చందమామ కథలు-రాజార్హత
అవంతి సింహాసనం ఖాళీ అయింది. రాజు వీరమల్లుడు వృద్ధాప్యంతో చనిపోవడంతో, రాజ్యంలో అల్లకల్లోలం రేగింది. పొరుగు దేశం విదిశ, అవంతిని నేరుగా జయించలేక, అవంతిలో కొందరు స్వార్ధపరులను డబ్బుతో వశపర్చుకుని, వారి సహాయంతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి రాజ్యమంతా ఆందోళనలు రేపింది. పిమ్మట అవంతిపై దాడి చేయాలని దాని యోచన.
వీరమల్లుని భార్య కడు వృద్ధురాలు. పైగా సంతానం లేదు. ఆమె రాజ్యాన్ని నడపలేదు. దాంతో మంత్రి సహదేవుడు, రాణితో సంప్రదింపులు జరిపి, కొత్త రాజును నిలబెట్టడం కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు ఆరంభించాడు.
గురుకులం నుండి సుశిక్షితులైన కొందరు యువకుల్ని సమీకరించి, వారికి వివిధ పరీక్షలు పెట్టి, చివరకు ఇద్దరిని తేల్చారు. వారు సారంగపాణి, భూపతి.
అన్ని పరిక్షల్లోనూ ఇద్దరూ సమవుజ్జీలుగా నిల్చి మంత్రిని, రాణీని అయోమయంలో పడేసారు. బాగా ఆలోచించి, సహదేవుడు సభను సమావేశపర్చి, సారంగపాణీ, భూపతిలను పరిచయం చేసి, 'రాజప్రముఖులారా, వీరిద్దరూ రాజార్హత కోసం పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లోనూ వీరిద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా ఉండి, తిరిగి మనకే పరీక్ష పెట్టారు. వీరిరువురిలో అవంతి సింహాసనాన్ని అధిష్టించె యోగ్యత ఎవరికి ఉందో తేల్చవలసి ఉంది. రాజ్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది కనుక దాన్ని చక్కదిద్దే బాధ్యత వీరిరువురికీ అప్పగించి అలా వీరిద్దరిలో సరైన వాడిని సమర్దుడిని ఎంపిక చేయాలన్నది నా అభిమతం. దీనిపై మీ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకోవాలని కోరుతున్నాను, అన్నాడు.
ముహారాణీతో సహా సభికులంతా మంత్రి ఆలోచనను ఏకగ్రీవంగా ఆమోదించారు. తరువాత వెంటనే, మంత్రి యువకులతో, “వీరులారా! మన అవంతీరాజ్యం అచిరకాలం నుండీ, ప్రజారంజక పాలనకు, శాంతి సుభిక్షాలకు పెట్టింది పేరు. దురదృష్టవశాతూ మహారాజు మరణంతో కొన్ని బయటి స్వార్ధశక్తులు దేశంలో అరాచకత్వాన్ని సృష్టించి, దురాక్రమణ చేయాలని చూస్తున్నాయి. అందుకు ఊతంగా కొందరు ద్రోహుల సహాయంతో మన ప్రజానీకాన్నే మనకు వ్యతిరేకులుగా రెచ్చగొడుతున్నారు. మీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ దేశానికి రాజు కావటం తథ్యం.
అందుకే, మీకు ఓ పరీక్ష పెట్టదలి చాము. ఇరువురికి కొంత సైన్యాన్ని, అధికారాన్ని ఇస్తాం. మిమ్మల్ని మీరే రాజుగా భావించి ప్రజలకు దేశ స్థితిగతులు, స్వార్ధశక్తుల కుటిలయత్నాలు అర్ధమయ్యేలా వివరించి, ఆందోళనలు విరమింపజేయండి. అంతర్గత ద్రోహుల్ని కఠినంగా అణచండి. ఈ పనిలో ఎవరు సత్ఫలితాన్ని సాధించగలుగుతారో వారే అవంతీ దేశానికి రాజు, అన్నాడు.
సారంగపాణి, భూపతి వినయంగా, “మంత్రివర్యా, సింహాసనం కోసమే అని కాకుండా, ఈ దేశపౌరులుగా మా దేశాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. తర్వాత మాలో ఎవరు సఫలీకృతులయ్యారన్నది పెద్దల నిర్ణయం, ' అని చెరో కొంత సైన్యాన్ని తీసుకుని తలో దిక్కుకూ బయల్దేరారు.
