చందమామ కథలు - తరం అంతరం
పల్లెలో ఉండే అరవై ఐదేళ్ల సీతారామయ్య, అతని భార్య ధనలక్ష్మి పట్టణంలో ఉన్న కొడుకు ఇంటికి వచ్చారు. కొడుకు ఈశ్వర్, కోడలు నీరజ ఇద్దరూ ఉద్యోగస్తులు. వారి పిల్లలు అభిషేక్ డిగ్రీ, అనిత పదవ తరగతి చదువుతున్నారు.
మనవల కోసమని అరిసెలు, సున్నుండలు, కజ్జికాయలు, జంతికలు వండి తీసుకువచ్చింది ధనలక్ష్మి పిల్లల్ని పిలిచి వాటిని పెట్టింది. అనిత మొహమాటానికి తిన్నా, అభిషేక్ మాత్రం వాటిని రుచి చూడకుండానే వద్దనేసాడు.
“మీకోసమే లేని ఓపిక తెచ్చుకుని మరీ తెచ్చాను. కొద్దిగా తిని చూడు, అంటూ ఆవిడ మనవణ్ణి బ్రతిమాలుతుంటే, 'పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడ్డవాళ్లకు వీటి రుచి ఏం తెలుస్తుంది అత్తయ్యా! మేము వీటిని చూసి చానాళ్లయింది. నేను, మీ అబ్బాయి తింటాం, అంది కోడలు నవ్వుతూ.
ఉదయం పిల్లలిద్దరూ ఉపాహారం ముగించుకుని కళాశాలకు వెళితే.. కొడుకు, కోడలు పాఠశాలకు భోజనం తీసుకుని హడావిడిగా ఆఫీసులకు పరుగెత్తుత్రారు. చీకటి పడ్డాక గాని ఇంటికి తిరిగిరారు. రోజంతా ఇంట్లో సీతారామయ్య, ధనలక్ష్మి ఒంటరిగా ఉండేవారు,
పిల్లలిద్దరూ సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి పెట్టిందేదో తిని కంప్యూటర్ ముందో, పుస్తకాలు ముందు వేసుకునో కూర్చుంటారు. రాత్రి భోజనం వేళవరకు అక్కణ్ణుంచి కదలరు. మనవలతో కాసేపు సరదాగా గడవాలన్న ఆ వృద్ద దంపతుల ఉబలాటం నీరుకారిపోయేది.
ఓసారి కోడలితో, 'ఇరవై నాలుగ్గంటలూ చదువే ఐతే ఆ పిల్లలు ఇక ఆడుకునేదెప్పుడర్రా? వాళ్ల ఆరోగ్యం ఏం కానూ!” అంది.
ధనలక్ష్మి కోడలు నవ్వి, “ఇది పోటీ ప్రపంచం అత్తయ్యా! జీవితంలో నిలదొక్కుకోవాలంటే ఇప్పట్నుంచే కష్టపడక తప్పదు మరి, అంది.
పిల్లలకు రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో అత్తగారిని, మామగారిని బైట తిప్పి తీసుకురమ్మని వాళ్లకు పురమాయించింది నీరజ. తాతయ్యను, నాన్నమ్మనూ తీసుకుని, సాయంత్రం ట్యాంక్ బండ్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్‌లో జరుగుతున్న ప్రదర్శనలను చూపించారు అన్నా చెల్లెళ్లు ఉత్సాహంగా.
తిరిగి వస్తుంటే దారిలో గొడవ జరుగుతూండటం కనిపించింది వారికి. రౌడీలా ఉన్న ఓ వ్యక్తి ఓ పెద్దాయనను కొడుతున్నాడు. అక్కడ చేరిన వారిని విచారిస్తే. రౌడీ ఆ పెద్దాయన గురించి అసభ్యంగా వ్యాఖ్యానించాడనీ, పెద్దాయన అభ్యంతరం చెబితే ఎదురు కొడుతున్నాడనీ తెలిసింది.
'వాడికి నేను బుద్ధి చెప్పి వస్తాను,” అంటూ అభిషేక్ కోపంగా వెళ్లబోతే, 'మనకెందుకురా?' అంటూ మనవణ్ణీ ఆపబోయింది ధనలక్ష్మి "అన్నయ్యను వెళ్ళనీ నాన్నమ్మ! 'అంది అనిత.
ఆ రౌడీ చిన్నవాడైన తన మనవణ్ణి ఏం చితగ్గొడతాడోనని-ఆ వృద్ధ దంపతులు ఆందోళన చెందుతుంటే... అభిషేక్ వెళ్లి వాణ్ణి నాలుగు తన్నడంతో రౌడీ కాళ్ళకు బుద్ధిచెప్పాడు. తిరిగి వచ్చిన మనవడి వంక ధనలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంటే, “దుష్టులకు దూరంగా ఉండాలిరా, అభీ! వాడు నిన్నేమైనా చేసుంటేనో? ఇంకెప్పుడూ గొడవల్లో తలదూర్చకు, అన్నాడు సీతారామయ్య.
అభిషేక్ నవ్వి, 'దుష్టులకు దూరంగా ఉండాలన్నది మీ కాలం ఆలోచన తాతయ్యా! మా యువతరం సిద్దాంతం ఎమిటో తెలుసా? దుష్టులకు బుద్ధి చెప్పడం! అన్నాడు సగర్వంగా. అన్నకు వత్తాసుగా నవ్వుతూ బొటనవేలు చూపించింది అనిత.
"ఔరా, ఈ కాలపు పిల్లలు ఎంత ఎదిగి పోయారు! అనుకుంటూ ఆశ్చర్యం, ఆనందాలతో ముఖాలు చూసుకున్నారు ఆ వృద్ధ దంపతులు.