చందమామ కథలు-బంగారు జాతకం
బిడ్డపుట్టగానే జాతకం చూసిన శాస్త్రిగారు, 'ఈ అబ్బాయిది బంగారు జాతకం. పట్టిందల్లా బంగారమవుతుంది. పేరు బంగారయ్య అని పెట్టండి. అని సలహా ఇచ్చారు.
బిడ్డ తల్లిదండ్రులు చాలా సంతోషించి బిడ్డకు బంగారయ్య అని నామకరణం చేసారు.
బంగారయ్యకు బడి ఈడు వచ్చింది. అక్షరాభ్యాసం చేయించి తల్లితండ్రులు బంగారయ్యను బడికి పంపారు.
బంగారయ్య పెద్ద చదువుల వరకు వచ్చాడు. చదివిన చదువు చాలని తండ్రి అతడిని వ్యాపారంలో ఉంచాడు.
వ్యాపారంలో బంగారయ్య తెలివితేటలతో రాణించసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. కొడుక్కి యుక్తవయస్సురాగా దూరపు బంధువులమ్మాయి మాణీక్యంతో పెళ్లి చేశారు. ఒక మనవడిని ఒక మనవరాలిని చూశాక కొన్నాళ్లకు వాళ్లు చనిపోయారు.
వ్యాపార భారమంతా బంగారయ్య మీద పడింది. అతడి కష్టానికి అదృష్టం కూడ తోడయ్యింది. వ్యాపారంలో అగ్రశ్రేణీలో నిలబడగలిగాడు. తోటి వ్యాపారస్తులు అసూయ పడసాగారు.
ఒకసారి బంగారయ్యకు భార్యాబిడ్డలతో తీర్ద యాత్రలు చేయాలన్న తలంపు కలిగింది. నమ్మకమైన పని కుర్రాడిని ఇంట్లో కాపలా పెట్టి తీర్థయాత్రలకు బయలు దేరారు.
ఒకరోజు బంగారయ్య ఇంటి మీద దొంగలు పడ్డారు. కాపలాగా ఉన్న పని కుర్రాడిని చితక్కొట్టి డబ్బూ బంగారు కోసం ఇల్లంతా వెతికారు. బీరువాను బద్దలు కొట్ట చూశారు. అభరణాలు దొరికాయి. డబ్బందుకోలేదు. అప్పటికి ఆ రాత్రి రెండిళ్లలో దొంగతనం చేసుకున్నారు ఆ దొంగలు. సమయం మించిపోతుంది. ఇరుగుపారుగు వాళ్లు లేస్తే ప్రమాదమని తలిచి దొరికిన ఆభరణాలు మూట గట్టుకుని దొంగలు గాబరాగాబరాగా పెరటి గోడ దూకి చీకట్లో కలిసి పోయారు.
పనికుర్రాడు వీధిలోకి వచ్చి దొంగలు పడ్డారని లబోదిబో ఎడ్వసాగాడు. గోలపెట్టి ఇరుగుపారుగు వారిని నిద్రలేపాడు. విషయం తెలుసుకుని “అయ్యయ్యో అన్నారు. ఒళ్లు హూనమయిన పనికుర్రాడికి ప్రథమచికిత్స చేశారు. తెల్లారేసరికి బంగారయ్య ఇంట్లొ దొంగలు పడ్డారన్న వార్త ఊరంతా వ్యాపంచింది.
వ్యాపారస్తులు ఆ వార్త విని, 'బంగారయ్యఅదృష్టానికి తెరపడింది. ఇల్లంతా దోపిడీకి గురయిందట అని సంబరపడ్డారు.
ఆ మరునాడే బంగారయ్య కుటుంబం తీర్దయాత్రలు ముగించుకుని ఇంటికి చేరింది. పనికుర్రాడు ఎడ్చుకుంటూ దొంగలు పడ్డ తీరు చెప్పాడు. బంగారయ్య అంతా విని పెరట్లోకి పరుగెత్తాడు. పెరట్లో బంగారయ్య పాతిన గులాబి మొక్క గోలెంలో భద్రంగానే ఉంది. అమ్మయ్య అనుకున్నాడు బంగారయ్య.
ఇంట్లోకి వెళ్లి బంగారయ్య పనివాడిని బయటకు పంపి భార్యతో పెరట్లోకి వచ్చాడు. గోలెంలో ఉన్న గులాబీ మొక్కను పీకి మట్టి కింద ఉన్న రెకుపెట్టెను తీశాడు. ఎందుకయినా మంచిదని బంగారం డబ్బూ ఇందులో దాచాను. భద్రంగానే ఉన్నాయి. అలా చెయ్యడం ఎంతో మంచిదయింది. దొంగలకు దొరికిన ఆభరణాలు నకిలీవి," అని భార్యతో అన్నాడు.
భార్యకు అంతా అయోమయంగా
ఉంది. అంతలో పిల్లలు వచ్చి, నాన్నగారండీ, గోడ పక్క పొదల మధ్య ఈ మూట దొరికింది, అని ఒక మూట ఇచ్చారు. అంతలో ఇంటికి ఎవరో రావడం వల్ల అందరూ ఇంటి లోపలికి వచ్చేశారు.
వచ్చిన వాళ్లు పరామర్శించి వెళ్ళిన తర్వాత బంగారయ్య భార్యతో గదిలోకి పోయి మూట విప్పి చూశాడు. అందులో రక రకాల బంగారు ఆభరణాలతో పాటు తను బీరువాలో దాచి పెట్టిన నకిలీ ఆభరణాలూ ఉన్నాయి. అవి చూసిన బంగారయ్య కళ్లు జిగేల్మన్నాయి. 'గత జన్మలో దొంగలు మనకు బాకీపడి ఉంటారు. అందుకే మన నగలతో పాటు బంగారు నగల మూట విడిచి వెళ్లారు, అని భార్యతో అన్నాడు.
తేరుకున్న బంగారయ్య భార్య తమ అదృష్టానికి లోలోపల పొంగి పోయింది. ఈ విషయం బయటకు పొక్కకూడదని ఇద్దరూ తీర్మానించుకున్నారు.
అంతలో తోటి వ్యాపారులు బంగారయ్య వచ్చాడని తెలిసి పరామర్శించడానికి కట్టకట్టుకుని వచ్చారు. జరిగిన దానికి సానుభూతి చూపబోయారు. వారు లోలోపల సంబర పడుతున్నారని గ్రహించి బంగారయ్య చిరునవ్వుతో 'మనకు ప్రాప్తి ఎంతో అంతే దక్కుతుంది. దేవుడు నా మేలును కోరతాడు. మీరు చింతించకండి, అన్నాడు.
వ్యావారస్తులు ఖంగు తిన్నారు. పైకి బంగారయ్య గంభీరం నటించినా అతని పతనం ప్రారంభమైందని మనసులో అనుకున్నారు.
రోజలు గడుస్తున్నాయి. బంగారయ్య వ్యాపారం వృద్ది చెందింది. అనుబంధ వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ఇబ్బడి ముబ్బడిగా లాభాలు రాసాగాయి. పాత ఇంటిని పడదోసి బంగారయ్య నూతన భవనం నిర్మించడం ప్రారంభించాడు. ఇది చూసిన వ్యాపారస్తులు నివ్వెరపోయారు. దొంగలు పడ్డ ఇల్లు వృద్ది చెందడం వారికి ఆశ్చర్యం కలిగించింది. 'బంగారయ్య పేరుకు తగ్గవాడే. అదృష్ట జాతకుడిని ఎవరూ చెరపలేరు,” అని అనుకున్నారు.