చందమామ కథలు-నా బంగారు చేప ఎక్కడ?
భవానికి ఒక్కసారిగా దిగ్భాంతి కలిగింది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆమె ముందు గదిలోని చేపల తొట్టి వైపు అడుగేసింది. తొట్టిలోని చేపలను ప్రత్యేకించి బంగారు చేపను చూస్తే ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. చేపలను పలుకరించిన తర్వాతే ఆమె కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతుంది. కాని ఈ రోజు ఆమెకు ఇష్టమైన బంగారు చేప కనిపించలేదు. భవాని నిరాశలో కూరుకుపోయింది. ఎక్కడికెళ్ళి ఉంటుందది? గతరాత్రి పిల్లి లేదా కుక్క ఏదైనా ఇంట్లో దూరి తన బంగారు చేపను తినేసి ఉంటుందేమో అనుకోవడానికీ లేదు. ఎందుకంటే పిల్లి, కుక్కా తోస్తే బద్దలయేంత బలహీనంగా తొట్టిలేదు.
ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. చేపల్లోనే బంగారు చేప రత్నం లాంటిది. కిటికీలోంచి సూర్యకాంతి పడుతుంటే ఈ చేప అద్భుతమైన రంగుతో ప్రకాశిస్తుంది. క్షణం కాలం కూడా విశ్రాంతి లేకుండా అది ఈదుతూనే ఉంటుంది.
భవాని ఈ విషయమై 'అమ్మాఈ చేపకు విశ్రాంతి అన్నది ఉండదా?” అని అమ్మను చాలా సార్లు అడిగింది.
“ఎందుకు లేదు, దానికి కూడా విశ్రాంతి అవసరం!” అంటూ అమ్మకూడా చెప్పిందే చెబుతూ ఉంటుంది.
“లేదమ్మా! అది ఖాళిగా ఉండటం నేనెన్నడూ చూడలేదు. అది ఎప్పుడూ చురుగ్గానే కదులుతూ ఉంటుంది".
“భవానీ, బంగారు చేప నిన్ను బాగా ఇష్టపడుతోందేమో! అందుకే అది ఎప్పుడూ నీ ముందే కదలాడుతుంటుంది కాబోలు.” భవాని అమ్మతో ఏకీభవించింది. ఈ బంగారు చేపే ఇప్పుడు తప్పిపోయింది. నిజంగానే స్నేహంగా ఉంటాయా! స్నేహితురాళ్లు కనబడకపోయినా వాటికి పట్టదేమో.
భవాని ఏడవసాగింది. ఆమె తొట్టిలోకి తొంగిచూసింది. చేపల తొట్టిలోని నీరు నేలమీదికి కారి ఉండటం గమనించింది. నీరు గది పొడవునా ప్రవహించి ఇంటి ముఖ ద్వారం వద్ద నిలిచింది. ఉన్నట్లుండి ఆమెకు ఒక విషయం తట్టింది. తన స్నేహితులు ఎవరో ఇంట్లో ప్రవేశించి బంగారు చేపను తస్కరించి ఉండవచ్చు. వాళ్లు గాభరాతో ఈ పనిచేసినందువల్లే నీళ్లు గదంతా వ్యాపించాయి కాబోలు. అయినా ఎవరీపని చేసి ఉంటారు? ఖచ్చితంగా తన స్నేహితులలోనే ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చు. ఎవరు వారు? రమ్య? రాధ? రవి? మనసులో సందేహం పొడసూపగానే భవాని వెంటనే రమ్య ఇంటికి పరుగెత్తింది.
రమ్యను కలిసి మాట్లాడిన తర్వాత తన మనస్సులో ఆమెపై సందేహాన్ని తుడిచేసిందామె. తర్వాత రాధ ఇంటికెల్లింది. రాధతో మాటలాడుతున్నప్పటికీ ఆమె చూపు ఆ ఇంట్లోని చేపల తొట్టిపైకి మళ్లింది. రాధ వాళ్ల ఇంట్లోని చేపల తొట్టిలో బంగారు చేప కనిపించలేదు. రాధ మాత్రం భవాని ఏదో తీవ్రంగా విచారపడుతున్నట్లు పసిగట్టి, నిజం చెప్పమంటూ రాధ ప్రాధేయపడింది. భవాని వెక్కిళ్లు పెడుతూ జరిగింది చెప్పి బంగారు చేపకోసం వెతుకుతున్న విషయం బయటపెట్టేసింది.
