చందమామ కథలు-చేపల బావి
అడవిలో జంతువులన్నీ కలిసి కొద్దీిమేర దున్ని వ్యవసాయం చేయ నిశ్చయించాయి. మిగిలిన జంతువులతో పాటు
నక్కా, కుందేలు కూడా పారా పలుగూ పట్టి పనిచేయసాగాయి.
సూర్యుడు క్రమంగా పైకెక్కుతున్నాడు. నెత్తి మాడిపోతున్నది. కుందెలు ముచ్చెమటలు పట్ట అలిసిపోయింది. కాని పని చాలించి విశ్రాంతి తీసుకుంటే సోమరిపోతని మిగిలిన జంతువులు తిడతాయని భయపడింది. అట్లాగే పళ్ళ బిగువున కొంత సేపు పనిచేసింది.
కాని కుందేలు పని అయిపోయింది. ఎక్కడైనా చల్లని మాటున విశ్రాంతి తీసుకోకపోతే, ప్రాణం పోయటట్టుగా ఉంది. చేతిలో ఏదో ముల్లు గుచ్చుకున్నట్టు నటించి అది ఇవతలికి వచ్చేసింది. జంతువులు చూడకుండా పొదల వెనకగా దౌడు తీసి తోట బావి దగ్గిరికి చేరుకున్నది.
ఈ బావి చెట్టు నీడన ఉన్నది. దానికి ఒక గిలకా, గిలకమీదుగా తాడూ, తాడు రెండు చివరలా రెండు బొక్కనలూ ఉన్నాయి. ఆ బావి, నీడా చూడగానే కుందెలుకు ప్రాణం లేచివచ్చినట్లయింది. అది ఒక్క దూకున వెళ్ళీ బొక్కనలో పడింది. మరుక్షణమె ఆ బొక్కెన కుందేలు బరువు మూలాన అడుగుకు దిగసాగింది. కుందేలుకు కంగారెత్తుకొచ్చింది. ఎమయితే అది అవుతుందనుకుని, కుందేలు బొక్కెనలో కదలక మెదలక పడుకున్నది. నీటిని తాకగానే బొక్కెన నిలిచిపోయింది. కుందేలు కంగారులో అటూ ఇటూ కొట్టుకున్నట్లయితే మునిగిపోయె పనే!
కుందేలు మీద నక్క ఒక కన్ను వేసే ఉంచింది. అందుచేత, ముల్లు విరిగిందని వంకపెట్టి కుందేలు ఇవతలికి రాగానే నక్క అటూ ఇటూ చూసి చల్లగా తను కూడా జారుకుని కుందేలు వెనకాలే వచ్చింది. కుందెలు బొక్కెనలో దూకి బావి అడుగుకు వెళ్లిపోవటం నక్క అంతదూరం నుంచి చూసింది.
ఈ కుందేలు ఎదో ఉపయోగం లేనిదే ఈ బావిలోకి దిగి ఇంతసేపు కూచోదు. లోపల బంగారమెమైనా దాచిందెమో! అనుకుంటూ నక్క మెల్లిగా బావిని సమీపించి లోపలికి తొంగి చూసింది.
బావి చాలా లోతుగా ఉండటం చేత నక్కకు ఏమి కనిపించలేదు.
“కుందేలు బావా? అని నక్క పిలిచింది. "ఎవరదీ? నక్కబావా? అని లోపలి నుంచి కుందేలు కేకపెట్టింది.
“అక్కడ ఏం చేస్తున్నావేం? అని నక్క అడిగింది. "చేపలు పడుతున్నాను బావా! తెప్పల్లు తెప్పలుగా ఉన్నాయి. కావలిస్తే ఆ బొక్కెనలో ఎక్కి నువు కూడా రా?”
పైకి వచ్చి ఉన్న బొక్కెన లోకి నక్క దూకింది. కుందేలు కన్న నక్క బరువు కావటం చేత నక్క ఎక్కిన బొక్కెన కిందికి దిగి కుందెలు ఎక్కిన బొక్కెన పైకి రాసాగింది.
మధ్య దారిలో రెండు బొక్కనలూ ఒకదాన్ని ఒకటి దాటిటప్పుడు కుందేలు “నువు చేపలు పడుతూ ఉండు, బావా నేనిప్పుడే వస్తాను,” అన్నది.
త్వరలోనే కుందేలు పైకి వచ్చి బయటికి దూకి ఇంటిదారి పట్టింది.
పని పూర్తి చేసుకుని మిగిలిన జంతువులు మంచినీటి కోసం బావివద్దకు వచ్చి పైకి లాగేదాకా నక్క, పాపం, బావి లోనే ఉండిపోయింది.