వాళ్లు దేశం నాలుగు చెరగులా తిరుగుతూ, ప్రజల్ని సమావేశపరుస్తూ, తమను రాజప్రతినిధులుగా పరిచయం చేసుకుని, దేశ పరిస్థితులను వాళ్లకు వివరిస్తూ అంతర్గత ద్రోహుల విషపు మాటలు నమ్మకుండా ప్రభుత్వంతో సహకరించమని కోరసాగారు.
చాలా చోట్ల ప్రజలు వారి మాటలతో ఆందోళనలు విరమించారు. అది గమనించి అంతర్గత ద్రోహులు, వారిపై దాడి, చేయడంతో సైన్యం సహాయంతో. ధైర్య సాహసాలతో సారంగ పాణీ, భూపతి వారందరిని తుదముట్టించారు.
కొన్ని ప్రాంతాలలో, వారి మాటలు లక్ష్యపెట్టని ప్రజలు, విచక్షణా రహాతంగా దేశ ఆస్తులను విధ్వంసం చేయడమే కాక, సారంగపాణి, భూపతిల మీద కూడా దాడి చేయడంతో వారు, అటువంటి వాళ్లను సైన్యం సహాయంతో బంధించి రాజధానికి తెచ్చి కారాగృహంలో పడవేశారు.
అలా వారిద్దరి కృషితో, దేశంలో గొడవలు, హింస తగ్గుముఖం పట్టాయి. పరిస్టతులు అదుపులోకి వచ్చాయి. దానితో మంత్రి, మహారాణి, రాజప్రముఖులు అందరూ సంతోషించారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తన పాచిక పారకపోవడంతో విదిశ కంగుతింది.
మహారాజుని నిర్ణయించే రోజు రానే వచ్చింది. మంత్రి సహదేవుడు నిండు సభను ఎర్పాటు చేసి, సభికులతో, 'సభాసదులారా! ఈ యువకుల అవిరళ కృషితో అవంతి రాజ్యం ఆపదలను దాటుకుని నేటికి ఒడ్డున పడింది. ప్రస్తుతం అంతర్గత సమస్యలు తొలిగి దేశంలో శాంతి సుస్థిరతలు నెలకొన్నట్లె. ముందుగా అందుకు కారణభూతమైన వారిద్దరిని మనమంతా మనస్ఫూర్తిగా అభినందించాలి, అంటూ ఇద్దరినీ ఘనంగా సత్కరించాడు. ఆ సత్కారానికి సారంగపాణి, భూపతి ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలియజేశారు.
సహదేవుడు, సారంగపాణిని ఉద్దేశించి, "సారంగా, నువ్వు బంధించి తీసుకువచ్చిన ప్రజలు చేసిన తప్పిదమేమిటి, అని ప్రశ్నించాడు.
అందుకు సారంగపాణి, “వాళ్లు నాపై దాడి చేసి గాయపరిచారు. నన్ను నేను కాపాడుకోవడం కోసం, వాళ్లను బంధించవలసి వచ్చింది, అన్నాడు.
తర్వాత భూపతిని కూడా అలాగే ప్రశ్నించాడు. దానికి భూపతి, “నేను బంధించి తెచ్చిన వాళ్లు ప్రజల, దేశ ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. దేశ పరిరక్షణ కోసం వాళ్ళను బంధించక తప్పలేదు. అన్నాడు.
మంత్రి సహదేవుడు కొద్దిసేపు మహారాణితో చర్చించి, తర్వాత సభికులను ఉద్దేశించి, భూపతిని మహారాజుగా నిర్ణయించినట్టు ప్రకటించాడు.
వివరణగా, 'సారంగపాణి, భూపతి ఇద్దరూ దాదాపు అన్నిటిలోనూ సరిసమానులే. అంతర్గత ద్రోహులను శిక్షించడంలో, ఇద్దరి విధానం ఒకేలా ఉన్నప్పటికీ సామాన్య ప్రజలను అదుపు చేయడంలో వారు చూపిన వ్యత్యాసమే మా ఈ నిర్ణయానికి ఆధారం. సారంగ పాణి, రాజ్య సంపదను నాశనం చేస్తున్న వారిని వదిలివేసి, తనపై దాడి చేసిన వారిని మాత్రమే బంధించాడు. భూపతి అలా కాక, తనపై దాడిచేసిన వారిని అప్పటికి వదిలి, దేశ సంపదల్ని పాడు చేస్తున్న వారిని బందీలు చేశాడు. సారంగపాణి, తన స్వయ రక్షణకు మాత్రమే విలువ ఇచ్చాడు. భూపతి దేశ సంపదకు ప్రాధాన్యమిచ్చాడు. అందుకే ఈ దేశానికి రాజయ్యే అర్హతను అతడు పొందగలిగాడు, అన్నాడు.