకుతుంది లెమ్మన్న ఔదార్యం కూడా లేకుండా వాడు దానికోసం వేటాడి తీసుకున్నాడు, అన్నది షిరీన్.
తన రాణీని తృప్పిపరిచెటందుకై, ఖుస్రో బెస్తవాడిని మళ్ళీ వెనక్కు పిలిపించి వాడితో ఇలా అన్నాడు.
“ఓరీ పరమ నీచుడా! ఒక్క వెండి కాసు పడిపోతే, అది ఏ పేదవాడికైనా దొరుకుతుంది లెమనుకోకుండా, దానికోసం అంత కష్టపడి వెతికావే, నీ అత్యాశనేమనాలి.
బెస్తవాడు నేలదాకా వంగి సలాము చేసి, “అల్లా ఏలినవారిని కటాక్షించాలి. ఒక్క కాసు పోయినందువల్ల నాకు దారిద్ర్యం వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. నా దృష్టిలో ఆ కాసు పవిత్రమైనది. దాని మీద ఒక వైపున రాజుగారి ముద్ర, రెండో వైపున ఆయన పవిత్రనామమూ ఉన్నాయి. అది నేలమీద పడి ఉంటే ఎవరైనా చూడక తొక్కుతారెమో అని భయపడ్డాను. హుజూర్ వారు మట్టిలో నుంచి కాసు విలువచేయని బెస్తవాణ్ణి ఏరగాలేందీ, నేను మట్టిలోనుంచి ఒక కాసు ఏరటంలో వింత ఏమిటి?' అన్నాడు వినయంగా.
వాడి తెలివితేటలకు ఖుస్రో పొంగిపోయి వాడికి మరో నాలుగువేల కాసులు అదనంగా ఇచ్చి పంపేశాడు.
దీనితో ఖుస్రోకు ఆంతరంగికుల సలహాలను పాటించటంలో ఉన్న ప్రమాదం అర్దమయింది. ఆ రోజే ఆయన నగర మంతటా ఈ విధంగా చాటింపు వేశాడు.
ఇతరులు చెప్పిన సలహా ప్రకారం మాత్రం ఎవరూ నడుచుకోవద్దు. ఇతరుల సలహాను గుడ్డిగా విన్నట్లయితే సగం పొరవాటును దిద్దుకోవడానికీ రెండు పొరపాట్లను అదనంగా చేయవలసివస్తుంది.