చందమామ కథలు-రూపాయి పావలా
నల్లకాలువ గ్రామానికి, కొత్త పట్నానికి మధ్య వాగు పారుతుండేది. నారయ్య అనేవాడు తన బల్లకట్టుమీద తలకు పావలా చొప్పున వసూలు చేస్తూ అటూ ఇటు మనుషుల్ని చేరవేస్తూ ఉండేవాడు. కాలువ మీద పాతకాలపు వంతెన కూడా ఉండేది. ఎవరో ఒకరిద్దరు వంతెన మీద నడుచుకుంటూ వెళ్ళేవారు తప్ప, తక్కిన వారందరూ నారయ్య బల్లకట్టునే ఆశ్రయిస్తూ ఉండేవారు.
ఆ ఊళ్లోని చెంగయ్య, మంగయ్య అనేవాళ్ళు ఆ మధ్య పట్నంలో కొత్తగా పచారీ కొట్లు తెరిచారు. ఆ కారణంగా ఇద్దరూ రోజూ తెలతెలవారుతుండగా నారయ్య బల్లకట్టు ఎక్కి పట్నానికి వెళ్ళి తిరిగి సాయంత్రానికి గ్రామం చేరేవారు.
చెంగయ్య, మంగయ్య ఇద్దరూ కూడా స్థూలకాయులు ప్రతిసారి బల్లకట్టు మీద వీరిద్దరినీ సమంగా కూర్చోబెట్టడం నారయ్యకు కత్తిమీద సాములా ఉండేది. ఏమాత్రం బరువు అటు ఇటు ఎక్కువయినా బల్లకట్టు ఎటవాలుగా ఒరిగిపోతుందేది.
చెంగయ్య, మంగయ్యలను బల్లకట్టు మీద అటు ఇటు కూర్చో పెట్టి మధ్యలో మిగిలిన వారిని సర్దుతుండేవాడు నారయ్య, ఈ సర్దుబాటతోనే సగం తెల్లవారుతుందేది. క్రమంగా, ఈ సమస్య ఒక పూటతో తీరేది కాదని నారయ్యకు అర్ధమయింది. “వీళ్ళ వ్యాపారం సంగతి దేవుడెరుగు, కాని మధ్యలో నాకొచ్చాయి తిప్పలు అనుకుంటూ నారయ్య చిరాకు పడసాగాడు.
ఆఖరికి ఒకరోజు బాగా విసుగొచ్చి, “బాబులూ, పూటపూటకు మిమ్మల్ని సర్ది కూర్చోబెట్టడానికే నా సమయమంతా సరిపోయేలా ఉంది. ఇక నుండి వంతెనెక్కి వెళ్లి మీ పనులు చూసుకోండి. నడక ఆరోగ్యకరం కూడా, అన్నాడు చిరాగ్గా.
దాంతో చెంగయ్య, మంగయ్యలకు ఒళ్ళుమండి. 'నీ బల్లకట్టు లేకపోతే పని జరగదనుకున్నావా, అంటూ విసవిస వంతెనవైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న బల్లకట్టు మీది కొందరు మనుషులు నారయ్యతో, “నీకింత పొగరు పనికిరాదు. అసలే లావు మనుషులు, రోజూ వంతెనెక్కి వెళ్లి రావాలంటే ఎంత కష్టం. బల్లకట్టు నీకొక్కడికే ఉన్నదన్న బడాయితో వచ్చిన బేరాన్ని కూడా వదులుకున్నావు, అన్నారు.
అందుకు నారయ్య, “ఏం బేరంలే బాబూ, రోజూ వాళ్లను సర్ది కూర్చోబెట్టేసరికి నా తల ప్రాణం తోకకు వస్తోంది. నడక ఆరోగ్యానికి మంచిదే లెండి. వారంరోజుల్లో సన్నబడి ఆరోగ్యవంతులవుతారు. అప్పుడు మీరే అంటారు. మంచిపని చేశావు నారయ్యా అని, ఇక నాకు వాళ్లు ఎక్కనందువల్ల వచ్చిన నష్టం ఏం లేదు.పైగా వాళ్లు కూర్చునే స్థలంలో ఇప్పుడు ఐదుగురు కూర్చున్నారు. నాకు రూపాయిపావలా లాభమే కదా, అన్నాడు తల ఎగురవేస్తూ.
“ఓరి వీడి రూపాయి పావలా ఆనందం పాడుగానూ, వీళ్లిద్దరూ రోజూ నడిచి సన్న బడి ఆరోగ్యవంతులయిపోతే, నా ఆదాయం సంగతి ఏం కాను. అంటూ బల్లకట్టుమీద ఓ మూల కూర్చొని ఉన్న ఒక బక్కపలుచటి వ్యక్తి మనసులో తెగ బాధపడ్డాడు. అతడు ఆ ఊరి వైద్యుడు. చెంగయ్య, మంగయ్యలు తమ స్థూలకాయం మూలంగా వచ్చే అనేక సమస్యలకు అతని వద్ద వైద్యం చేయించుకుంటూ ఉంటారు మరి.