చందమామ కథలు-చౌక బేరం
హంసవరం అనే ఊరిలో వరాలయ్య అనే ఓ మధ్య తరగతి కుటుంబికుడు ఉన్నాడు. తన ఊరికి పక్కనే ఉన్న పట్టణంలో ఓ సంస్టలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ రోజూ సైకిలుపై వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం అతడి దినచర్య.
ఆపీసుపని ముగించుకుని పట్నం నుండి తిరిగి వచ్చే సమయంలో ఇంటికి సరిపడా పప్పు దినుసులు, కూరగాయలు వంటివి తీసుకువస్తూ భార్యామణి సితారత్నాన్ని సంతోషపెడుతుంటాడు.
అయితే సీతారత్నం తన భర్త వరాల య్యను పట్నం నుండి తీసుకువచ్చే ప్రతి వస్తువు ధరను అడిగి పొంగిపోతూ ఉండేది. కారణం అవే వస్తువుల ధరలు ఊరిలో ధరలతో పోలిస్తే చాలా చౌకగా అనిపించేవి.
చుట్టుపక్కల ఇరుగుపొరుగు వారితో ముచ్చట్లు మాట్లాడుకునే సమయంలో వారి వద్ద కనిపించే ఉప్పు, పప్పు, వంకాయ, బీరకాయలు ధరల్ని అడిగి తన భర్త తీసుకు వచ్చే ధరలతో పోల్చి మరింత సంబరపడిపోతుండేది. పారుగున ఉన్న ఆడవాళ్లందరూ ఆమెను చూసి కాస్త ఈర్ష్య పడేవారు.
అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు వరాలయ్య ఇంటిపక్కనే ఉన్న ఆచారి గారి అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఆ సందర్భంగా ఆచారి వరాలయ్యని ఆశ్రయిస్తూ, "వరాలయ్యగారూ, నిన్ననే మీ శ్రీమతిగారిని కలిసి పప్పులు, ఉప్పులు కూరగాయల ధరల్ని అడిగి తెలుసుకున్నా... మన ఊరి ధరలతో పోలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇదిగో నిన్ననే వంటమనిషి చేత సరకుల జాబితా రాయించుకు వచ్చాను. మీరు నాకు ఈ జాబితా ప్రకారం సరుకుల్ని ఇప్పించారంటే చాలా ఖర్చు నాకు తగ్గించినవారవుతారు. దయచేసి ఈ సాయం చేసి పెట్టండి. అంటూ ఆచారి తన సరకుల జాబితాను వరాలయ్య చేతిలో పెట్టాడు.
ఆచారి పొారుగింటివాడయినందున వరాలయ్య నవ్వుతూ ఆ జాబితాను అందుకోక తప్పలేదు.
ఆ రాత్రి వరాలయ్య ఆచారి ఇచ్చిన జాబితాని వివరంగా చదివి పడుకున్నాడు. అయితే వరాలయ్యకి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. రాత్రి అంతా కునుకు రాక వరాలయ్యకి ఒళ్లంతా వెచ్చగా అయిపోయింది.
ఉదయం లేచి పనికి నీరసంగా బయలుదేరుతూ దీనంగా మొహం పెట్టి ఉన్న వరాలయ్యని చూసి సితారత్నానికి అనుమానం కలిగి, "అలా ఉన్నారేమిటీ, ఏమయింది మీకు, అంటూ వరాలయ్యను నిలదీసి అడిగింది.
వరాలయ్య అప్పుడు నిజాలు ఒక్కోటి బయటపెడుతూ, 'కొంపమునిగింది. ఇన్నాళ్లుగా సరుకుల్ని పట్నం నుండి కారుచౌకగా కొనుక్కురావడం పచ్చి అబద్దమే రత్నం. నీ మెప్పుకోసం రోజూ ధరలు తగ్గించి చెప్పి నువ్వు పాంగిపోతుంటే నాకూ చాలా ఆనందం కలుగుతుండేది. కాని ఆచారి నిన్న అందించిన జాబితా చూసేసరికి రాత్రి నాకు గుండె ఆగిపోయినంత పనయింది. ఇంత మొత్తంలో నేను రోజూ చెప్పే ధరలకి తీసుకురావాలంటే, ఆచారి ఇచ్చిన డబ్బుకు నా సంవత్సరం జీతమంతా కలిపినా చాలదే. రత్నం.. ఇపుడెలా.. అంటూ నెత్తీనోరూ మొత్తుకున్నాడు.
సీతారత్నం వరాలయ్య చెప్పిన మాటలు విని నిర్ధాంతపోయి కాస్సేపటికి తేరుకుని “మీ గొప్పలు మండా! ఇంకా నయం... ఇపుడైనా నిజాలు కక్కారు. మన పరువు పోతే పోయింది. మనం అప్పుల పాలు కాకూడదు. అసలు విషయం ఆచారికి చెప్పి జాబితా ఇచ్చేసి వస్తా' అంటూ ఆచారి ఇంటికి పరుగులు తీసింది సీతారత్నం.
“ఓరి నాయనో... జీవితంలో ఎప్పుడూ అబద్దాలతో ఆనందాన్ని కొనకూడదు, అంటూ నెమ్మదిగా రోడ్డుమిదికి సైకిలు ఈడ్చుకు వచ్చి డ్యూటీకి పరుగు లంకించాడు వరాలయ్య.