“భవానీ, ఆ చేపను ఎవరు దొంగిలించారో నాకు తెలుసు. గంట క్రితం రవి మీ ఇంట్లోకి వెళుతుండటం చూశాను అప్పటికి నీవింకా నిద్ర లేవలేదు. అతను కాసేపట్లో మళ్లీ తిరిగొచ్చాడు. అతడే చేపను దొంగిలించి ఉంటాడని నా అభిప్రాయం. అతడి ఇంటికి పోదాం పద.”
ఇద్దరు అమ్మాయిలూ రవి ఇంట్లోకి ప్రవేశించారు. రవి అమ్మ వారిని ఆహ్వానించింది. “ఏమైందమ్మా? ఈరోజు పాఠశాలకు సెలవు కదా, నాకు తెలుసు. రవినుంచి ఏవయినా నోట్ పుస్తకాలకోసం వచ్చారా?”
“లేదు పిన్నీ భవాని చేపల తొట్టి నుంచి బంగారు చేప తప్పిపోయింది. ఈ విషయం తనకు తెలుసునేమో అని మేం రవిని అడగడానికి వచ్చాం. అంతే.”
వెంటనే రవి వాళ్లమ్మరవిని పిలిచింది. కాని అతడు మిద్దె పైనుంచి కిందికి రాలేదు. అమ్మపదే పదే పిలిచినా రాలేదు. అప్పడు వాళ్లమ్మతానే మిద్దిమీదకు వెళ్లి రవిని బలవంతంగా లేవదీసుకుని వచ్చింది.
“చూడరా, భవాని బంగారు చేప గురించి నీకేమైనా తెలుసా?”
“నాకా, బంగారు చేప గురించా? నాకేం తెలుసు?” రవి వాదించాడు.
“కాని నీవు పొద్దున్నే భవాని ఇంటికి వచ్చావు గదా?” అన్నది రాధ. “అక్కణ్ణుంచి దేన్నో దాపెట్టుకుని వచ్చినట్లుంది.”
“నేనా, లేదు లేదు. నేను ఏ బంగారు చేపనూ దొంగలించలేదు. నన్ను వదిలివేయిండి!" అంటూ రవి తన తల విదిల్పాడు. భవాని బాగా నిరాశపడి, పక్కనున్న కుర్చీలో కూలబడింది. “భవానీ! ఏం జరిగింది?” అంటూ రవి వాళ్ళమ్మ కేకపెట్టింది.
“నాకు కాసిన్ని నీళ్లు కావాలి పిన్నీ. నాకేమీ పాలుపోవడంలేదు.”
వెంటనేరవి వాళ్ళమ్మ గ్లాసుతో కుండలో నీళ్లు తీసుకుని వచ్చింది. నీళ్లగ్లాసును భవానికి ఇచ్చింది.
గ్లాసుకేసి చూస్తూ, పిన్నీ..!!! అంటూ గావుకేక పెట్టింది భవాని. ఆమె ప్రాణంగా చూసుకునే బంగారు చేప గ్లాసులోని నీళ్లలో ఈదులాడుతోంది.
“బంగారు చేప! ఇక్కడ ఉంది! అహా, అద్భుతం...” అంటూ రాధ కేక పెట్టి చప్పట్లు చరిచింది.
రవి వాళ్లమ్మ నివ్వెరపోయింది. అప్పటికే పాలిపోయిన ముఖంతో కనబడుతున్న రవికేసి చూసింది.
“నిన్ను నా కొడుకు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నానురా. చేపను దొంగిలించి తెచ్చినందుకు భవానికి క్షమాపణలు చెప్పు.”