చందమామ కథలు-గుణవతి
పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడుండేవాడు. తండి తాతల నుంచి వస్తున్న వర్తకంలో అతను లక్షల కొద్దీ ధనం సంపాదించాడు. ఇరవయ్యోయేట అతనికి పెళ్ళాడాలనిపించింది.
గృహాణ: ప్ర్రియపహాతాయ దారగుణాః (భార్య గుణాలే గృహస్తుకు ప్రియాన్ని, హితాన్నీ చేకూర్చుతాయి) అని అతను
విని ఉన్నవాడు కావటం చేత శక్తిసారుడు సద్గుణవతి అయిన భార్యనే పెళ్లాడ నిశ్చయించుకున్నాడు.
అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాలమీద బయలుదేరాడు.
శక్తిసారుడికి సాముద్రికం బాగా తెలుసును. సాముదికం చెప్పే మిషమీద అతను ఎంతో మంది కన్యల చేతులు పట్టి చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లలాగ కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు కూడా.
అతను ఈ ప్రయాణంలో తన వెంట
రెండు శేర్ల వడ్లు తీసుకువెళ్లాడు. ఆ
వడ్లను తనకు నచ్చినట్లు కనపడిన పిల్లకిచ్చి 'అమ్మాయి ఈ వడ్లతో నాకీ పూటకీ భోజనం వండిపెడతావా?' అని అడిగేవాడు. ఈ మాట విని కొందరు అతన్నిచూసి వెర్రివాడన్నట్టుగా నవ్వారు. మరి కొందరు ఆశ్చర్యపడి, అది ఎలా సాధ్యమవుతుంది? అన్నారు. కాని ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు.
ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్లగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావెరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్లా, ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారు నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి దగ్గరకు వెళ్లి చెయ్యి చూసి, ఆమెలో మంచి లక్షణాలుండటం గమనించి, 'అమ్మాయీ, నా దగ్గిర వడ్లున్నాయి. వాటితో నాకిపూట భోజనం వండి పెడతావా? అని అందరినీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు.
గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు. ఆశ్చర్యపడనూ లేదు. ఆమె అతను కోరి నట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది.
ఆమె వడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తిసింది. ఆ ఊకను అవ్వకిచ్చి, 'దీన్ని బంగారు పనివాళ్లకు అమ్మి ఆ డబ్బులతో అటే పచ్చివీ, అటే ఎండువి కానీ కట్టెలు ఉసిరి పప్పూ పట్టుకురా, అన్నది.
అవ్వ అలాగే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది. బియ్యం చిమడగానే వార్చి గంజి తీసి అందులో కొంచెం ఉప్పు వేసి, ఉసిరిపప్పు నూరి ముద్దచేసి శక్తిసారుడికి ఇస్తూ, 'ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గంజి తాగండి. తరవాత కాస్సేపు విశ్రాంతి తీసుకుని, స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను,” అన్నది.
అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి, “వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి, కాస్త కూరా, మజ్జిగా పట్టుకురా! అన్నది.
అవ్వ తెచ్చిన కూర వండి, భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది.
శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూరా ముజ్జిగతో సహా కడుపునిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపూ, యుక్తి చూసి చాలా సంతోషమయింది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్ళాడవలసిందిగా కోరాడు. గుణవతి ఒప్పుకున్నది. అతను ఆమెను తన ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని చాలాకాలం సుఖంగా జీవించాడు.